రాజగోపాల్​ రాజీనామాతో నేతల మధ్య మాటల యుద్ధం

రాజగోపాల్​ రాజీనామాతో నేతల మధ్య మాటల యుద్ధం
  • టీఆర్​ఎస్​తో చేయాల్సిన పోరు ప్రతిపక్షాల నడుమ
  • సొంత పార్టీలోనే చిచ్చు పెట్టిన రేవంత్​ వ్యాఖ్యలు
  • క్షమాపణ చెప్పాలని డిమాండ్​ చేసిన వెంకట్​రెడ్డి
  • రాజ​గోపాల్​కు మద్దతుగా నిలిచిన బీజేపీ నేతలు
  • రేవంత్​ను సమర్థించిన కాంగ్రెస్​ లీడర్లు

హైదరాబాద్ : మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి రాజీనామా, ఆయనపై పీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి చేసిన కామెంట్లు పొలిటికల్​ హీట్​ను పెంచాయి. ఆయన మాటలు సొంత పార్టీలోనే చిచ్చు పెట్టాయి. అదే సమయం లో రేవంత్​ మాటలు అభ్యంతరకరంగా ఉండడంతో బీజేపీ నేతలు కూడా రాజగోపాల్​కు అండగా నిలిచి రేవంత్​కు కౌంటర్లు ఇచ్చారు. దాంతో అధికార టీఆర్​ఎస్​తో సాగాల్సిన వార్​ రెండు ప్రతిపక్షాల మధ్య యుద్ధంగా మారిపోయింది. మునుగోడులో బీజేపీ, కాంగ్రెస్​ తలపడాల్సింది టీఆర్​ఎస్​తోనే. కానీ రేవంత్​ చేసిన కామెంట్లతో సీన్​ మారిపోయింది. కాంగ్రెస్​ను, సోనియాను తాను విమర్శించననీ, మునుగోడు ప్రజల అభివృద్ధి కోసం, కేసీఆర్​ అరాచక పాలన మీద యుద్ధం సాగించేందుకే పార్టీ వీడుతున్నానని రాజగోపాల్​​ ప్రకటించినా.. ఆయనపై రేవంత్​ వ్యక్తిగత కామెంట్లు చేయడంతో పరిణామాలు మారిపోయాయి. బుధవారం రాజగోపాల్​ ప్రెస్​మీట్​ ఏర్పాటు చేసి రేవంత్​ మాటలకు కౌంటర్​ ఇచ్చారు. దాని తర్వాత అటు కాంగ్రెస్​, ఇటు బీజేపీ నేతలు వరుసగా ప్రెస్​మీట్లు పెట్టారు. రాజగోపాల్​కు బీజేపీ నేతలు మద్దతుగా నిలిచి రేవంత్​ను ఘాటుగా విమర్శించారు. కాంగ్రెస్​ నేతలు తమ నాయకుడ్ని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. అయితే.. రాజగోపాల్​ అన్న కాంగ్రెస్​ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి ఢిల్లీలో మాట్లాడుతూ రేవంత్​ తీరును తప్పుబట్టారు. తమ కుటుంబంపై రేవంత్​ చేసిన వ్యాఖ్యలు సరికావని, క్షమాపణ చెప్పాలని డిమాండ్​ చేశారు. రేవంత్​ కామెంట్లు కాంగ్రెస్​లో కూడా అంతర్గత విభేదాలకు దారి తీసినట్లయ్యాయి. 

