కాంగ్రెస్ పార్టీలో బుజ్జగింపుల కమిటీ పేరుకేనా?

కాంగ్రెస్ పార్టీలో బుజ్జగింపుల కమిటీ పేరుకేనా?
  • బుజ్జగింపుల కమిటీ పేరుకేనా?
  • లీడర్లు పోతున్నా, ఆందోళన చేస్తున్నా పట్టించుకుంటలే
  • ఒప్పించాల్సింది పోయి వార్నింగ్​లు ఇస్తున్న పెద్దలు
  • సెకండ్​ లిస్ట్​ తర్వాత అసంతృప్తులు మరింత పెరిగే చాన్స్​ 

హైదరాబాద్, వెలుగు : టికెట్ల ప్రకటనతో కాంగ్రెస్​పార్టీలో అసంతృప్తుల సంఖ్య పెరిగిపోతున్నది. అప్లికేషన్లు స్టార్ట్​అయిన దగ్గరి నుంచి లిస్ట్​ ప్రకటన వరకు పార్టీకి ఏదో ఒక రూపంలో అసంతృప్తి సెగ తగులుతూనే ఉంది. అసంతృప్తులను చల్లార్చేందుకే పార్టీ పెద్దలు సీనియర్​నేత జానారెడ్డి, మాణిక్ రావు ఠాక్రే, దీపాదాసు మున్షి, మీనాక్షి నటరాజన్​లతో కూడిన బుజ్జగింపుల కమిటీని ఏర్పాటు చేశారు. అయితే, చాలా మంది లీడర్లు ఓపెన్​గా పెద్ద లీడర్లపై ఆరోపణలు గుప్పిస్తున్నా.. పార్టీని వీడుతున్నా, వారిని కమిటీ బుజ్జగించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

పేరుకే కమిటీని ఏర్పాటు చేశారు తప్ప.. కమిటీ తన పని మాత్రం చేయడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. అది చాలదన్నట్టు అసంతృప్త లీడర్లకు పార్టీ పెద్దలు వార్నింగ్​లూ ఇస్తుండటం పార్టీ వర్గాల్లో విమర్శలకు తావిస్తున్నది. ఉండాలనుకున్నోళ్లు ఉంటరు.. పోయేటోళ్లు పోతరన్న ధోరణిలో పార్టీ పెద్దల తీరు ఉందని కొందరు నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. 

బీసీ లీడర్లు మొత్తుకుంటున్నా..

సీట్ల కోసం బీసీ లీడర్లు పోరాడుతున్నా, తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కుతున్నా వారితో ఈ బుజ్జగింపుల కమిటీ ఒక్కసారి కూడా భేటీ కాలేదు. హైకమాండ్​పిలిచి వార్నింగ్​ఇచ్చిందే తప్ప.. వారితో కూర్చొని మాట్లాడింది లేదు. పొన్నాల లక్ష్మయ్య కొన్నాళ్ల నుంచి తీవ్రంగా రగిలిపోతున్నా, పార్టీ పెద్దలు పట్టించుకోలేదు. కమిటీ ఏర్పడక ముందు జానా రెడ్డి ఒకసారి భేటీ అయి మాట్లాడినా పొన్నాలను కన్విన్స్​చేయలేకపోయారు. స్పష్టమైన హామీ ఇవ్వలేకపోవడంతోనే ఆయన పార్టీని వీడిపోయారన్న చర్చ సాగుతున్నది. ఇటు చెరుకు సుధాకర్​సహా మిగతా బీసీ లీడర్లతోనూ బుజ్జగింపుల కమిటీ సమావేశం నిర్వహించలేదు. ఇదిలాగే కొనసాగితే రెండో లిస్టు విడుదలయ్యే నాటికి బీసీల అసంతృప్తి మరింత పెరిగే చాన్స్​ ఉందనే చర్చ సాగుతున్నది. 
బుజ్జగించకుండా వార్నింగ్​లుటికెట్​రాలేదన్న ఆవేదనతో గాంధీభవన్​లో కొందరు లీడర్లు ఇటీవల నిరసన చేపట్టారు. రేవంత్​దిష్టిబొమ్మలను దహనం చేశారు. అయితే, వారిని మాణిక్​రావు ఠాక్రే పిలిచి వార్నింగ్​ఇచ్చారు. అంతేకాదు.. హద్దు మీరారంటూ ఇద్దరు నేతలపై సస్పెన్షన్​వేటు వేశారు. అయితే, దానికి బదులు టికెట్​ఏ పరిస్థితుల్లో ఇవ్వలేదో బుజ్జగింపుల కమిటీ పిలిచి మాట్లాడితే బాగుండేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం నాగం జనార్ధన్​ రెడ్డిని జానా రెడ్డి కలిసి చర్చించినా.. నాగం వినలేదని తెలుస్తున్నది. ఈసారి ఎట్టిపరిస్థితుల్లో ఆయన నాగర్​కర్నూల్​నుంచి బరిలోకి దిగాలని భావిస్తున్నట్టు తెలిసింది. 

చేరికలపైనే ఫోకస్​

ప్రస్తుతం పార్టీ నేతలు చేరికలపైనే ఎక్కువగా ఫోకస్​పెడుతున్నారని పార్టీ వర్గాలంటున్నాయి. కానీ, ఆ చేరికలతో ఆయా నియోజకవర్గాల్లో ఇప్పటికే ఉన్న నేతల్లోని అనుమానాలను మాత్రం పెద్దలు పట్టించుకుంటలేరన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఫలితంగా కొత్తగా చేరిన నేతలు, పాత నేతల మధ్య సఖ్యత కుదరకపోతుండటమూ అసంతృప్తులు పెరగడానికి కారణమవుతుందన్న వాదనలున్నాయి. ఇప్పటికైనా టికెట్​దక్కని అసంతృప్తి నేతలతో సంప్రదింపులు జరిపి వారిని బుజ్జగించాలని, లేదంటే మున్ముందు ఈ అసంతృప్తులు ఎక్కువై పార్టీకి నష్టం జరుగుతుందని పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చేరికలపై ఫోకస్​పెడుతూనే పాత లీడర్ల ఆందోళననూ గుర్తించి వారికి ధీమా ఇవ్వాల్సిన అవసరం ఉందంటున్నారు.