
కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఒక కారణమైతే.. అదే ఉచిత బస్సు సౌకర్యాన్ని ఉపయోగించుకుని..ఓ మహిళ తన ప్రేమికుడి వద్దకు చేరింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
11 నెలల పాపకు తల్లి అయిన ఒక మహిళ.. తన ప్రేమికుడి వద్దకు వెళ్లేందుకు కర్నాటకలో ప్రవేశపెట్టిన ఉచిత బస్సు సౌకర్యాన్ని ఉపయోగించుకుని ఇంటి నుంచి వెళ్లిపోయింది. కర్నాటకలోని హుబ్బళ్లిలో నివాసం ఉంటున్న ఓ మహిళకు పెళ్లి కాకముందు నుంచే ఏపీలోని చిత్తూరు జిల్లా పుత్తూరు పట్టణంలో కూలీ పనులు చేసుకునే యువకుడితో ప్రేమలో పడింది. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో హెచ్చరించారు. ఆమె వద్ద ఉన్న సెల్ ఫోన్ ను లాక్కుని.. ఆంక్షలు విధించారు. మరో యువకుడితో పెళ్లి చేశారు పెద్దలు. పెళ్లి అయినా తన ప్రేమికుడిని మాత్రం మర్చిపోలేదు సదరు యువతి. అతడితో సంబంధాన్ని కొనసాగిస్తూ వచ్చింది. ప్రస్తుతం ఆమెకు11 నెలల పాప ఉంది. భర్తను విడిచిపెట్టి.. ప్రియుడితోనే జీవితం కొనసాగించాలని నిర్ణయించుకుంది.
ప్రియుడు కూడా తన వద్దకు రమ్మని చెప్పాడు. అయితే.. పుత్తూరుకు వెళ్లేందుకు తన వద్ద డబ్బులు లేవని చెప్పడంతో కర్నాటకలో ఉచిత బస్సు సౌకర్యాన్ని ఉపయోగించుకుని రమ్మన్నాడు. ఇంకేముంది.. ప్రియుడి ఆలోచనకు ఫిదా అయిన ప్రియురాలు.. 11 నెలల పాపను వదిలిపెట్టి.. జూన్ 13వ తేదీన ఇంటి నుంచి ఎస్కేప్ అయ్యింది. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో లబోదిబోమంటూ పుత్తూరుకు వెళ్లి ఆరా తీశారు. అయితే.. ఇద్దరూ పుత్తూరులో లేరని తెలిసి.. వెంటనే పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అన్ని చోట్ల వెతుకుతుండగా.. సిద్దకట్టే గ్రామంలో ఉన్నారని తెలుసుకున్నారు.