కరోనా ఎఫెక్ట్: మొత్తం లైఫ్ స్టైల్ ఆన్ లైన్

కరోనా ఎఫెక్ట్: మొత్తం లైఫ్ స్టైల్ ఆన్ లైన్

ఏడికెళ్లినా జేబులకెళ్లి పైసలు తీసి ఇచ్చుడు లేదు. సెల్​ఫోన్​తో క్యూఆర్​ కోడ్​ స్కాన్​ చేస్తున్నరు. మనసులో గుబులైనా, ఒంట్లో కొంచెం సుస్తీ చేసినా డాక్టర్లే ఆన్​లైన్​లోకొచ్చి ట్రీట్​మెంట్​ చెప్తున్నరు. ఆరాంసే టీవీ చూస్తూ ఒక్క క్లిక్​తో మెడిసెన్స్​  కూడా కొంటున్నరు. ఒక్క సబ్​ స్క్రిప్షన్​తో ఇంటిల్లపాది కొత్తకొత్త సిన్మాల్ని ఎంజాయ్​ జేస్తున్నరు.. బడికి పోయే పనిలేకుండా టీచర్లే  స్మార్ట్​ఫోన్​లోకి దూరి పాఠాలు చెప్తున్నరు. కూరగాయల నుంచి ఇంటికి కావాల్సిన సరుకులన్నీ ఆన్​లైన్​లోనే కొంటున్నరు. ఇన్ని మార్పులకీ కారణం కరోనానే.. టోటల్​  లైఫ్​ స్టయిల్​నే ఆన్​లైన్  చేసిందీ కరోనా వైరస్.

షాపింగ్​, పేమెంట్సే కాదు పెళ్లిళ్లు , ఫిట్​నెస్​  ట్రైనింగ్​లు ఇలా ఒక్కటేంటి కరోనా దెబ్బకి అన్నీ ఆన్​లైన్​ అయ్యాయి. బిగ్​ బాస్కెట్​, జియో మార్ట్​ లాంటి ఆన్​లైన్​ డెలివరీ సంస్థలు ఓ​ ట్రెండ్​గా మారాయి. ఈ సంవత్సరం  అమెజాన్​ సేల్స్​ టాప్​కి చేరుకున్నాయి. ఓటీటీ  ఫ్లాట్​ ఫామ్స్​ జోరు పెరిగింది. మొత్తానికి అంతా ఆన్​లైన్​ యుగం అయిపోయింది. కరోనా వల్ల వచ్చిన ఆ ఆన్​లైన్​ మార్పుల గురించే ఈ స్పెషల్​ స్టోరీ.. వాటివల్ల లాభాలతో పాటు నష్టాలేంటో చూద్దాం.

కరోనా వల్ల  పేరున్న కంపెనీలన్నీ నష్టాల్లో కూరుకుపోయాయి. కానీ, అప్పటివరకు పెద్దగా మార్కెట్​లేని బిగ్​ బాస్కెట్​ లాంటి ఆన్​లైన్​ స్టోర్స్​ మాత్రం లాభపడ్డాయి. 2011 నుంచి బిగ్​బాస్కెట్​ సేవలు మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. అయితే  కళ్ల ముందే కావాల్సినవన్నీ ఉంటే ఆర్డర్​ పెట్టుకోవడం ఏంటని ఆశ్చర్యపోయారు అందరూ. కానీ, కరోనా మనదేశంలో అడుగుపెట్టాక బయటికెళ్లి  కూరగాయలు, సరుకులు కొనే పరిస్థితి లేకపోవడంతో  బిగ్​బాస్కెట్​ సేల్స్​ విపరీతంగా పెరిగాయి.  మార్కెట్​లో పెద్దగా పోటీ కూడా  లేకపోవడంతో చేతినిండా లాభాలొచ్చాయి. మార్కెట్​లో  గ్రోసరీస్​ ఆన్​లైన్​ డెలివరీకి ఉన్న క్రేజ్​ చూసి  బిగ్ బాస్కెట్​కి పోటీగా మేలో రిలయన్స్​ గ్రూప్​ ‘జియో మార్ట్​​ ’కూడా లాంచ్​ చేసింది. తక్కువ టైంలోనే మిలియన్​ డౌన్​లోడ్స్​ సాధించిందీ ఈ ఆన్​లైన్​ స్టోర్​. ఈ ఆన్‌లైన్‌ స్టోర్లు లాభపడ్డాయి కానీ, లోకల్‌ మార్కెట్‌ని మాత్రం తొక్కిపడేశాయి.

