బోర్డర్ లో పాక్ కాల్పులు, మహిళకు గాయాలు

బోర్డర్ లో పాక్ కాల్పులు, మహిళకు గాయాలు

జమ్మూ: జమ్మూకాశ్మీర్ లోని ఇంటర్నేషనల్ బోర్డర్, ఎల్వోసీ వెంబడి పాకిస్తాన్ ఆర్మీ కాల్పులకు తెగబడింది. శనివారం రాత్రి పూంఛ్ జిల్లా బాలాకోట్ సెక్టార్ లో పాక్ జరిపిన కాల్పుల్లో 45 ఏళ్ల మహిళ గాయపడింది. వెంటనే ఆర్మీ బృందాలు ఆమెను హాస్పిటల్ కు తరలించాయి. బాలాకోట్ తోపాటు మెంధార్ సెక్టార్ లో పాకిస్తాన్ పెద్ద ఎత్తున కాల్పులు జరిపిందని, మన సైనిక బలగాలు ధీటుగా జవాబు చెప్పాయని ఆర్మీ అధికారులు చెప్పారు. పాక్ కాల్పుల్లో పలు ఇళ్లు దెబ్బతిన్నాయన్నారు. కథువా జిల్లాలోని ఇంటర్నేషనల్ బోర్డర్ లో పాకిస్తాన్ రేంజర్స్, బీఎస్ఎఫ్ మధ్య రాత్రి నుంచి తెల్లవారుజాము దాకా కాల్పులు జరిగాయని చెప్పారు. కరోల్ మత్రాయ్, ఫకీరా, చాంద్వా ప్రాంతాల్లో పాక్ సీజ్ ఫైర్ వయలేట్ చేసిందని, ప్రతిగా బీఎస్ఎఫ్ కాల్పులు జరిపిందన్నారు. సరిహద్దు గ్రామాల్లోని ప్రజలను బంకర్లకు తరలించినట్లు తెలిపారు.బీఎస్ఎఫ్ పోస్ట్ లు, గ్రామాలే లక్ష్యంగా పాక్ రేంజర్లు మోర్టార్లు ప్రయోగించారని అధికారులు చెప్పారు.