మహిళను కట్టెతో కొడ్తూ.. జుట్టు పట్టి లాక్కెళ్లిండు

మహిళను కట్టెతో కొడ్తూ.. జుట్టు పట్టి లాక్కెళ్లిండు

కోల్​కతా: నడి రోడ్డుపై మహిళను ఓ వ్యక్తి కట్టెతో దారుణంగా చితకబాదాడు. తనను వదిలేయాలని వేడుకుంటున్నా.. కనికరించలేదు. జుట్టు పట్టుకుని.. ఈడ్చుకుంటూ తీసుకెళ్లాడు. చుట్టూ జనం ఉన్నా.. ఎవరూ అతన్ని ఆపేందుకు ప్రయత్నించలేదు. ఈ ఘటన వెస్ట్ బెంగాల్ నార్త్ దినాజ్​పూర్ జిల్లాలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. మహిళతో పాటు ఓ వ్యక్తిని కూడా కొడ్తున్నట్టు వీడియోలో కనిపిస్తున్నది. అయితే, ఆ ఇద్దరిని ఎందుకు కొట్టాడో అన్నది తెలియరాలేదు. ఈ ఘటనపై అపోజిషన్ పార్టీలు బీజేపీ, సీపీఎం మండిపడుతున్నాయి. దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. 

దాడి చేసింది ఎమ్మెల్యే సన్నిహితుడే.. : బీజేపీ

బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాలవీయ ఈ వీడియోను ట్విట్టర్​లో పోస్టు చేసి మమతా బెనర్జీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మహిళను కొడ్తున్న వ్యక్తి పేరు తజేముల్. చోప్రా టీఎంసీ ఎమ్మెల్యే హమిదుర్ రెహ్మాన్​కు అత్యంత సన్నిహితుడు. ఎవరైనా తప్పు చేస్తే ‘ఇన్సాఫ్ సభ’ పేరుతో అప్పటికప్పుడు ఇలాగే శిక్షిస్తుంటాడు. మహిళను కట్టెతో దారుణంగా కొట్టాడు. నొప్పితో విలవిల్లాడుతున్నా కనికరించలేదు. కాళ్లతో తంతూ.. జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లాడు. చుట్టూ ఉన్నోళ్లు ఎవరూ అతన్ని ఆపేందుకు ప్రయత్నించలేదు. ఎందుకంటే అతను అక్కడి ఎమ్మెల్యే మనిషి’’అని మాలవీయ అన్నారు. తజేముల్​కు ఒక మహిళ కూడా సాయం చేసిందన్నారు. బెంగాల్‌‌‌‌లో శాంతిభద్రతల పరిస్థితికి ఇది నిదర్శనమని, టీఎంసీ పాలనలో ఈ తరహా షరియా కోర్టులున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పు చేసింది ఎవరైనా చట్టప్రకారం కఠినంగా శిక్షిస్తామని టీఎంసీ అధికార ప్రతినిధి రిజు దత్తా అన్నారు.