మార్కెట్​ తెలియక

బిజినెస్​కి స్కోప్​ ఉన్న ఏరియాల్లో రెంట్​ భారీగా చెల్లించాల్సి  ఉంటుంది. పైగా  బిజినెస్​కి తగ్గట్టు వర్కర్స్​ని​ కూడా రిక్రూట్​ చేసుకోవాలి. గంటలు గంటలు స్టోర్​లో కూర్చొని కస్టమర్స్​ని , సేల్స్​ని గమనిస్తుండాలి. కానీ, ఆన్​లైన్​ స్టోర్​లో ఈ తంటాలేం అవసరం లేదు. సేల్​ అయిన వస్తువు ధరని బట్టి ఆన్​లైన్ స్టోర్స్​కి కమీషన్​ ఇస్తే చాలు. పైగా ఇంట్లో కూర్చొనే  పెద్ద మొత్తంలో సంపాదించొచ్చు. ఈ లాభాలన్నింటిని గమనించి తమ  వ్యాపారాలకి ఆన్​లైన్​ని వేదికగా చేసుకుంటున్నాయి చాలా కంపెనీలు. మరీ ముఖ్యంగా ఈ లాక్​డౌన్​ టైంలో  ఆన్​లైన్​ కల్చర్​ పెరగడంతో చాలా కంపెనీల చూపు ఆన్​లైన్​  ఫ్లాట్ ఫామ్స్​పై​  పడింది. కానీ, అమెజాన్​, బిగ్​ బాస్కెట్​ లాంటి పెద్ద  పెద్ద నెట్​ వర్క్​లతో టై అప్​ అవ్వలేని చిన్నాచితకా వీధి వ్యాపారాలు మాత్రం చాలావరకు మూతబడ్డాయి. తట్టాబుట్టా సర్దుకుని సొంతూళ్లకి వెళ్లిన వ్యాపారులు కూడా ఉన్నారు..

ఫ్యూచర్​ ఇదే

ఐదేళ్ల క్రితం వరకు ఆన్​లైన్​  షాపింగ్​ అంటే అప్పుడప్పుడు మాత్రమే చేసేవాళ్లు.  కానీ, ఇప్పుడు ఉప్పులు.. పప్పులు కూడా ఆన్​లైన్​లోనే కొంటున్నరు. దాంతో ఆన్​లైన్​ ఫ్లాట్​ఫామ్స్​ అతి పెద్ద బిజినెస్​ మార్కెట్స్​గా మారాయి. వీటి ద్వారా లక్షల కోట్ల బిజినెస్​ సాగుతోంది ఇప్పుడు. ఫ్యూచర్​లో ఈ బిజినెస్​ మార్కెట్‌​ రెట్టింపు అవడం ఖాయం. అందుకే రానున్న కంపెనీలు ఆన్​లైన్​ మార్కెట్​పైనే దృష్టిపెట్టాలి.  లేదంటే నష్టాలు చవిచూడక తప్పదంటున్నారు బిజినెస్​ ఎక్స్​పర్ట్స్​.. కానీ,ఆన్​లైన్​ మార్కెట్​ మరింత పెరిగితే లోకల్​ వ్యాపారులకు ఇబ్బందులు తప్పవనేది ఇంకొందరి వాదన.

