ఆశ్చర్యం..కుడి వైపు గుండె..ఎడమవైపు కాలెయం

ఆశ్చర్యం..కుడి వైపు గుండె..ఎడమవైపు కాలెయం

సాధారణంగా గుండె ఎడమ చేతి వైపు ఛాతి భాగంలో ఉంటుంది. కానీ రాజస్థాన్ లో ఓ మహిళకు  కుడి వైపున గుండె ఉంది. గుండె కుడివైపున ఉండటంపై  అక్కడి డాక్టర్లు ఆశ్చర్యపోతున్నారు. గుండెతో పాటు..శరీరంలో  మరికొన్ని అవయవాలు సైతం వ్యతిరేకంగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ అయింది.
 
రాజస్థాన్‌లోని చురు జిల్లాలోని తారానగర్ మండలం  జహంతారానగర్‌  ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు రాంప్యారీ అనే మహిళ కడుపునొప్పితో బాదపడుతూ వచ్చింది. అక్కడ ఆమెకు స్కానింగ్‌ చేసిన డాక్టర్లు ఆశ్చర్యపోయారు. ఎడమ వైపున ఉండాల్సిన గుండె కుడి వైపున ఉన్నట్లు గుర్తించారు. ఎడమ వైపునకు ఉండాల్సిన గుండె కుడివైపునకు ఉండటంతో పాటు..కుడివైపునకు ఉండాల్సిన కాలెయం ఎడమవైపునకు ఉండటం చూసి డాక్టర్లు బిత్తరపోయారు. 

ఆశ్చర్యపోయాం...

రాంప్యారి అనే మహిళ తీవ్ర కడుపునొప్పితో బాధపడుతూ తారానగర్‌లోని ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు వచ్చిందని డాక్టర్ సజ్జన్ కుమార్ తెలిపారు. ఆమెకు సోనోగ్రఫీని పూర్తి చేసినప్పుడు..తాను ఆశ్చర్యానికి గురైనట్లు చెప్పారు. రాంప్యారీ సైట్స్ ఇన్వర్సస్ వ్యాధితో బాధపడుతున్నట్లు తేలిందన్నారు. ఇది కోటి మందిలో ఒకరికి జరుగుతుందని చెప్పారు. ఈ వ్యాధి కలిగిన రోగిలో  ఛాతీ, కడుపులో కనిపించే అవయవాలు సాధారణ స్థితితో పోలిస్తే వ్యతిరేక ప్రదేశాలలో  ఉంటాయన్నారు. గుండె కుడి వైపున కనిపిస్తుందని..కాలేయం ఎడమ వైపున ఉంటుందన్నారు. 

కారణమేంటి...

గుండె కుడివైపు  ఉండటాన్ని వైద్య పరిభాషలో డెక్స్‌ట్రోకార్డియాగా చెబుతారు. గుండె వైకల్యం అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇది సాధారణంలా కాకుండా అసాధారంగా ఎడమవైపు ఉంటుంది. అంతర్గత అవయవాలు వ్యతిరేక దిశలో ఉంటడం మాత్రం అరుదు. ఈ రుగ్మత పుట్టుకతో వస్తుంది. ఇలా గుండె  కుడి వైపు ఉండటం అనేది ఎక్కడో ఒక దగ్గర మాత్రమే ఉంటుంది. దీనివలన ఇతర అవయవాలు పెద్దగా ప్రభావితం కావు. అయితే కొంత మాత్రం మార్పులు ఉంటాయని చెబుతున్నారు. వివిధ రకాల ఇతర పుట్టుకతో వచ్చే వ్యాధులతో కలిసి ఉండవచ్చు. ఇది శిశువు అభివృద్ధి ప్రారంభంలో లేదా గర్భధారణ సమయంలో జరుగుతుంది.

డెక్స్ట్రోకార్డియా ఎలాంటి సమస్యలు

డెక్స్ట్రోకార్డియా అనేది  ప్రాణాంతకం మాత్రం కాదు. కానీ తరచుగా గుండె వైకల్యాలు, కడుపులో అవయవ లోపాలు వంటి తీవ్రమైన సమస్యలు సంభవించే అవకాశం ఉంది. అప్పుడప్పుడు అలసటగా అనిపిస్తుంది. కామెర్లు లేదా చర్మం పసుపుగా మారుతుంది. బరువు పెరగరు. సైనస్, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిలాంటివి వస్తూ ఉంటాయి. నీలం రంగు చర్మం, ముఖ్యంగా వేళ్లు, కాలి చుట్టూ ఉంటుంది. డెక్స్ట్రోకార్డియా ఉన్న వ్యక్తి అరిథ్మియా లేదా క్రమరహిత హృదయ స్పందనను కూడా అనుభవించవచ్చు.