
హైదరాబాద్, వెలుగు: మహిళలు పని చేసే ప్రదేశాల్లో స్వేచ్ఛా వాతావరణాన్ని కల్పించాల్సిన అవసరం ఉందని విశాక ఇండస్ట్రీస్ ఎండీ సరోజ వివేకానంద అన్నారు. మహిళా సాధికారత విషయంలో ఇప్పటికే విప్లవాత్మక మార్పులు వచ్చాయని, ఇంకా పెరగాల్సిన అవసరం ఉందని సీఐఐ మహిళా విభాగం “ఫుట్ ప్రింట్స్ ఫర్ ఫ్యూచర్” పేరుతో నిర్వహించిన సదస్సులో ఆమె చెప్పారు. మహిళా సాధికారత విషయంలో, మహిళలకు సమాన అవకాశాలు కల్పించే విషయంలో సరోజ విశిష్ట సేవలు అందించారని సీఐఐ మహిళా విభాగం నూతన కార్యవర్గం అభినందించింది. గతంలో సీఐఐ ఐడబ్ల్యుఎన్ ఛైర్ ఉమన్‌గా వ్యవహారించిన సరోజ వివేకానందను ఈ సందర్భంగా సత్కరించారు. సీఐఐ ఐడబ్ల్యుఎన్ 7వ యాన్యువల్ డే సెలబ్రేషన్స్‌ను హైదరాబాద్‌లో బుధవారం నిర్వహించారు. అన్ని రంగాల్లో మహిళల పాత్రను పెంచేందుకు ఈ సీఐఐ ఐడబ్ల్యుఎన్ ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటోంది. ఈ దిశలో ప్రతీ ఏడాదీ చురుగ్గా వివిధ సదస్సులు, సమావేశాలను ఏర్పాటు చేస్తోంది. 2020–21 సంవత్సరానికి కొత్త కమిటీని ఎన్నుకున్నారు. కొత్త ఛైర్ ఉమన్‌గా స్వాతి కాంతమనేని, వైస్ ఛైర్ ఉమన్‌గా పూర్ణిమ కాంబ్లెలు ఎన్నికయ్యారు.