ఎందుకింత క్రేజ్​

ఆన్​లైన్​ సేల్స్​ రోజురోజుకి పెరగడానికి వాళ్ల మార్కెటింగ్ టెక్నిక్స్​ కూడా ఒక కారణమే. లోకల్​ మార్కెట్​లో వందకి దొరికే వస్తువు డిస్కౌంట్​, క్యాష్​ బ్యాక్​ లాంటి ఆఫర్లతో  60 నుంచి 70 రూపాయలకే వస్తోంది ఆన్​లైన్​లో పండుగల టైంలో వన్​ ప్లస్​ వన్​ ఆఫర్లు, ధమాకా సేల్స్​  ఉండనే ఉన్నాయి. దాంతో వర్చువల్​ షాపింగ్​కే ఎక్కువగా  మొగ్గుచూపుతున్నారు జనాలు. ఒకప్పటితో పోల్చితే  ఆన్​లైన్​ ప్రొడక్ట్స్​ క్వాలిటీ కూడా బాగా పెరిగింది. ఒకవేళ ప్రొడక్ట్​ నచ్చకపోయినా రిటర్న్​ ఆప్షన్​ ఉంది. దాంతో ఆన్​లైన్  షాపింగ్ పై డిపెండ్ అయ్యే వాళ్ల సంఖ్య  ఎక్కువ అవుతోంది. మరీ ముఖ్యంగా ఈ కోవిడ్​ టైంలో బయట షాపింగ్​కెళ్లి షాపింగ్​ చేసే సిచ్యుయేషన్స్ లేకపోవడంతో ఆన్​లైన్​ సేల్స్ విపరీతంగా​ పెరిగాయి. మొదట వేరే ఛాయిస్​లేకే ఆన్​లైన్​ షాపింగ్ స్టార్ట్​ చేసినా  ఆఫర్లు, కలెక్షన్స్​ చూసి చాలామంది ఇష్టంగానే కొనేస్తున్నరు.

ఏం కొంటున్నరు

గ్రోసరీస్​ తర్వాత ఆన్​లైన్ షాపింగ్​లో ఎక్కువగా   మొబైల్స్, ఎలక్ట్రానిక్​ వస్తువులు, బట్టలు, బ్రాండెడ్​ షూస్, జువెలరీ, పర్​ఫ్యూమ్స్​, కెమెరాలు, వాషింగ్ మెషీన్లు, ఫ్రిజ్ వంటివి వస్తువులు ఎక్కువగా కొంటున్నారు.  వీటిలో ప్రధానంగా మొబైల్స్, ఎలక్ట్రానిక్​ గాడ్జెట్లను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. బయట షాపులలో ధరలకంటే ఆన్​లైన్​లోనే  ధరలు తక్కువగా ఉండటం, ఫీచర్స్​ కూడా బాగుండటంతో ఆన్​లైన్​లోనే షాపింగ్ చేస్తున్నామంటున్నారు చాలామంది. కానీ, ఆన్​లైన్​ అవగాహన లేని వాళ్లు, ఆర్థికంగా కాస్త వెనకబడ్డ వాళ్లు  మాత్రం ఈ వర్చువల్​ షాపింగ్​కి దూరంగానే ఉంటున్నారు..

వర్చువల్​ కన్సల్టెన్సీ

కరోనా వల్ల వచ్చిన అతి పెద్ద మార్పుల్లో వర్చువల్  డాక్టర్​ కన్సల్టెన్సీ ఒకటి. జలుబు, జ్వరం, దగ్గు, తలనొప్పి ఇలా సమస్య ఏదైనా సరే డాక్టర్​ దగ్గరికి వెళ్లాల్సిందే ఒకప్పుడు. కానీ, ఇప్పుడు పదేపదే  హాస్పిటల్స్​కి వెళ్లే పరిస్థితి లేదు.  కోవిడ్​ కారణంగా చాలా హాస్పిటల్స్​ జనరల్​ అపాయింట్​మెంట్స్  క్యాన్సిల్​ చేశాయి. ఆన్​లైన్​ ద్వారా పేషెంట్స్​కి ట్రీట్‌మెంట్ చేస్తున్నాయి.  దాంతో కూర్చున్న చోటు నుంచి కదలకుండా డాక్టర్​ సలహా మేరకు అవరమైన టెస్ట్​లు కూడా ఇంటినుంచే చేయించుకుంటున్నారు పేషెంట్స్​. మందులు కూడా ఆన్​లైన్ ద్వారా హోం ​ డెలివరీ చేయించుకుంటున్నారు. కానీ, హ్యూమన్​ టచ్​ లేకుండా ట్రీట్‌మెంట్ అంటే ఇబ్బందిగా ఉందంటున్నారు డాక్టర్లు, పేషెంట్స్​.. పేషెంట్​ని చూడంగనే సగం సమస్య  తెలిసిపోతుంది డాక్టర్స్​కి. డాక్టర్​ నాడి పడితే పేషెంట్​కి కూడా ఏం కాదన్న ధైర్యం వస్తుంది. కానీ, ఈ వర్చువల్​ కన్సల్టెన్సీలో అది సాధ్యం కాదు. పేషెంట్ సమస్య విని మందులు రాయడమే తప్ప సమస్య మూలాల్ని గుర్తించలేరు డాక్టర్లు. అసలు హ్యుమన్​ టచ్​ లేకుండా పేషెంట్​కి ట్రీట్‌మెంట్ ఇవ్వడం  ఒకింత కష్టమే అంటున్నారు డాక్టర్లు.

