
ప్రియుడితో గొడవపడిన యువతి.. ఇంటి నుండి వెళ్ళిపోయిన ఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుతారిగూడలో చోటుచేసుకుంది. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ, సుతారిగూడకు చెందిన వరగంటి శైలజ(25), స్థానికంగా ఉంటోన్న దినకర్ అనే యువకుడు గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే వీరిద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో కొన్నాళ్లుగా మాటలు లేవు.
ఈ క్రమంలో యువకుడు.. ఈ నెల 9న రాత్రి సమయంలో మద్యం మత్తులో శైలజ ఇంటికి వచ్చి ఆమెను దూషించి వెళ్లిపోయాడు. ఈ ఘటన జరిగినపుడు చుట్టు పక్కల వారు చూడటం యువతిని మానసికంగా కుంగదీసింది. దీనిని అవమానభారంగా భావించిన యువతి.. మరుసటి రోజు మధ్యాహ్నం ఎవరికి చెప్పకుండా ఇంటి నుండి వెళ్లిపోయింది. కంగారుపడ్డ కుటుంబసభ్యులు.. ఇంట్లో క్షుణ్ణంగా వెతకగా వారికి టీవీ దగ్గర ఓ లేఖ కనిపించింది.
అందులో.." అమ్మా.. అందరి ముందు నా పరువు పోయింది. ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నాను. నాకోసం వెతకొద్దు..' అని రాసింది. ఇంటి నుండి బయటకే వెళ్ళగానే యువతి తన ఫోన్ కూడా స్విచ్చాఫ్ చేసుకుంది. ఆమె కోసం ఎంత గాలించినా ఫలితం లేకపోవడంతో కుటుంబ సభ్యులు మేడ్చల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదుచేసుకున్న పోలీసులు.. యువతిని వెతికే ఆపనిలో పడ్డారు.