కవల పిల్లలను విసిరేసి చెరువులో దూకిన మహిళ

కవల పిల్లలను విసిరేసి చెరువులో దూకిన మహిళ
  •     ఇద్దరిని రక్షించిన పోలీసులు
  •     మూడేండ్ల కొడుకు మృతి 
  •     భార్యాభర్తల గొడవలే కారణం 
  •     అమీన్​పూర్​ పరిధిలో ఘటన 

రామచంద్రాపురం (అమీన్​పూర్​), వెలుగు: భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండడంతో మనస్తాపం చెందిన భార్య తన కవల పిల్లలను చెరువులో విసిరేసి తానూ దూకింది. ఈ సంఘటనలో మూడేండ్ల కొడుకు చనిపోగా, తల్లి, మరో కూతురిని పోలీసులు కాపాడారు. వరంగల్​ జిల్లాకు చెందిన విద్యాధర్ రెడ్డి, శ్వేత భార్యాభర్తలు. ఇద్దరూ సాఫ్ట్​వేర్​ ఉద్యోగాలు చేసుకుంటూ రంగారెడ్డి జిల్లా చందానగర్​లో ఉంటున్నారు. వీరికి మూడేండ్ల  వయస్సున్న కవల పిల్లలు శ్రీహా, శ్రీహాన్స్​ఉన్నారు. అయితే, శ్వేత, విద్యాధర్​రెడ్డి మధ్య కొన్ని రోజులుగా గొడవలు జరుతున్నాయి. 

శ్వేతతో బుధవారం గొడవపడిన విద్యాధర్ ​సొంత గ్రామమైన వరంగల్​ వెళ్లిపోయాడు. దీంతో కలత చెందిన శ్వేత గురువారం తెల్లవారుజామున ఇద్దరు పిల్లలను తీసుకొని స్కూటీపై అమీన్​పూర్​ పరిధిలోని పెద్ద చెరువు వద్దకు చేరుకుంది. శ్రీహా, శ్రీహాన్స్​లను ముందు చెరువులోకి విసిరేసి తాను కూడా దూకింది. అక్కడే నైట్ పెట్రోలింగ్ ​డ్యూటీ చేస్తున్న అమీన్​పూర్ హెడ్ ​కానిస్టేబుల్ ​జానకీరామ్, కానిస్టేబుల్ ప్రభాకర్ ​ఇది చూశారు. 

వెంటనే చెరువులో దూకి తల్లి శ్వేత, కూతురు శ్రీహాను బయటకు తీసుకువచ్చారు. అప్పటికే శ్రీహాన్స్ నీటిలో మునిగిపోవడంతో అతడి ఆచూకీ దొరకలేదు. గురువారంఉదయం గజ ఈతగాళ్ల సాయంతో గాలించగా శ్రీహాన్స్ ​డెడ్​బాడీ లభించింది. సీఐ నాగరాజు సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని సీఐ తెలిపారు.