
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ మధ్యప్రదేశ్‌లోని రేవాలో అల్ట్రా మెగా సోలార్ పవర్ ప్రాజెక్ట్‌ను శుక్రవారం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే ప్రతి ఏటా సుమారు 15 లక్షల టన్నుల కార్బన్ డైయాక్సైడ్‌కు సమానమైన ఉద్గారాలను తగ్గిస్తుందని మోడీ పేర్కొన్నారు. అయితే 750 మెగావాట్ సామర్థ్యంతో నిర్మిస్తున్న ఈ సోలార్ పవర్ ప్రాజెక్టు ఆసియాలోనే అతి పెద్దదిగా చెప్పడాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. దీనిపై ప్రధాన మంత్రి కార్యాలయం పీఎంవో చేసిన ట్వీట్‌ను జత చేస్తూ అసత్యాలు చెప్పే వారు అనే అర్థం వచ్చేలా అసత్యాగ్రహి అని రాహుల్ ట్వీట్ చేశారు.
असत्याग्रही! https://t.co/KL4aB5t149
— Rahul Gandhi (@RahulGandhi) July 11, 2020
రాహుల్ కంటే ముందు కర్నాటక కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ కూడా రేవా పవర్ ప్లాంట్ విషయంలో మండిపడ్డారు. కర్నాటకలోని తుముకూరు జిల్లా పవగడలో 2 వేల మెగా వాట్ల సోలార్ పవర్ ప్లాంట్ ఉందని ఆయన గుర్తు చేశారు. 2018 నుంచి పని చేస్తున్న ఈ ప్లాంట్‌ను కేవలం మూడేళ్లలో అప్పటి రాష్ట్ర కాంగ్రెస్ సర్కార్ నిర్మించిందన్నారు. ఈ ప్లాంట్ నిర్మాణంలో రైతులకు చెందిన ఒక్క ఎకరా భూమిని కూడా తీసుకోలేదని చెప్పారు.