అస్సాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా మహిళల నిరసన

అస్సాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా మహిళల నిరసన

బాల్య వివాహాలకు సంబంధించిన కేసులో అరెస్టయిన తమ భర్తలను, కుమారులను వెంటనే విడుదల చేయాలంటూ అసోంలో మహిళలు డిమాండ్ చేశారు. పోలీస్ స్టేషన్ గేటును, గోడను బద్దలు కొట్టడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో పరిస్థితిని అదుపులో తెచ్చేందుకు పోలీసు సిబ్బంది వారిపై లాఠీఛార్జ్ చేయాల్సి వచ్చింది. ఈ ఘర్షణలో ఒక సీఆర్పీఎఫ్ జవాను గాయపడ్డాడని ధుబ్రి జిల్లా పోలీస్ సూపరిండెంట్ అపర్ణ తెలిపారు. అయితే ప్రస్తుతం మాత్రం పరిస్థితి అదుపులో ఉందని వెల్లడించారు. బాల్య వివాహాలకు సంబంధించిన కేసుల్లో అస్సాం పోలీసులు ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 2258 మందిని అరెస్టు చేశారు. వారిలో 52మంది పురోహితులు కూడా ఉన్నారని డీజీపీ జీపీ సింగ్ తెలిపారు. 

బార్ పేట, కోక్రాఝర్, విశ్వనాథ్ జిల్లాల నుండి అత్యధిక మందిని అరెస్టు చేశామన్నారు. రాష్ట్రంలో బాల్య వివాహాలు పెరుగుతున్న నేపథ్యంలే సీఎం హిమంత బిస్వ శర్మ అదేశాల మేరకు తాము దర్యాప్తు చేపట్టామని స్పష్టం చేశారు. అయితే అరెస్టయిన వారిపై చాలా వరకు పోక్సో చట్టం, ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని, చట్టం ప్రకారం చర్యలు కూడా తీసుకుంటామని డీజీపీ తెలిపారు. వారిని త్వరలోనే కోర్టులో హాజరు పరుస్తామని వివరించారు.