పంజాబ్‌‌లో మేలు జరిగేనా?

పంజాబ్‌‌లో మేలు జరిగేనా?
  • అగ్రిచట్టాల రద్దుతో బీజేపీ నేతల ఆశలు

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం అగ్రిచట్టాలను రద్దు చేయడంతో పంజాబ్ లో బీజేపీ కోలుకునే చాన్స్ ఉంటుందని, హర్యానా, వెస్టర్న్ యూపీలోని జాట్ వర్గం ప్రజలు శాంతించే అవకాశాలు ఉన్నాయని బీజేపీ నేతలు భావిస్తున్నారు. వచ్చే ఏడాది పంజాబ్, యూపీ, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. వీటిలో అగ్రిచట్టాల అంశం మిగతా రాష్ట్రాల కన్నా పంజాబ్, యూపీలో చాలా ప్రభావం చూపించే చాన్స్ ఉంది. అందుకే ఇప్పుడు చట్టాల రద్దుతో రైతులు శాంతించొచ్చని, పార్టీ నిలదొక్కుకునేందుకు అవకాశం ఉంటుందని యోచిస్తున్నారు. అగ్రిచట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్ లో సిక్కులంతా నిరసనల్లో పాల్గొన్నారు. బీజేపీకి రాష్ట్రంలో మిత్రపక్షమైన అకాలీదళ్ కూడా దూరమైంది. దీంతో రాష్ట్రంలో పార్టీ మళ్లీ కోలుకుంటుందా? అన్న ప్రశ్నలు వచ్చాయి. అలాగే హర్యానాలో జాట్ వర్గం రైతులు కూడా అగ్రిచట్టాలపై పోరాటం చేశారు. అటు వెస్టర్న్ యూపీలోని జాట్, సిక్కు వర్గం రైతులూ పోరుబాట పట్టారు. ఈ క్రమంలో అగ్రిచట్టాల రద్దు తమ పార్టీ కోలుకునేందుకు ఉపయోగపడుతుందని బీజేపీ నేతలు ఆశలు పెట్టుకున్నారు.

సిక్కులపై ఫోకస్.. కెప్టెన్ తో దోస్తీ

కెప్టెన్ అమరీందర్ సింగ్ అటు సీఎం పోస్టు నుంచి, ఇటు కాంగ్రెస్ నుంచి బయటకు రావడంతో ఆయన తో దోస్తీకి బీజేపీ ఇంట్రెస్ట్ చూపుతోంది. అగ్రిచట్టాల సమస్యను త్వరగా తేల్చాలంటూ కెప్టెన్​ ఇప్పటికే కేంద్రానికి విజ్ఞప్తి కూడా చేశారు. ఇప్పుడు చట్టాలను రద్దు చేయడంతో కెప్టెన్​తో దోస్తీ కట్టి ఎన్నికలకు వెళితే పార్టీ కోలుకునేందుకు వీలవుతుందని నేతలు భావిస్తున్నారు. మరోవైపు సిక్కులను ఆకర్షించేందుకు గురునానక్ జయంతి రోజునే మోడీ అగ్రిచట్టాల రద్దుపై ప్రకటన చేశారు. గురునానక్, గురు గోబింద్ సింగ్, గురు తేగ్ బహదూర్​ల జయంతి వేడుకలుకూడా కేంద్రం నిర్వహించింది. కర్తార్ పూర్ కారిడార్​ను తెరవడం వంటి చర్యలూ చేపట్టింది.