బతికొస్తుందని రెండ్రోజులు పిల్లి శవం ముందే.. ఇక ఎప్పటికీ రాదని తెలిసి..

బతికొస్తుందని రెండ్రోజులు పిల్లి శవం ముందే.. ఇక ఎప్పటికీ రాదని తెలిసి..

లక్నో: కుక్కలను, పిల్లులను పెంచుకునే వాళ్ల గురించి, ప్రేమగా చూసుకునే వాళ్ల గురించి విని ఉంటారు. దురదృష్టవశాత్తూ వాళ్లు పెంచుకుంటున్న ఆ పెంపుడు జంతువు చనిపోతే అంత్యక్రియలు కూడా ఇంట్లో మనిషికి చేసినట్టు చేసి ఘనంగా వీడ్కోలు పలికిన ఘటనలూ చూశాం. కానీ.. ఈ ఘటన అంతకు మించి. పెంచుకుంటున్న పిల్లి చనిపోతే రెండు రోజులుగా అది తన కోసం తిరిగి బతికొస్తుందేమో ఆశగా ఆమె ఎదురుచూసింది. 

పోయిన ప్రాణం తిరిగి రాదని తెలిసినా రెండు రోజులుగా పిల్లి శవం ముందే దిగాలుగా కూర్చుంది. ఇక.. ఎప్పటికీ తన పెంపుడు జంతువు మళ్లీ తన కోసం బతికి రాదని గ్రహించి తీవ్ర మనస్తాపంతో ఆ మహిళ ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఈ విషాద ఘటన ఉత్తరప్రదేశ్ లోని అమ్రోహా జిల్లాలో జరిగింది. చనిపోయిన మహిళ పేరు పూజ. వయసు 32 సంవత్సరాలు. ఎనిమిదేళ్ల క్రితం ఢిల్లీకి చెందిన ఒకతనిని పెళ్లి చేసుకుంది.

పెళ్లయిన రెండేళ్లకే భార్యాభర్తల మధ్య గొడవలు రావడంతో విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి తన తల్లి గజ్రా దేవితో పూజ కలిసి ఉంటుంది. తన ఒంటరితనాన్ని పోగొట్టుకోవడం కోసం ఒక పిల్లిని చేరదీసి పెంచుకుంది. ఆ పిల్లిని కన్నబిడ్డలా ప్రేమగా చూసుకుంది. స్నానం చేయించేది. బట్టలేసేది. తను తినేదే ప్రేమగా పిల్లికీ పెట్టేది. అయితే.. ఏం జరిగిందో తెలియదు గానీ ఆ పిల్లి గురువారం రోజు చనిపోయింది. 

ఆ పిల్లి చనిపోయిందని, పూడ్చి పెట్టేద్దామని పూజ తల్లి ఆమెకు చెప్పింది. అయితే.. అందుకు పూజ ఏమాత్రం అంగీకరించలేదు. ఆ పిల్లి తన కోసం తిరిగొస్తుందని, పూడ్చి పెట్టే సమస్యే లేదని తేల్చి చెప్పింది. తన కూతురి మాట కాదనలేక పూజ తల్లి అలానే వదిలేసింది. రెండు రోజుల పాటే పూజ పిల్లి శవంతో ఉండిపోయింది. ఇక.. ఆ పిల్లి తిరిగి రాదని తెలుసుకుని శనివారం రోజు సీలింగ్ ఫ్యాన్కు ఉరేసుకుని పూజ ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.