కారుతో ఢీ కొట్టి మహిళ హత్య

కారుతో ఢీ కొట్టి మహిళ హత్య

ఉప్పల్, వెలుగు: కారుతో మహిళను ఢీ కొట్టి హత్య చేసిన ఘటన ఉప్పల్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. రామాంతాపూర్ శ్రీనగర్ కాలనీకి చెందిన పెన్నం చంద్రమౌళి(47) నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద ఎస్ఎన్ఎస్ రియల్ ఎస్టేట్ డైరెక్టర్ గా ఆఫీస్ నిర్వహిస్తున్నాడు. అదే ఆఫీస్ లో రామాంతాపూర్ కు చెందిన కొమ్మవారి మంజుల (40) జాబ్ చేస్తోంది. చంద్రమౌళికి ఆమెతో మూడేండ్లుగా వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది.

 కాగా.. గత మూడు నెలల నుంచి మరోవ్యక్తితో ఆమె సన్నిహితంగా ఉంటుందని చంద్రమౌళి అనుమానించాడు. ఆమె రూ.28 లక్షలు చంద్రమౌళి వద్ద తీసుకొని అడిగితే ఇవ్వడం లేదని తెలిసింది. దీంతో ఆమెపై అతడు కక్ష పెంచుకొని, మద్యం తాగొచ్చి ఆదివారం రాత్రి10 గంటల సమయంలో ఉప్పల్ భగాయత్ కు తీసుకొచ్చి కారుతో ఢీ కొట్టి హత్య చేశాడు. 

నిందితుడు నేరుగా ఉప్పల్ పీఎస్ లో లొంగిపోయాడు. ఘటనా స్థలానికి పోలీసులు వెళ్లి డెడ్ బాడీని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.