కరోనా వార్ రూమ్‌ను ఏర్పాటు చేయనున్న ఢిల్లీ సర్కార్

కరోనా వార్ రూమ్‌ను ఏర్పాటు చేయనున్న ఢిల్లీ సర్కార్

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిపై పోరును 24 గంటలు పర్యవేక్షించేందుకు వార్ రూమ్‌ను ఏర్పాటు చేయాలని ఢిల్లీ సర్కార్ నిర్ణయించిందని సమాచారం. పరిస్థితి తీవ్రతను నిత్యం మానిటర్ చేయడంతోపాటు అవసరం మేర సూచనలను ఇవ్వడానికి కరోనా వార్‌‌ రూమ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు అధికార వర్గాలు ఆదివారం తెలిపారు. ఢిల్లీ సెక్రటేరియట్‌లో ఏర్పాటు చేస్తున్న వార్‌‌ రూమ్‌లో ప్రతి క్షణం పరిస్థితులను పర్యవేక్షించేందుకు 25 మంది నిపుణులు ఉంటారు. టెస్టింగ్స్, బెడ్‌ల సామర్థ్యం, మెడికల్ ఎక్విప్‌మెంట్, అంబులెన్స్ సౌకర్యాల గురించి వీళ్లు ఎప్పుడూ మానిటర్ చేస్తుంటారు.

వార్ రూమ్ ద్వారా కరోనా వ్యాప్తి, ట్రీట్‌మెంట్, ఫెసిలిటీస్‌ను తెలుసుకోవచ్చునని అధికారులు చెబుతున్నారు. ఇది త్వరలోనే ప్రారంభం అవుతుందని, సిద్ధంగా ఉండాలని అఫీషియల్స్‌కు చీఫ్ సెక్రటరీ విజయ్ దేవ్ సూచించారని సమాచారం. కరోనా పరిస్థితులపై అధికారులు తీసుకుంటున్న చర్యలను వార్ రూమ్ దగ్గరుండి పర్యవేక్షించనుందని తెలిసింది. ఒకవేళ కేసులు పెరిగే అవకాశంఉంటే ఎక్విప్‌మెంట్స్‌ను పెంచుకోవాల్సిన విషయాన్ని కూడా వార్ రూమ్ సూచిస్తుందని సమాచారం. అంబులెన్స్‌ల సంఖ్య సరిపడా లేకున్నా, పీపీఈ కిట్స్‌, బెడ్స్‌ లాంటివి అవసరమైన ఫెసిలిటీస్ వివరాలను చెబుతుందని తెలుస్తోంది. జిల్లాల మధ్య సరైన కోఆర్డినేషన్ కోసం వార్ రూమ్ ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు.