
మహిళలు చదువుకుంటున్నారు. ఉద్యోగాలు చేస్తున్నారు. బాగా సంపాదిస్తున్నారు. పురుషులకు ధీటుగా ఎదుగుతున్నారు. కానీ, ఇవి కొందరికి మాత్రమే వర్తిం చే మాటలు. ఎందుకంటే.. కొలువుల్లో చేరిన మహిళలు ఎక్కు వకాలం ఉద్యోగాలు చేయడం లేదు. కొం తకాలం చేశాక మానేస్తున్నారు. సంపాదన, అభివృద్ధి, లక్ష్యం.. ఈ దిశగా సాగాలని నిర్ణయిం చుకున్న వాళ్లు కాస్తా, మధ్యలోనే ఉద్యోగం మానేసి ఇంటికి పరిమితం అవుతున్నారు.
కార్పొరేట్ ఉద్యోగాలు చేస్తున్న స్త్రీలు.. ఐదంకెల జీతం తీసుకుంటున్న యువతులు.. మేనేజర్ స్థాయిలో ఉన్న మహిళలు.. ఇలా ఉన్నత స్థాయిలోని స్త్రీలు కూడా ఉద్యోగాలు వదిలేస్తున్నారు. ఇందుకు కారణాలు చాలానే ఉన్నాయి. ఒక్కొక్కరిది ఒక్కో సమస్య. ఏదేమైనా చేస్తున్న జాబ్ వద్దని ఇంట్లోనే ఉంటున్నారు.
పిల్లల పెంపకం
ఉద్యోగం చేస్తున్న మహిళలు.. పెళ్లై పిల్లలు పుట్టిన తర్వాత ఉద్యోగం మానేస్తున్నారు. ఇంట్లో పిల్లల ఆలనాపాలనా చూసుకోడానికి ఎవరూ లేకపోవడం వల్ల, మాతృప్రేమను పిల్లలకు పంచాలనే ఉద్దేశంతో ఇంటి దగ్గరే ఉంటున్నారు. భర్త, అత్తమామలు కూడా పెళ్లై పిల్లలున్న స్త్రీలను ఉద్యోగాలకు పంపడానికి అంగీకరించడం లేదు. ఎందుకంటే.. పిల్లలకు వచ్చే చిన్న చిన్న అరోగ్య సమస్యలు, వాళ్ల అవసరాలు తీర్చడానికి తల్లిని మించిన వాళ్లు మరొకరు ఉండరు. అందువల్ల అమ్మ అయిన మహిళ ఇంట్లో ఉండాలనుకుంటోంది.
వేధింపులు
ఎన్నిచట్టాలు వచ్చినా ఇప్పటికీ స్త్రీలకు కనీస భద్రత ఉండటం లేదు. ఉద్యోగాలు చేసే చోట మహిళలు పై అధికారుల వల్లవేధింపులు. తోటి ఉద్యోగుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అభ్యం తరకరమైన మాటలు, చేష్టలు, పుకార్లతో జాబ్ మానేస్తున్నారు. అలాగే ఇంటి నుంచి ఆఫీసుకు వెళ్లేటప్పుడు కలిగే ఇబ్బందులు, నైట్ డ్యూటీలు, తోటి ఉద్యోగుల నుంచి సరైన సహకారం లభించకపోవడం..లాంటివి కూడా కారణాలే. సుమారు ఉద్యోగం మానేస్తున్న స్త్రీలలో అరవై శాతంమంది పనిచేసే చోట వేధింపులు భరించలేక ఉద్యోగాలు మానేస్తున్నారు. పనిచేసే చోట మహిళలకు భద్రత లేకపోవడం వల్ల శారీరక,మానసిక హింసను భరించలేక ఉద్యోగాలు మానేస్తున్నారు.
జీతాలు తక్కువ
కొన్ని సంస్థల్లో పురుషులతో పోలిస్తే స్త్రీలకు వేతనాలు తక్కువగా ఉంటున్నాయి. ఇద్దరుచేసే పని ఒకటే అయినా, జీతాలు మాత్రం స్త్రీ, పురుషులకు వేరుగా ఉంటున్నాయి. కార్పొరేట్ సంస్థలు, పై స్థాయి ఉద్యోగాల్లో ఈ వివక్షలేకపోయినా, కింది స్థాయి ఉద్యోగాల్లో ఈతేడా కచ్చితంగా కనిపిస్తుంది. అసంఘటిత రంగాల్లో స్త్రీకి ఇచ్చే వేతనం పురుషుడికి ఇచ్చేదానికంటే తక్కువగా ఉంటుంది. అందువల్ల ఈ రంగాల్లో పనిచేసే స్త్రీలు ఉద్యోగాలు తరుచూ మారుతుంటారు. ప్రత్యామ్నాయంగా ఏ చిన్న ఆదాయ వనరు దొరికినా ఉద్యోగాన్నిమానేస్తారు.
