టిఫిన్ రేట్లు పెంచేస్తున్న హోటల్స్.. ఇడ్లీ, దోశ మరింత కాస్ట్

టిఫిన్ రేట్లు పెంచేస్తున్న హోటల్స్.. ఇడ్లీ, దోశ మరింత కాస్ట్

బెంగళూరు : నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశన్నంటుతున్నాయి. పెట్రోల్, డీజిల్ తో పాటు కూరగాయల ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. నిత్యం కూరల్లో వాడే టమాటల ధరలు కూడా అమాంతం పెరిగిపోయాయి. ఒక కేజీ టమాట రూ.140 నుంచి 160 వరకు అమ్ముతున్నారు. పెరిగిన ధరలతో సామాన్యులు ఏమీ కొనలేని, తినలేని పరిస్థితి ఏర్పడింది. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల కారణంగా బెంగళూరులో టిఫిన్, స్నాక్స్, ఫాస్ట్ ఫుడ్ ధరలు ఇకపై పెరగనున్నాయి. 

పెరిగిన నిత్యావసర వస్తువుల ధరల కారణంగా బెంగళూరులోని బృహత్ బెంగుళూరు హోటల్స్ అసోసియేషన్.. రెస్టారెంట్లలోని ఫుడ్ ఐటమ్స్ తో పాటు బయట దొరికే టిఫిన్స్, స్నాక్స్, ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ కు సంబంధించిన ధరలను పెంచాలని భావిస్తోంది. ఈ ధరలను దాదాపు 10 నుంచి 15శాతం వరకూ పెంచాలని ప్లాన్ చేస్తోంది. జులై 25వ తేదీన నిర్వహించబోయే సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనుంది. 

పెరుగుతున్న ఖర్చుల కారణంగా సిబ్బందికి ప్రతినెల జీతాలు చెల్లించాల్సి వస్తోందని, వ్యాపారాలు కూడా పెద్దగా సాగడం లేదని బృహత్ బెంగుళూరు హోటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు చెబుతున్నారు. ఇప్పటికే కొన్ని  హోటల్స్, రెస్టారెంట్లలో ఫుడ్ ఐటమ్స్ ధరలను పెంచారు. మరోవైపు.. పాల ధరలను పెంచాలని కూడా కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (కెఎంఎఫ్) భావిస్తోంది. త్వరలోనే కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో సమావేశం కానుంది. ఒక లీటర్ పాలకు ఐదు రూపాయలు పెంచాలనే ప్రతిపాదనను రాష్ర్ట ప్రభుత్వం ముందు పెట్టనుంది. 

పప్పులు, కూరగాయలు, సుగంధ ద్రవ్యాలతో పాటు నిత్యం వాడుకునే ఇతర వస్తువుల ధరలు కూడా పెరుగుతుండడంతో హోటల్స్, రెస్టారెంట్లు నడడం పెద్ద సవాల్ గా మారిందంటున్నారు వాటి నిర్వాహకులు. అందుకే ఫుడ్ ఐటమ్స్ ధరలను పెంచాలని ప్లాన్ చేస్తున్నారు. జులై 25వ తేదీన నిర్వహించే సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటామంటున్నారు.