
- కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో మహిళల చేతివాటం
కాగజ్ నగర్, వెలుగు: కాళ్లకు వెండి పట్టీలు కావాలని నలుగురు మహిళలు గోల్డ్ షాప్ కు వచ్చి, కిలో వెండి నగలను ఎత్తుకెళ్లారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలోని బ్రహ్మానందం జ్యువెలరీ షాప్ లో పట్టపగలు మహిళలు వెండి చోరీ చేశారు. రకరకాల వెండి పట్టీలు చూసి, వెళ్లిపోయారు. కాసేపటి తరువాత షాప్ ఓనర్ చూసుకునే సరికి కాళ్లపట్టీల గుత్తి కనబడలేదు.
దీంతో వెండి పట్టీలు చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెండి పట్టీల విలువ రూ.1.50 లక్షలు ఉంటుందని షాప్ ఓనర్ తెలిపాడు. పోలీసులు షాప్ కు చేరుకుని సీసీ పుటేజీని పరిశీలించారు. కాగా, సదరు మహిళలు కాజీపేట రైల్వే స్టేషన్ లో దొరికినట్లు సమాచారం. ఈ ఘటనపై విచారణ చేస్తున్నట్లు టౌన్ సీఐ ప్రేమ్ కుమార్ తెలిపారు.