కళ్ల ముందే ఉరేసుకున్న కోడలు.. వీడియో తీసి షేర్ చేసిన అత్తామామలు

V6 Velugu Posted on Apr 14, 2021

లక్నో: మా కోడలు ఆత్మహత్యలో మాకు సంబంధం లేదు.. మేం అమాయకులం.. కావాలంటే మా దగ్గర బలమైన ఆధారం ఉంది చూడమంటూ.. వీడియో చూపించారు అత్తామామలు. కొంత కాలంగా తమ కోడల్ని అదనపు కట్నం కోసం వేధించిన వీరు.. సూటిపోటి మాటలతో ఆమెను ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించి.. ఆమె చనిపోయిన తర్వాత తమ నిర్దోషిత్వాన్ని చాటుకునేందుకు వారు వీడియో చూపించారు. మరికొంత మంది సన్నిహితులకు షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో కలకలం రేపింది. సభ్య సమాజం తలదించుకునేలా రాక్షసంగా వ్యవహరించిన అత్తామామల ఉదంతం ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్ నగర్ లో జరిగింది. ఒకింత ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన చర్చనీయాంశం అయింది. కోడలు మామాటే వినలేదు.. మేం ఎంత చెప్పినా వినకుండా ఇలా చేసుకుందంటూ వాట్సప్ లో షేర్ చేసిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు హుటాహుటిన స్పందించారు. అసలేం ఏం జరిగిందంటే.. 26 ఏళ్ల కోమల్‌ కు 2019లో  డాటియానా గ్రామానికి చెందిన ఆశిష్ తో పెళ్లి జరిగింది. పెళ్లి సమయంలో 5 లక్షల రూపాయల నగదు, ఒక బైకును కట్నం కింద ఇచ్చారు. పెళ్లయిన తర్వాత అత్తమామలతో కలిసి ఉంటోంది. కరోనా తర్వాత ఆర్ధికంగా ఇబ్బందులు ఎదురు కావడంతో అదనపు కట్నం తీసుకురమ్మని అత్తమామలు వేధించడం ప్రారంభించారు. గత ఆరు నెలలుగా సూటి పోటి మాటలతో మానసికంగా వేధించడం శృతి మించిపోవడంతో ఆమె తన కష్టాలను భర్తకు చెప్పుకుంది. అతను కూడా తల్లిదండ్రులను వెనకేసుకుని రావడంతో భరించలేక పుట్టింటికిపోయింది. కొద్ది రోజుల తర్వాత కోమల్ తల్లిదండ్రులు, గ్రామ పెద్దల ద్వారా చర్చలు జరపడంతో ఆమె రాజీపడి కొద్ది రోజుల క్రితం తిరిగి అత్తారింటికి వచ్చింది. అయితే అత్త మామలు మళ్లీ కోమల్ ని సూటి పోటి మాటలతో వేధించడం మొదలు పెట్టడంతో ఆమె ఎదురు ప్రశ్నించింది. మాటా మాటా పెరడడంతో ఆదివారం తీవ్ర మనస్తాపానికి గురైంది. తన గదికి తలుపు వేసుకుని ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కోడలు కోమల్ చేస్తున్నప్రయత్నాలను నిలువరించకుండా అత్తా..మామలు కిటికీలో నుంచి కోమల్ ఉరేసుకుంటున్న వీడియో తీసి దాచిపెట్టుకున్నారు. అంత్యక్రియలకు వచ్చిన వారంతా వీరి కుటుంబంపై అనుమానం వ్యక్తం చేయడంతో తాము నిర్దోషులమని నమ్మబలికారు. తమ దగ్గర బలమైన ఆధారముందని బుకాయించారు. ఆత్మహత్యకు ముందు తాము కిటికీలో నుంచి తీసిన వీడియోను సన్నిహితులకు షేర్ చేశారు. ఈ వీడియో కాస్త వైరల్ కావడంతో పోలీసులు స్పందించి కోమల్  అత్తా మామాలతోపాటు.. ఆమె భర్త.. పరోక్షంగా సంబంధం బయటపడడంతో ఆమె బావలపై కూడా కేసు నమోదు చేశారు.

Tagged Social media, Young woman, UP, muzaffarnagar

Latest Videos

Subscribe Now

More News