అమీన్‌‌పూర్‌‌లో కారు డ్రైవింగ్‌‌ నేర్చుకుంటూ..చిన్నారులను ఢీకొట్టిన మహిళ

అమీన్‌‌పూర్‌‌లో కారు డ్రైవింగ్‌‌ నేర్చుకుంటూ..చిన్నారులను ఢీకొట్టిన మహిళ
  • బాలుడు మృతి, బాలికకు గాయాలు
  • సంగారెడ్డి జిల్లా అమీన్‌‌పూర్‌‌లో ఘటన

రామచంద్రాపురం (అమీన్‌‌పూర్‌‌), వెలుగు : కారు డ్రైవింగ్‌‌ నేర్చుకుంటున్న ఓ మహిళ పక్కనే ఆడుకుంటున్న చిన్నారులను ఢీకొట్టడంతో ఓ బాలుడు చనిపోగా, మరో బాలికకు గాయాలు అయ్యాయి. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్‌‌పూర్‌‌లో సోమవారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... అమీన్‌‌పూర్‌‌ మున్సిపాలిటీ పరిధిలోని నర్రెగూడెంనకు చెందిన శేఖర్‌‌ తన కూతురు ఏకవాణి, కుమారుడు మణిధర్‌‌వర్మ (10)తో కలిసి ఆదివారం సాయంత్రం పక్కనే ఉన్న గ్రౌండ్స్‌‌కి వెళ్లాడు.

కొద్దిసేపు ఆడుకున్న పిల్లలు సేదతీరేందుకు అక్కడే కూర్చున్నారు. ఇదే టైంలో నవ్య కాలనీకి చెందిన మహేశ్వరి కారు డ్రైవింగ్‌‌ నేర్చుకునేందుకు తన భర్త రవిశేఖర్‌‌తో కలిసి గ్రౌండ్‌‌కు వచ్చింది. డ్రైవింగ్‌‌ నేర్చుకుంటున్న క్రమంలో కారు అదుపుతప్పి ఏకవాణి, మణిధర్‌‌వర్మను ఢీకొట్టింది. దీంతో మణిధర్‌‌ అక్కడికక్కడే చనిపోగా, ఏకవాణికి తీవ్ర గాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు ఏకవాణిని హాస్పిటల్‌‌కు తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. చిన్నారుల తండ్రి శేఖర్‌‌ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, ప్రమాదానికి కారణమైన మహేశ్వరిని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ నరేశ్‌‌ తెలిపారు.