ప్రచార రథాల పరుగులు..జోరందుకున్న ఎన్నికల క్యాంపెయిన్  

ప్రచార రథాల పరుగులు..జోరందుకున్న ఎన్నికల క్యాంపెయిన్  
  • ప్రచార రథాల పరుగులు..
  • జోరందుకున్న ఎన్నికల క్యాంపెయిన్  

హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రాకతో  అన్ని పార్టీల్లో నేతల ప్రచార హడావిడి మొదలైంది.  గ్రేటర్ సిటీలో 24  సెగ్మెంట్లు ఉండగా.. అధికార బీఆర్‌‌ఎస్ ఇప్పటికే 21 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో కొందరికి బీ ఫామ్ లు కూడా అందజేసింది. కాంగ్రెస్ తొలివిడతగా 55 స్థానాల్లో అభ్యర్థులను  ప్రకటించింది. బీజేపీ ఇంకా కసరత్తు చేస్తుంది. టికెట్ కన్ఫమ్ అయిన వారు.. టికెట్ తమకే వస్తుందనే ధీమాతో ఉన్నవారు కూడా ప్రచారం మొదలెట్టేశారు. అప్పుడే కొందరు నేతల ప్రచార రథాలు రోడ్డెక్కాయి.  గల్లీలు, రోడ్లపై తిప్పుతున్నారు. కొందరు సొంత వాహనాలకే డిజైన్లు చేయిస్తుండగా, ఇంకొందరు అద్దెకు తీసుకుంటున్నారు. 

వీటిదే కీ రోల్ 

ఎన్నికల ప్రచారంలో రథాలదే కీ రోల్ . వివిధ పరిస్థితుల్లో క్యాంపెయిన్‍ చేయాల్సి ఉంటుంది. ఇందుకు సౌకర్యవంతమైన వాహనాలను తయారు చేయించుకోవడానికి ప్రతి నేత ఇంట్రెస్ట్​ చూపుతారు. దీంతో కుత్బుల్లాపూర్ సూరారం పారిశ్రామికవాడ, ముసారంబాగ్ ప్రాంతాల్లో పార్టీల ప్రచార రథాల తయారీ జోరుగా నడుస్తుంది. ఎన్నికలు ఏవైనా ప్రచార రథాలను ఇక్కడ తయారు చేస్తుంటారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికలు నువ్వానేనా అన్నట్లుగా జరుగనుండగా  అన్ని పార్టీలు పోటాపోటీగా రథాలు తయారు చేయించే పనిలో బిజీ అయ్యాయి. ఒక్కోవాహనానికి డిజైన్ చేయడానికి సుమారు లక్ష నుంచి రెండున్నర లక్షల వరకు ఖర్చవుతుందని నిర్వాహకులు చెబుతున్నారు. డిజైన్‌ బట్టి ఖర్చు పెరుగుతుందని  పేర్కొంటున్నారు. ఎన్నడూ లేని విధంగా ఈసారి భారీగా ఆర్డర్లు వస్తున్నాయంటున్నారు. 

ఏదీ తక్కువ కాకుండా.. 

పార్టీల అగ్రనేతలతో పాటు నియోజకవర్గస్థాయి నేతలు, అభ్యర్థులు కూడా తమకు అనుకూలంగా ప్రచార రథాలు సిద్ధం చేసుకుంటున్నారు.  ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నేపథ్యంలో వీలైనంత త్వరగా ప్రచార వాహనాలు సిద్ధం చేయాలని తయారీ సంస్థలకు నేతల నుంచి ఒత్తిడి పెరుగుతుంది.  ప్రచార వాహనాల్లో మైక్ సెట్లు, సౌండ్ సిస్టమ్, ఎల్ఈడీ స్క్రీన్ వంటి ఫీచర్లను ఏర్పాటు చేయిస్తున్నారు. వాహనాలను బుక్ చేసుకోవడంలో బీజేపీ నేతలు అందరికంటే ముందున్నట్లు తయారీదారులు చెబుతున్నారు. డిమాండ్ ఎక్కువగా ఉండడంతో వాహనాల సరఫరాదారులు పొరుగు రాష్ట్రాల నుంచి అద్దెకు తీసుకొస్తున్నట్లు తెలిసింది. నేతల్లో కొందరు అవసరాన్ని బట్టి నెలవారీ ప్రాతిపదికన అద్దెకు తీసుకుంటున్నారని, ఇంకొందరు ఎన్నికలు అయ్యేంత వరకు ఒకేసారి బుక్ చేసుకుంటున్నారని, అయితే నేతలకు అవసరమైన విధంగా వాహనాల్లో మార్పులు చేసుకుంటున్నట్లు చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన ఎవరికి వారే ఖర్చు చేసుకోవాల్సి ఉంటందని వాహనాలు అద్దెకిచ్చే వారు స్పష్టంచేస్తున్నారు.