మహిళలే కీలకం.. పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే అధికం

 మహిళలే కీలకం..   పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే అధికం
  • గెలుపు, ఓటములను నిర్ణయించేది వాళ్లే 
  • కామారెడ్డి జిల్లాలో పురుషుల కంటే 24,701 మంది మహిళా ఓటర్లుఎక్కువ

కామారెడ్డి, వెలుగు : స్థానిక సంస్థల ఎన్నికల్లో  మహిళా ఓటర్లు అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. గెలుపు, ఓటముల్లో కీలకం కానున్నారు.  కామారెడ్డి జిల్లాలో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు 24,701 మంది ఎక్కువ.  జిల్లాలో 6,39,730 ఓటర్లు ఉండగా, పురుషులు  3,07,508 మంది,  మహిళలు 3,32,209 మంది , ఇతరులు 13 మంది ఉన్నారు.  ఒకటి నుంచి  పది ఓట్ల తేడాతో కూడా ఫలితాలు తారుమారయ్యే పరిస్థితులు ఉంటాయి.   

మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు  బరిలో నిలిచే అభ్యర్థులు  పడరాని పాట్లు పడుతారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు మెంబర్ల ఎన్నికల్లో  పోటీ చేసేందుకు రెడీ అవుతున్న  ఆశావహులు ఓటర్ల సమాచారం కూడా సేకరిస్తున్నారు.  మహిళా ఓటర్లు హామీ ఇస్తే గెలుపు ఖాయమని, ముందుగానే మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాలు చేయనున్నారు. నాగిరెడ్డిపేట మండలంలో పురుషుల కంటే 1,799 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. భిక్కనూరు మండలంలో 1,696 మంది మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. డొంగ్లి మండలంలో పురుషుల కంటే 35 మంది మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు.  ఇక్కడ పురుషులు  7,349 ఉంటే, మహిళలు 7,384 మంది ఉన్నారు.   

పాలనలోనూ

పాలనలోనూ మహిళలకు ప్రయార్టీ దక్కింది.   స్థానిక సంస్థల్లో 50 శాతం మహిళలకు రిజర్వేషన్​ ఉంది. ఈ స్థానాలతో పాటు జనరల్ స్థానాల్లో కూడా మహిళలు పోటీ చేయవచ్చు.  జిల్లాలో మొత్తం 25 జడ్పీటీసీ స్థానాల్లో  మహిళలకు 12,  ఎంపీపీలు 12,  ఎంపీటీసీ స్థానాలు 98,  సర్పంచ్​ స్థానాలు 231 రిజర్వు అయ్యాయి.  మొత్తం వార్డు మెంబర్లు 4,454 ఉండగా, ఇందులో సగం మహిళకు కేటాయించారు.