ఫోన్​ పే కరో..

సిటీలో ఏ  టీ కొట్టుకెళ్లినా, ఏ మూల టిఫిన్​ సెంటర్​కి వెళ్లినా ముందు అడిగే క్వశ్చన్​ ‘ఫోన్​ పే, గూగుల్​ పే ఉందా’ అని. డిజిటల్​ పేమెంట్స్ ఆప్షన్స్ వచ్చాక  ఐదు పదికి మించి డబ్బులు క్యారీ చేయట్లేదు. దాంతో డిజిటల్​ ట్రాన్సాక్షన్స్​ ఉన్న చోటికే వెళ్తున్నారు  కస్టమర్లు. అయితే, పెద్దగా ఆన్​లైన్​ నాలెడ్జ్​ లేని వాళ్లు, ఆ ప్రాసెస్​ తెలియని వాళ్లు మాత్రం ఎక్కడికెళ్లినా క్యాష్​తోనే లావాదేవీలు నడుపుతున్నారు. కానీ, కరోనా వైరస్​ ఎప్పుడెలా దాడిచేస్తుందో ఊహించలేం. డబ్బులు కూడా  వైరస్​ని అంటించొచ్చు. అందుకే డిజిటల్​ పేమెంట్స్​కి డిమాండ్ పెరిగింది. కానీ, ఈ మార్పు అందిరికీ అలవాటు అవ్వాలంటే కష్టమే…

అందరూ వాడట్లే

డిజిటల్ పేమెంట్స్ చేయాలంటే స్మార్ట్​ ఫోన్​ కంపల్సరీ.. ఆన్​లైన్​లో డాక్టర్​ కన్సల్టెన్సీ తీసుకోవాలన్నా ఫోన్​లో అపాయింట్​మెంట్​ బుక్​ చేసుకోవాల్సిందే. ఇక ఆన్​లైన్​ షాపింగ్​ అంటే  ఆర్టర్​ ఎలా పెట్టాలి, అమౌంట్​ ఎలా పే చేయాలో పక్కాగా తెలిసి ఉండాలి. ఇక సినిమాలంటే ఓటీటీ ఫ్లాట్​ ఫామ్స్​ సబ్​స్ర్కిప్షన్ కావాల్సిందే. వీటన్నింటికీ ఆన్​లైన్​పై అవగాహనతో పాటు స్మార్ట్​ ఫోన్​ కొనేంత స్తోమత కూడా ఉండాలి. నెలనెలా డేటా ప్యాక్​లు వేయించాలి. దాంతో కొందరు ఈ మార్పులకి దూరంగానే ఉంటున్నారు..కొందరు వీధి వ్యాపారులు డైరక్ట్​ లావాదేవీలకే ఆసక్తి చూపిస్తున్నా.. కస్టమర్స్​ డిజిటల్​ పేమెంట్స్​కి అలవాటు పడడంతో  బిజినెస్​ దెబ్బతింటుంది.