ఒత్తిడి
ఇంటిపనితోపాటు, ఉద్యోగం కూడాచేయడం వల్ల చాలామంది స్త్రీలు ఎక్కువఒత్తిడికి గురవుతున్నారు. ఆఫీసు పనులకు,ఇంటిపనులకు మధ్య సయోధ్య కుదరక ఇబ్బందులు పడుతున్నారు. ఒత్తిడి ఎక్కువై జాబ్ వదిలేస్తున్నారు. ఉదయం నిద్రలేచి ఇంటిపనులన్నీ చక్కబెట్టి, పది గంటలకల్లా ఆఫీసుకువెళ్లాలి . సాయంత్రం ఐదు గంటల వరకుఆఫీసులో పనులుంటాయి. మళ్లీ సాయంత్రం ఇంటికి వచ్చి వంటా వార్పు లాంటి ఇంటిపనుల్లో బిజీ అవ్వాలి. దాంతో క్షణం తీరికలేకుండా పోతుంది ఉద్యోగినులకు. ఇకపిల్లల పనులు, భర్తకు అన్నీ అమర్చి పెట్టడం..లాంటి వాటితో అటు ఉద్యోగానికీ, ఇటుకుటుంబ సభ్యులకు న్యాయం చేయలేక సతమతమవుతుంటారు. శారీరక, మానసిక అనారోగ్యాల పాలవుతూ.. ఒత్తిడి భరించలేక ఉద్యోగాన్ని వదులుకోవడమే మంచిదని నిర్ణయించు కుంటున్నారు.
ఆఫీసు వాతావరణం నచ్చలేదు…
నేను మూడు నెలల క్రితం వరకు ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేసేదాన్ని . మా ఆఫీసులోసహోద్యోగుల మధ్య రాజకీయాలు ఎక్కువ. ఒకరంటే ఒకరికి పడదు. ఒకరి మీద మరొకరుఎప్పుడూ చాడీలు చెప్పుకునేవాళ్లు. వాటివల్ల నేను అకారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాను.పర్సనల్ లైఫ్ కూడా డిస్ట్రబ్ అయిం ది. అందుకే ఉద్యోగం, జీతం కంటే మానసిక ప్రశాం తతముఖ్యమనిపించిం ది. కొన్ని నెలలు కుటుం బంతో గడపాలనుకున్నాను. అందుకే ఉద్యోగంమానేశాను.
– సాతి, హైదరాబాద్
జాబ్ సాటిస్ ఫేక్షన్ లేదు
పూణెలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గా పనిచేసే దాన్ని .కానీ, జాబ్ లో సాటిస్ పేక్షన్ ఉండేది కాదు. ఏదన్నా ప్రొడెక్టివ్ గా చేస్తే మనకీ తృప్తి ఉండాలి. వాళ్లూ సంతోషంగా ఉండాలి. కాని అక్కడి వాతావారణం అలా అనిపించలేదు. ఆర్థికంగా స్థిరపడాలని మొదట్లో ఉద్యోగాన్ని ఎంచుకున్నాను. కానీ నచ్చలేదు. ఏదో వర్క్ ఇస్తున్నారు. ఏదో చేస్తున్నా అనిపించేది. రోజూ వెళ్లడం, రావడం అంతవరకే. దాంతో.. సొంతంగా ఏదన్నా చెయ్యాలి. మనమూ నలుగురైదుగురికి ఉపయోగపడాలి అనే ఆలోచన వచ్చింది. మొదట్లో హైదరాబాద్ వచ్చాక, క్రాఫ్టౌన్ పేరుతో వ్యాపారం మొదలుపెట్టా. పాతతరం ఆడిన ఆటలు, అప్పటి సంస్కృతి తెలిసేలా ఉంటుంది మా క్రాఫ్టోన్. ఈ వ్యాపారంలో చాలా సంతోషంగా ఉన్నాం. సహజ రంగులను కూడా తీసుకు రావాలనుకుంటున్నాం. ఇప్పుడు సొంతంగా ఒక పని చేస్తున్నాం అన్న సంతోషం ఉంది. జాబ్ మానేసిన లక్ష్యం నెరవేరిందని నేనుఅనుకుంటున్నాను.
– లాస్య, హైదరాబాద్