బల్దియా నైట్ షెల్టర్లు సరిపోవట్లే!

బల్దియా నైట్ షెల్టర్లు సరిపోవట్లే!

బల్దియా నైట్ షెల్టర్లు సరిపోవట్లే!
చలి తీవ్రమవడంతో పెరుగుతున్న నిరాశ్రయుల సంఖ్య
ఒక్కో చోట కెపాసిటీకి మించి ఆశ్రయం

హైదరాబాద్, వెలుగు : సిటీలో చలి రోజురోజుకు పెరుగుతోంది. దీంతో ఫుట్​పాత్‌‌‌‌లు, బస్టాండ్ల వద్ద ఉండే వారు నైట్ షెల్టర్లను ఆశ్రయిస్తున్నారు. గతంతో పోలిస్తే చలికాలం మొదలైనప్పటి నుంచి వీటిలో చేరుతున్నవారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు పనుల కోసం బయట ఉంటూ రాత్రయ్యేసరికి షెల్టర్లకు చేరుకుంటున్నారు. ప్రస్తుతం షెల్టర్ల​లో  బెడ్లన్నీ ఫుల్ అయిపోతున్నాయి. కొన్ని చోట్ల అదనంగా బెడ్లు వేసి ఆశ్రయం కల్పిస్తున్నారు. అయితే, ఆశ్రయించేవారి సంఖ్య పెరుగుతున్నప్పటికీ షెల్టర్ల సంఖ్యను మాత్రం పెంచడం లేదని నిర్వాహకులు, నిరాశ్రయులు అంటున్నారు. 

100 బెడ్స్​కు 150 మంది..

ఆడ, మగవారికి సెపరేట్​గా గ్రేటర్ పరిధిలో 14 షెల్టర్ హోమ్స్​ను జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసింది. వీటి బాధ్యతలను ఎన్జీవోలు చూస్తున్నాయి. ఉదయం, మధ్యాహ్నం పలుచోట్ల భోజనం అందిస్తున్నారు. రాత్రిళ్లు వండుకునేందుకు కావాల్సిన సామగ్రి, కూరగాయలు అందిస్తున్నారు. ఒక్కో చోట 40 నుంచి 100 బెడ్స్ ఉన్నాయి. అయితే చలి తీవ్రత ఎక్కువవుతుండటంతో  షెల్టర్లకు వచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. 40 బెడ్స్ ఉన్న చోట 60 మంది, 100 బెడ్స్ ఉన్న చోట 150 వరకు ఉంటున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు పలుచోట్ల ఎక్స్‌‌‌‌ ట్రా బెడ్స్ ఏర్పాటు చేస్తున్నారు.

అవగాహన లేక..

చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఫుట్​పాత్​ల మీద ఉండే  వారితో పాటు జంక్షన్లలో భిక్షాటన చేస్తూ ఫ్లై ఓవర్లు, బస్టాండ్లలోనే పడుకునేవారు  సిటీలో వేలసంఖ్యలో ఉన్నారు. అయితే వీరిలో చాలామంది ప్రస్తుతం తమకు అందుబాటులోని షెల్టర్లకు వెళ్లి ఆశ్రయం పొందుతున్నారు. కానీ చాలామందికి వీటిపై సరైన అవగాహన లేదు. తెలుసుకుని వెళ్లినవారికి సరిపడా బెడ్లు ఉండటం లేదు. అయితే తాత్కాలికంగా ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ ఇంకా ఎంతో మంది ఆశ్రయం కోసం ఎదురుచూస్తున్నారు.అయితే చాలాచోట్ల అవసరం ఉన్నప్పటికీ అధికారులు దృష్టి పెట్టడం లేదు. గతంలో నిరాశ్రయులను గుర్తించినప్పటికీ వారిని తీసుకొచ్చి షెల్టర్లలో ఉంచే చర్యలు పూర్తిగా అమలు కావడం లేదు.

ఎక్కువ మంది ఉంటున్నరు

మేము ఫ్లై ఓవర్ల కింద ఉండేవాళ్లం. రెండ్రోజుల కిందట మా దగ్గరికి దుప్పట్లు ఇచ్చేందుకు కొంతమంది వచ్చారు. వాళ్లు మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ ఉంచారు. ఇక్కడ అన్ని వసతులున్నాయి. కానీ ఉన్న బెడ్ల కంటే ఎక్కువ మంది ఉంటున్నారు. 


- కళ్యాణమ్మ, సరూర్​నగర్​ షెల్టర్ 

ఏడాదిగా ఉంటున్నా..

ఖమ్మం నుంచి సిటీకి వచ్చి ఏడాది కాలంగా షెల్టర్‌‌‌‌‌‌‌‌ హోమ్​లో ఉంటున్నా.  ఈ షెల్టర్‌‌‌‌‌‌‌‌లో 50మందికి పైనే ఉన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు  పనిచేసుకుని వచ్చి ఇక్కడ రాత్రి తలదాచుకుంటున్నా. ఇలాంటివి మరికొన్ని ఏర్పాటు చేస్తే నిరాశ్రయులకు ఉపయోగంగా ఉంటుంది.
- ఎస్‌‌‌‌కే మదార్‌‌‌‌‌‌‌‌, బేగంపేట షెల్టర్ హోమ్