కామన్​ మ్యాన్​ వాయిసేంటి?

కరోనా నుంచి బయటపడ్డా ఈ ఆన్​లైన్​ యుగం నుంచి అంత త్వరగా అడుగు బయటికెయ్యలేం. భవిష్యత్తులో మరిన్ని కొత్త మార్పులొచ్చే అవకాశాలు లేకపోలేదు. ఓటీటీలు అతి పెద్ద బిజినెస్​ ఫ్లాట్​ ఫాంగా మారొచ్చు.. ఆన్​లైన్ షాపింగ్ హవా మరింత క్రేజీగా మారొచ్చు. ఆన్​లైన్​ చదువులూ, డిజిటల్​ పేమెంట్లకు  కూడా  డిమాండ్​ పెరగొచ్చు. మరి వీటన్నిటి మధ్య మిడిల్‌ క్లాస్‌ మనుషులు ఫ్యూచరేంటనేదే అసలు  ప్రశ్న. ఆ ప్రశ్ననే కొందరు వీధి వ్యాపారుల్ని, ఉద్యోగుల్ని, హౌస్ వైఫ్స్​ని అడిగితే  ఒక్కొక్కరూ ఒక్కోలా జవాబిచ్చారు. కొందరు వర్చువల్​ వరల్డ్​ భలే ఉందంటూ మెచ్చుకుంటే.. మరికొందరు మాత్రం వీటిల్లోని లోటుపాట్లని చెప్పుకొచ్చారు.– ఆవుల యమున

మోనోపొలీ పెరుగుతోంది

గల్లీకో పది ఇరవై కూరగాయలు బండ్లు ఉన్నాయి సిటీలో. ఇక క్లాత్, ఎలక్ట్రానిక్​ స్టోర్​లకైతే లెక్కేలేదు. అయితే ఆన్​లైన్​ మార్కెట్​ పెరిగితే డిమాండ్​కి తగ్గట్టు ఉత్పిత్తిదారులు ఈ లోకల్​ మార్కెట్స్​ని పక్కనపెట్టి ఆన్​లైన్​ స్టోర్స్​తోనే బిజినెస్ చేస్తారు. ఉత్పత్తి దారులు డైరక్ట్​గా తమ వస్తువుల్ని ఆన్​లైన్​ ద్వారా సేల్​ చేయడం వల్ల ఆ పర్టిక్యూలర్​ బ్రాండ్ వస్తువు లోకల్​ మార్కెట్స్​లో  కనిపించదు. దాంతో ఇష్టమున్నా లేకున్నా ఆన్​లైన్​లోనే కొనుగోలు చేయాల్సి వస్తోంది . దీనివల్ల ఫ్యూచర్​లో ఈ ఆన్​లైన్​ స్టోర్స్​లో మోనోపొలీ విపరీతంగా  పెరిగే అవకాశం ఉంది. అది వీధి వ్యాపారులకు ఒకింత నష్టమే.

ఆన్​లైన్​ చదువులొచ్చినయ్

బట్టలు, సరుకులే అనుకుంటే కరోనా వల్ల  పిల్లల చదువులు కూడా ఆన్​లైన్​ అయ్యాయి. ప్రైవేట్​ స్కూల్స్​  ఫోన్​ స్క్రీన్​నే బ్లాక్​ బోర్డ్​గా మార్చేశాయి. అప్పు చేసి మరీ పిల్లల కోసం స్మార్ట్​ ఫోన్​లు కొనే పరిస్థితులు తీసుకొచ్చాయి కొన్ని ఎడ్యుకేషన్​ ఇన్‌స్టిట్యూట్స్. ల్యాప్​టాప్​, ఫోన్​ లాంటి సౌకర్యాలు లేని వాళ్లకోసం దూరదర్శన్​లోనూ పాఠాలు మొదలయ్యాయి. కానీ, ఈ చదువులు పిల్లల భవిష్యత్తుకి ఏ మేర ఉపయోగపడతాయనేది  సందేహమే అంటున్నారు చాలామంది టీచర్లు.. క్లాస్​ రూంలో  పిల్లలతో డైరెక్ట్​ ఇంటరాక్షన్​ ఉంటుంది టీచర్స్​కి. పిల్లల దృష్టి కాస్త  మళ్లినా వెంటనే గమనించొచ్చు. కానీ, ఈ సెల్​ఫోన్​ చదువుల్లో అసలు వాళ్లు క్లాస్​ వింటున్నారో లేదో కూడా అర్థం కాదు. ఒకవేళ  విన్నా  ఈ వర్చువల్​ క్లాస్​లు ఎంతమేర వాళ్ల బుర్రకి ఎక్కుతున్నాయో తెలీదు. పైగా స్కూల్​ వాతావరణానికి దూరంగా ఎక్కువ కాలం ఆన్​లైన్​లో పాఠాలు సాగితే  ఆ ప్రభావం పిల్లల మానసిక వికాసంపైనా పడే అవకాశం ఉందంటున్నారు టీచర్స్​.

