లాక్ డౌన్ పెట్ట‌కుంటే.. ఇండియాలో 8.2 ల‌క్ష‌ల క‌రోనా కేసులు

లాక్ డౌన్ పెట్ట‌కుంటే.. ఇండియాలో 8.2 ల‌క్ష‌ల క‌రోనా కేసులు

క‌రోనా వైర‌స్ క‌ట్టడికి దేశంలో లాక్ డౌన్ విధించ‌కుండా ఉంటే ఏప్రిల్ 15 నాటికి క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8.2 ల‌క్ష‌ల‌కు చేరే ప్ర‌మాదం ఉండేద‌ని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో క‌రోనా ప‌రిస్థితుల‌పై రోజువారీ ప్రెస్ మీట్స్ లో భాగంగా శ‌నివారం మీడియాతో మాట్లాడిన కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రెట‌రీ ల‌వ్ అగ‌ర్వాల్ ఈ అభిప్రాయం వ్య‌క్తం చేశారు. దేశ వ్యాప్తంగా క‌రోనాను ఎదుర్కొనేందుకు వైద్య ప‌ర‌మైన స‌దుపాయ‌ల‌ను సిద్ధం చేశామ‌ని, ప్ర‌త్యేకంగా 586 కోవిడ్ ఆస్ప‌త్రులు ఉన్నాయ‌ని తెలిపారు. ఇప్ప‌టికే ల‌క్ష ఐసోలేష‌న్ బెడ్స్, 11,500 ఐసీయూ బెడ్స్ రిజ‌ర్వులో పెట్టామ‌ని చెప్పారు.

డాక్ట‌ర్ల‌కు సెక్యూరిటీ

క‌రోనా పేషెంట్ల‌కు ట్రీట్మెంట్ చేస్తున్న డాక్ట‌ర్ల‌పై ప‌లు రాష్ట్రాల్లో దాడులు జ‌రుగుతున్న నేప‌థ్యంలో వారికి సెక్యూరిటీ క‌ల్పించాల‌ని కేంద్ర హోం శాఖ నిర్ణ‌యించింది. ఆస్ప‌త్రులు, క్వారంటైన్ కేంద్రాల ద‌గ్గ‌ర డాక్ట‌ర్లు, ఇత‌ర వైద్య సిబ్బందికి అవ‌స‌ర‌మైన మేర పోలీస్ సెక్యూరిటీ ఇవ్వాల‌ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల‌కు లేఖ రాసింది. ఈ విష‌యాన్ని కేంద్ర హోం శాఖ జాయింట్ సెక్రెట‌రీ పుణ్య స‌లీలా శ్రీ‌వాస్త‌వ శ‌నివారం జ‌రిగిన ఆరోగ్య శాఖ ప్రెస్ మీట్ లో వెల్ల‌డించారు.