రాజగోపాల్​, రేవంత్.. మాటకు మాట

రాజగోపాల్​రెడ్డి  మంగళవారం తన రాజీనామా సందర్భంగా మాట్లాడుతూ..  సోనియా గాంధీపై తనకు గౌరవం ఉందని చెప్పారు. కాంగ్రెస్​ నేతలపై ఎలాంటి విమర్శలు చేయలేదు. కానీ పీసీసీ చీఫ్​ రేవంత్​పై మాత్రం పరోక్షంగా కామెంట్​ చేశారు. 20 ఏండ్లు కాంగ్రెస్​ను తిట్టిన వ్యక్తి చెప్పినట్లు విని తాము పని చేయాలా, అంతలా ఆత్మను చంపుకునే అవసరం తమకు లేదని రేవంత్​ పేరు ప్రస్తావించకుండా అన్నారు. అయితే దీనిపై రేవంత్​ అదే రాత్రి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. కాంట్రాక్టులకు ఆశ పడి తల్లి లాంటి సోనియాకు ద్రోహం చేశారని మండిపడ్డారు. దీనిపై రాజగోపాల్​ బుధవారం ఉదయం తన ఇంట్లో ప్రెస్​ మీట్​ పెట్టి.. రేవంత్​ బ్లాక్​ మెయిలర్​ అని, సోనియాను బలి దేవత అన్న వ్యక్తి పైసలిచ్చి పీసీసీ చీఫ్​ పదవి తెచ్చుకున్నారని ఆరోపించారు. పార్టీని చంద్రబాబు కోసం, ఆంధ్రావాళ్ల కోసం తాకట్టుపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు రేవంత్​ తెలంగాణ ఉద్యమంలోనే లేరని, రాష్ట్ర సాధన కోసం త్యాగాలు చేసిన తమను విమర్శించే నైతిక హక్కు ఆయనకు లేదన్నారు. రేవంత్​ చరిత్ర హీనుడని రాజగోపాల్​రెడ్డి విమర్శించారు.  

రేవంత్​కు మద్దతుగా కాంగ్రెస్​ లీడర్లు..

రేవంత్​కు మద్దతుగా రాష్ట్ర కాంగ్రెస్​ నేతలు గాంధీభవన్​లో వరుసగా పోటీపడి ప్రెస్​మీట్లు పెట్టారు. సీనియర్​ నేత చిన్నా రెడ్డి, మల్లు రవి, అద్దంకి దయాకర్​, బెల్లయ్య నాయక్​ మొదలుకొని రంగారెడ్డి జిల్లా నేతల వరకు వరుసగా మీడియాతో మాట్లాడారు. అన్ని పదవులు అనుభవించి రాజగోపాల్ ​కాంగ్రెస్​ పార్టీని వీడడం అన్యాయమని, రేవంత్​ను విమర్శించే హక్కు ఆయనకు లేదన్నారు. మూడేండ్లుగా కాంగ్రెస్​లోనే ఉంటూ బీజేపీకి పని చేశారని వారు ఆరోపించారు. రేవంత్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​గా చేసిన పనిని చూసి సోనియా పీసీసీ చీఫ్​​ పదవి ఆయనకు ఇచ్చారని పేర్కొన్నారు. మునుగోడులో కాంగ్రెస్​ రక్తం అంటే ఏమిటో చూపిస్తామని శపథం చేశారు. కార్యకర్తలు తమ వెంటనే ఉన్నారని అన్నారు. 

కౌంటర్​ ఇచ్చిన బీజేపీ నేతలు

రేవంత్​కు బీజేపీ నేతలు డీకే అరుణ, రఘునందన్​రావు, ఈటల రాజేందర్​ గట్టి కౌంటర్​ ఇచ్చారు. రాజగోపాల్​కు మద్దతుగా నిలిచారు. కాంగ్రెస్​లో పుట్టి పెరిగినోడి లెక్క రేవంత్​ మాట్లాడడం హాస్యాస్పదమని, ఆయన భాష మార్చుకో వాలని అరుణ అన్నారు. రేవంత్​ రెడ్డిని తెలంగాణ చంద్రబాబుగా ప్రజలు భావిస్తున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా దొడ్డిదారిన చేరిన చరిత్ర రేవంత్​దని ఆమె మండిపడ్డారు. అడ్డదారుల్లో రేవంత్​రెడ్డి పదవులు తెచ్చుకున్నారని, నోరు అదుపులో పెట్టుకోవాలని రఘునందన్​ హెచ్చరించారు. గతంలో 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ ఎస్ లో విలీనం అయితే రేవంత్ ఎందుకు మాట్లాడలేదని ఆయన ప్రశ్నించారు. నాల్గవ ‘ఆర్’ గా రాజ్ గోపాల్ రెడ్డి అసెంబ్లీలో అడుగుపెడతారని ధీమా వ్యక్తం చేశారు.