కంఫర్ట్​ ముఖ్యం

బయట షాప్స్​లో దొరకని లేటెస్ట్​ కలెక్షన్స్​ , మ్యాచింగ్​ జువెలరీ కూడా ఆన్​లైన్​లో  ఉంటాయి. అలాగే నచ్చిన వస్తువుని  సేవ్​ చేసుకునే  ఆప్షన్​ కూడా ఉంది.  ధరను కూడా నాలుగైదు వెబ్​సైట్స్​లో చెక్​ చేసుకుని  కొనొచ్చు. అందుకే ఆన్​లైన్​లోనే ఎక్కువగా షాపింగ్ చేస్తుంటా..పైగా  ఎప్పుడూ ఆఫర్స్ ఉంటాయి  ఆన్​లైన్​లో. నిర్ణీత సమయాల్లో బుక్​ చేస్తే   భారీ తగ్గింపు ధరలు, వన్​ ప్లస్​ వన్​ ఆఫర్లు, ధమాకా సేల్స్​కూడా ఉంటాయి. ఇన్ని ఆప్షన్స్​ ఉన్నప్పుడు షాప్స్​ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. మరీ ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత రిస్క్​ ఎందుకు?. అందుకే నన్ను అడిగితే ఆన్​లైన్​ షాపింగ్​ బెస్ట్ ఆప్షన్. -వైష్ణవి, ప్రైవేట్​ ఎంప్లాయ్

మునుపటిలా సాగట్లేదు..

నా పిల్లల చదువులకి, ఇంటి అవసరాలన్నింటికీ  ఈ బండే ఆధారం. చాలా ఏళ్ల నుంచి ఇక్కడే వ్యాపారం చేస్తుండటంతో ఇరుగుపొరుగు వాళ్లు తరచూ నా దగ్గరే కూరగాయలు తీసుకుంటరు. కానీ, కరోనా భయంతో ఇప్పుడు వాళ్లంతా ఆన్​లైన్​లోనే కూరలు కొంటున్నరు. ఇద్దరు ముగ్గురు రెగ్యులర్​ కస్టమర్స్​ మాత్రం నన్నే ఇంటికే పిలిపించుకుంటున్నరు. కానీ, ఆ డబ్బు ఖర్చుల మందం కూడా రావట్లేదు. బండి దగ్గరకి కస్టమర్స్​ వచ్చినా  ఫోన్​ పే, గూగుల్ పే ఉందా అని అడుగుతున్నరు. లేదంటే  డబ్బుల్లే వంటూ వెనక్కెళ్లిపోతున్నరు. మామూలు నోటి లెక్కలు వరకు నేను చేసుకోగలను ఫోన్​లో డబ్బులు పంపుడు మాత్రం తెలీదు..కానీ, కస్టమర్స్​ వెనక్కెళ్లిపోతుంటే మనసు ఊరు కోదు. దాంతో మా ఆయనకి కాల్​ చేసి మాట్లా డించి ఆయన ఫోన్​కి డబ్బులు పంపించమంటా. ఒక్కొసారి ఆయన టైంకి ఫోన్​ లిఫ్ట్​ చెయ్యక పోతే గిరాకీ పోగొట్టు కున్నట్టే. అయినా  ఇరవై ముప్పై రూపాయలకి కూడా ఫోన్​ పే, గూగుల్ పేలు ఎందుకు? అదీకాక ఆన్​లైన్​లోనే కూరగాయలు, సరుకులు కొంటుంటే నాలాంటి వీధి వ్యాపారుల పరిస్థితేంటి? -రూప, కూరగాయల వ్యాపారి, ఎమ్మెల్యే కాలనీ

