ఆక్సిజన్ కాన్సంట్రేటర్ పేలి భార్య మృతి.. భర్త కండిషన్ సీరియస్

ఆక్సిజన్ కాన్సంట్రేటర్ పేలి భార్య మృతి.. భర్త కండిషన్ సీరియస్

జైపూర్: ఇంట్లో ఆక్సిజన్ కాన్సంట్రేటర్ పేలి ఒక మహిళ మరణించింది. కరోనాతో బాధపడుతున్న ఆమె భర్త పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన రాజస్థాన్‌ గంగాపూర్‌‌లో జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
పిల్లలు సేఫ్..
గంగాపూర్ సిటీలోని ఉదయ్ మోర్ ఏరియాలో ఉండే ఐఏఎస్ అధికారి హర్ సహాయ్ మీనా సోదరుడు సుల్తాన్ సింగ్‌ కరోనా కారణంగా చాలా రోజుల నుంచి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడుతున్నాడు.  క్రమంగా కోలుకుంటున్న అతడికి ఇంట దగ్గరే ట్రీట్‌మెంట్ ఇస్తున్నారు. ఇందులో భాగంగా ఆక్సిజన్ కాన్సంట్రేటర్ పెట్టారు. సుల్తాన్ భార్య సంతోష్ మీనా అతడిని చూసుకుంటోంది. శనివారం తెల్లవారుజామున ఆమె ఇంట్లో లైట్ స్విచ్‌ ఆన్ చేయగానే ఒక్కసారిగా ఆక్సిజన్ కాన్సంట్రేటర్ పేలిపోయింది. ఆక్సిజన్ లీకేజ్‌ కారణంగా అది పేలి ఉండొచ్చని ప్రాథమిక అంచనాకు వచ్చినట్టు పోలీసులు తెలిపారు. పేలుడు శబ్దం విని చుట్టుపక్కల వాళ్లు వచ్చి, మంటల్లో చిక్కుకున్న దంపతులను బయటకు తీసుకొచ్చారు. వారిని ఆస్పత్రికి తీసుకుని వెళ్తుండగా సంతోష్​ మీనా మరణించింది. సుల్తాన్ సింగ్ కండిషన్ సీరియస్‌గా ఉంది. మెరుగైన చికిత్స కోసం గంగాపూర్‌‌ నుంచి జైపూర్‌‌కు తరలించారు. సుల్తాన్‌, మీనాకు పదేండ్లు, 12 ఏండ్ల కొడుకులు ఇద్దరు ఉన్నారు.  వారిద్దరూ ఆ సమయంలో ఇంట్లో లేకపోవడంతో ఎటువంటి హానీ జరగలేదు.