నందిపేట, వెలుగు: ఓ మహిళను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి వాగులో పడేశారు. ఈ ఘటన తల్వేద గ్రామ శివారులో జరిగింది. నందిపేట మండల కేంద్రానికి చెందిన రాగల్ల గంగామణి(40) మృతదేహం శనివారం తల్వేద శివారులోని వాగులో కనిపించింది. దుండగులు ఆమెను బలమైన ఆయుధంతో కొట్టి చంపినట్లుగా ఆమె ఒంటిపై గాయాలను బట్టి తెలుస్తోంది.
మృతురాలి చేతిపై మేఘన పేరుతో ఉన్న టాటూ ఆధారంగా ఆమె వివరాలు గుర్తించారు. నందిపేటకు చెందిన స్వరూప, లావణ్య, ప్రేమల, నరేశ్ తన తల్లిని నమ్మించి బాసరకు తీసుకెళ్లి చంపేశారని ఆరోపిస్తూ మృతురాలి కుమార్తె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
మృతురాలు పలువురికి అప్పులు ఇచ్చిందని, ఆర్థిక లావాదేవీల కారణంగానే హత్యకు గురై ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. డెడ్‌బాడీని పోస్టుమార్టానికి పంపించి హంతకుల కోసం గాలిస్తున్నట్లు ఎస్సై శ్యామ్‌రాజ్ తెలిపారు.