ఇదే పెద్ద మార్పు

ఇద్దరు పిల్లలున్న ఒక మిడిల్ క్లాస్​ ఫ్యామిలీ సినిమా కెళ్లాలంటే టికెట్లకి  ఆరు వందల నుంచి ఎనిమిది వందలు ఖర్చు అవుతుంది. పాప్​కార్న్, కూల్​డ్రింక్స్​ ఖర్చులు కూడా కలిపితే వెయ్యి దాటుతుంది. అదే సినిమా  ఓటీటీలో రిలీజ్​ అయితే సబ్‌స్క్రిప్షన్‌తో ఇంటిల్లపాది సినిమాని ఎంజాయ్​ చేయొచ్చు. అది కూడా నచ్చిన టైంలో. నెలకు కొంత సబ్‌స్క్రిప్షన్‌ అమౌంట్‌ కడితే సరిపోతుంది. అందుకే ఓటీటీలకి ఆదరణ పెరుగుతోంది. వరుసగా ఓటీటీలో సినిమాలు రిలీజ్​ అయ్యి హిట్స్​ కొడుతున్నయ్​.  థియేటర్ల ఓపినింగ్​పై క్లారిటీ లేకపోవడంతో బడా నిర్మాతలు కూడా తమ సినిమాల్ని ఓటీటీలో రిలీజ్​ చేసే ఆలోచనలో పడ్డారు. భవిష్యత్తులో  ఓటీటీ ఫ్లాట్​ ఫామ్స్​ అతి పెద్ద బిజినెస్​ మార్కెట్​గా​ మారే అవకాశాలు లేకపోలేదు. థియేటర్లకి గట్టి పోటీ కూడా ఇవ్వొచ్చీ ఆన్​లైన్​ ఫ్లాట్​ ఫామ్స్​.

ఇదే బెస్ట్

సిటీలో వందల్లో షాపింగ్​ మాల్స్​, వేలల్లో బొటిక్​లున్నాయి. ఇలాంటి పోటీ వాతావరణంలో బిజినెస్​ అంటే ఎంతమేర సక్సెస్​ అవుతుందో తెలీదు.కలెక్షన్​ ఎంత బాగున్నా జనాలు ఆదరిస్తారన్న నమ్మకం లేదు. పైగా మెయింటెనెన్స్​కి పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుంది. ఇవన్నీ ఆలోచించే చాలామంది ఫ్యాషన్​ డిజైనర్లు తమ కలెక్షన్స్​ని నేరుగా  ఆన్​లైన్​లోనే రిలీజ్​ చేస్తున్నారు. సొంతంగా ఆన్​లైన్ ఫ్లాట్​ ఫామ్స్​ క్రియేట్​ చేసుకుని చీరలు, డిజైనర్​​ దుస్తులు సేల్​కి పెడుతున్నారు. బొటిక్​ లాంటివి ఏం లేకుండా ఇంట్లోనే  దుస్తులు, జువెలరీ డిజైన్​ చేసి లక్షల్లో సంపాదిస్తున్న వాళ్లూ  ఉన్నారు.

