తెలంగాణ మొత్తంలో మహాలక్ష్మి స్కీమ్‌‌తో మహిళలు ఖుష్‌‌

తెలంగాణ మొత్తంలో మహాలక్ష్మి స్కీమ్‌‌తో మహిళలు ఖుష్‌‌
  • గ్రేటర్​లో 2,559 ఆర్డినరీ, మెట్రో ఎక్స్​ప్రెస్‌‌లో ఫ్రీ జర్నీ సదుపాయం
  • సుమారు ఆరున్నర లక్షలకు పైగామహిళలు, యువతులకు వర్తింపు
  • 2 లక్షల 70 వేల మంది విద్యార్థినులకు ప్రయోజనం

సికింద్రాబాద్​ / పద్మారావునగర్, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరు గ్యారెంటీ స్కీమ్​ల అమలులో భాగంగా శని వారం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని ప్రారంభించింది. మహాలక్ష్మీ స్కీమ్ పేరుతో ప్రారంభించిన ఈ స్కీమ్​కు గ్రేటర్​ పరిధిలో తొలిరోజు మహిళలు, యువతుల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది.సిటీ బస్సులతో పాటు  జూబ్లీ బస్​ స్టేషన్​వద్ద జిల్లాలకు వెళ్లే బస్సులు మహిళా ప్యాసింజర్లతో కిటకిటలాడాయి. సిటీ బస్సుల్లో జీరో ఫెయిర్​ టికెట్లను ఇవ్వగా.. జిల్లాలకు వెళ్లే బస్సుల్లో ఆధార్ కార్డు చూపించి మహిళలు ప్రయాణించారు. సిటీలో 29 డిపోల పరిధిలో 2,638 ఆర్టీసీ బస్సులు ఉండగా,  ఇందులో కేవలం 79 మాత్రమే ఏసీ, పుష్పక్ బస్సులున్నాయి.

మిగతా 2,559 బస్సులు ఆర్టీనరీ, మెట్రో ఎక్స్​ప్రెస్‌‌లు ఉండటంతో వీటన్నింటిలో మహిళలు, యువతులు, విద్యార్థినులు ఫ్రీగా జర్నీ చేయొచ్చని ఆర్టీసీ అధికారులు తెలిపారు. అవసరమైతే మరిన్ని ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌‌ప్రెస్‌‌లు పెంచే ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు.  సిటీలో రోజుకు 7. 68 లక్షల కి.మీ మేర 30 వేల ట్రిప్పుల్లో దాదాపు18 లక్షల మంది ప్యాసింజర్లు రాకపోకలు సాగిస్తున్నారు.  ఇందులో సుమారు 7 లక్షల మంది వరకు మహిళలు, విద్యార్థినులు, యువతులు ఉన్నారు. ఇందులో 5 లక్షల వరకు బస్ పాస్​లుండగా..  విద్యార్థినుల బస్ పాస్​లు 2 లక్షల 70 వేలు ఉన్నాయి.

ప్రస్తుతం మహాలక్ష్మీ స్కీమ్ అమల్లోకి రావడంతో  గ్రేటర్ సిటీలో దాదాపు  ఆరున్నర లక్షల మంది మహిళలు యువతులు, 2 లక్షల 70 వేల మంది విద్యార్థినులకు ఉచితంగా ప్రయాణించే అవకాశం దక్కింది.  ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి రావడంతో మహిళా ప్యాసింజర్ల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని ఆర్టీసీ అధికారులు తెలిపారు. గ్రేటర్ పరిధిలో రోజూ సిటీ బస్సుల ద్వారా రూ.4 కోట్ల వరకు ఆదాయం వస్తుండగా.. డీజిల్​కు రూ. కోటిన్నర ఖర్చవుతోంది. అయితే, ఉచిత ప్రయాణం కారణంగా సుమారు రూ.90 లక్షల వరకు ఆర్టీసీపై ఆర్థిక భారం పడే అవకాశం ఉంది.

ఇంకా టిక్కెట్లు రాలేదు

మహాలక్ష్మి స్కీమ్​కు సంబంధించిన టికెట్లు మాకు అందలేదు. ప్రస్తుతానికి మహిళలందరినీ బస్సుల్లో అనుమతిస్తున్నాం.  టిక్కెట్లు రావడానికి ఇంకో రెండు రోజులు పడుతుంది.  అందుకే ఎన్​ఆర్​లో మహిళా ప్యాసింజర్ల వివరాలు నమోదు చేస్తున్నం.

- సరిత, కండక్టర్, సిద్దిపేట డిపో

రెస్పాన్స్ బాగుంది

కొత్తగా అమల్లోకి వచ్చిన మహాలక్ష్మి స్కీమ్​కు మహిళల నుంచి స్పందన బాగా వస్తోంది.శనివారం మధ్యాహ్నం 2 గంటల తర్వాత స్కీమ్ ప్రారంభమైనప్పటికీ మహిళా ప్యాసింజర్లు జూబ్లీ బస్టాండ్‌‌కు బారీగా తరలివచ్చారు.  కొద్ది రోజుల ముందు నుంచే ఈ స్కీమ్​పై ప్రచారం జరిగినందున మహిళల్లో అవగాహన పెరిగింది.  ఇప్పుడైతే ఎలాంటి గుర్తింపు కార్డులు లేకుండానే వీరికి బస్సు ప్రయాణానికి అనుమతిస్తున్నాం. మహాలక్ష్మి టిక్కెట్లు రాగానే ఆధార్​ లాంటి గుర్తింపు కార్డులు చూపించాల్సి ఉంటుంది. 

- వి.తిరుపతి రెడ్డి, కంట్రోలర్​, టీఎస్​ఆర్టీసీ

బస్సుల సంఖ్య పెంచాలి

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహిళలకు ప్రాధాన్యతనిస్తూ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం బాగుంది. బస్సుల్లో  జనాలు ఎక్కువ ఉంటున్నరు. సర్వీసుల సంఖ్య పెంచితే బాగుంటుంది.

- భారతమ్మ, హిమాయత్ నగర్​

నెలకు రూ. 4 వేల వరకు మిగులుతాయి

బస్సుల్లో ఉచితంగా ప్రయాణించడానికి మాకు అవకాశం ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉంది.  మేము నెలంతా బస్సుల్లో వివిధ ప్రాంతాలకు వెళ్తుంటాం.  ఇప్పుడు ఈ స్కీమ్  వల్ల మాకు నెలకు దాదాపుగా రూ. 4 వేల వరకు డబ్బులు మిగులుతాయి.  

-  పల్లవి, మున్నీ,  ట్రాన్స్‌‌జెండర్స్​