
సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న రైలు నుంచి జారి పడి ఓ మహిళ మృతి చెందింది. శనివారం మధ్యాహ్నం బాపట్ల – స్టువర్టుపురం మధ్య ఈ సంఘటన జరిగింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. తిరుపతి వెళుతున్న పద్మావతి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లోకి… తెనాలి వద్ద ఓ మహిళ ఎక్కింది. బండి బాపట్ల దాటాక… స్టువర్టుపురం సమీపంలో బోగీ నుంచి జారిపడి అక్కడికక్కడే మృతి చెందింది. మృతదేహాన్ని గుర్తించిన రైల్వే గ్యాంగ్‌మ్యాన్ చీరాల రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతి చెందిన మహిళ తెనాలికి చెందిన వివాహితగా అనుమానిస్తున్నారు.