ఆన్​లైన్​లో మాత్రమే

మొబైల్స్​ కొనాలంటే ఆన్​లైన్​ స్టోర్స్​కి మించిన బెస్ట్ ఆప్షన్​ మరొకటి లేదు. బయట  ధరలతో పోల్చుకుంటే ఆన్​లైన్​లో మొబైల్స్​​కి  భారీ డిస్కౌంట్స్​ ఉంటాయి.  షోరూంలో దొరకని లేటెస్ట్​ ఫీచర్స్​  మొబైల్స్ కూడా ఆన్​లైన్​లో అందుబాటులో ఉన్నాయి. అందుకే మొబైల్స్​ కొచ్చేసరికి ఆన్​లైన్​కే మొగ్గుచూపుతున్నారు చాలామంది. కస్టమర్స్​ ఛాయిస్​కి తగ్గట్టే కొన్ని కంపెనీలు కూడా డైరక్ట్​ ఆన్​లైన్​ స్టోర్స్​లోనే తమ ప్రొడక్ట్స్​ని లాంఛ్​ చేస్తున్నారు.  లాంచ్‌​ అయిన ఐదుపది నిమిషాల్లోనే ప్రొడక్ట్స్​ మొత్తం సేల్​ అవుతున్నాయి.

బడులే బాగున్నయ్​

ఫోన్​ చేతికిచ్చి పాఠాలు వినమంటున్నరు ఇంట్లో. నాకేమో అసలు ఇంట్రెస్ట్​ వస్తలే. మధ్యమధ్యలో టీచర్​ క్వశ్చన్స్​  అడుగుతోంది. చెప్పకపోతే పనిష్మెంట్​గా హోం వర్క్​ ఇస్తోంది. నాకు అవేం నచ్చట్లే. స్కూల్​కి పోవాలనిపిస్తుంది. క్లాస్​ రూంలో అందరితో కూర్చొని పాఠాలు వినాలనుంది. గ్రౌండ్​లో సరదాగా ఆడుకోవాలని ఉంది. ఫ్రెండ్స్​తో ముచ్చట్లు పెట్టాలని ఉంది. కానీ, ఈ ఆన్​లైన్​ క్లాస్​లలో అవేం లేవు.-రిషిత, స్కూల్​ స్టూడెంట్

వర్చువల్​గా అనిపిస్తుంటుంది

షాప్​కెళ్తే పది రకాల కూరగాయలుంటాయి.అది కూడా అందుబాటు ధరలో. పైగా రేటు నచ్చక పోతే బేరమాడే ఆప్షన్​ ఉంటుంది. కేవలం కూరగాయల విషయంలోనే కాదు డ్రెస్‌, షూస్​, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్​ ఏది కొనాలన్నా ఇదే ఫార్మెట్​ ఉంటుంది. కానీ ఆన్​లైన్​ కొచ్చే సరికి క్వాలిటీ చెక్‌​ చేయలేం. ​డిస్క్రిప్షన్​లో రాసిన నాలుగైదు పదాలను ఆధారంగా చేసుకుని ఆర్డర్​ పెడితే ఐటమ్​ ఎలా వస్తుందో తెలీదు. పైగా లైవ్​ షాపింగ్​ ఎక్స్​పీరియన్స్​ రాదు. -చంద్రశేఖర్​, స్టూడెంట్.

ఎక్స్​పీరియన్స్​ బాగుంది

మా పెద్దోడు షూస్​, బట్టలు అన్నీ ఆన్​లైన్​లోనే కొంటడు. అవి చూసినప్పుడు బానే ఉన్నయ్​ అనిపిస్తది. అయితే ఇంటికోసం ఏదైనా బుక్​ చేసే సాహసం ఎప్పుడూ చేయలే. కానీ, ఈ కరోనా వల్ల బయటికెళ్లే పరిస్థితి లేకపోవడంతో ఈ మధ్య ఆన్​లైన్​లో సరుకులు కొంటున్నాం. రీసెంట్​గా వాషింగ్​ మెషీన్‌​ కూడా ఆన్​లైన్​లోనే బుక్​ చేశాం. ‘అన్ని వేలు పెట్టి కొంటున్నం’ ఏమైనా అయితే? అని మొదట చాలా కంగారుపడ్డాం. కానీ, ప్రొడక్ట్​ చూస్తే బానే అనిపించింది. భవిష్యత్తులో కూడా ఆన్​లైన్​ షాపింగ్​ చేస్తాం.-నాగిరెడ్డి, రైతు, ఖమ్మం.

A young happy girl shopping in an online store. The concept of online shopping, lifestyle, business.