1996 నుంచీ ఆమోదానికి నోచుకోని మహిళా బిల్లు

1996 నుంచీ ఆమోదానికి నోచుకోని మహిళా బిల్లు
  • దేవెగౌడ, వాజ్ పేయి హయాంలో అనేకసార్లు ఫెయిల్
  • మన్మోహన్ హయాంలో రాజ్యసభలో మాత్రమే పాస్

న్యూఢిల్లీ : చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల బిల్లు దాదాపు మూడు దశాబ్దాలుగా ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంటూ వస్తోంది. మహిళా బిల్లుకు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ ఎప్పుడూ అనుకూలంగానే ఉన్నాయి. కానీ 33% మహిళల కోటాలో ఎస్సీ, ఎస్టీలకు, ఆంగ్లో ఇండియన్లకు మాత్రమే సబ్ రిజర్వేషన్ కల్పించారు. ఇందులో ఓబీసీ మహిళలకూ సబ్ రిజర్వేషన్ కల్పించాలంటూ ఎస్పీ, ఆర్జేడీ, జేడీయూ వంటి పార్టీలు మూడు దశాబ్దాలుగా వ్యతిరేకిస్తున్నాయి. దీంతో దశాబ్దాలుగా ఈ బిల్లు ఆమోదానికి నోచుకోవడం లేదు.

తెరపైకి తెచ్చింది రాజీవ్  

మహిళా రిజర్వేషన్ల అంశాన్ని తొలిసారిగా1989లో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ తెరపైకి తెచ్చారు. గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కోసం ఆయన రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. లోకల్ బాడీస్ లో మహిళా రిజర్వేషన్ ల అంశాన్నితొలిసారిగా బీజం వేశారు. ఆ బిల్లు లోక్ సభలో పాస్ అయినా, రాజ్యసభలో ఫెయిల్ అయింది. ఆ తర్వాత 1992, 1993లో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు లోకల్ బాడీస్ లో చైర్ పర్సన్ పోస్టులు సహా అన్ని సీట్లలోనూ మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించేందుకు 72, 73వ రాజ్యాంగ సవరణ బిల్లులను ప్రవేశపెట్టారు. ఈ రెండు బిల్లులూ ఉభయసభల్లో పాస్ అయి చట్ట రూపం దాల్చాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ని పంచాయతీలు, మున్సిపాల్టీల్లో దాదాపు 15 లక్షల మంది ఎన్నికైన మహిళా ప్రజాప్రతినిధులు ఉన్నారు.

దేవెగౌడ హయాంలో షురూ..

పార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్ల కోసం 1996, సెప్టెంబర్ 12న అప్పటి ప్రధాని దేవె గౌడ 81వ రాజ్యాంగ సవరణ బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టారు. లోక్ సభలో ఈ బిల్లు ఫెయిల్ కావడంతో దీనిని గీతా ముఖర్జీ నేతృత్వంలోని జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి పంపారు. ముఖర్జీ కమిటీ 1996 డిసెంబర్ లో తన నివేదికను సమర్పించింది. కానీ లోక్ సభ రద్దు కావడంతో
బిల్లు ల్యాప్స్ అయిపోయింది.

వాజ్ పేయి హయాంలో 4 సార్లు..

రెండేండ్ల తర్వాత 1998లో అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి హయాంలో మహిళా కోటా బిల్లును మళ్లీ లోక్ సభలో ప్రవేశపెట్టారు. ఈసారి కూడా బిల్లు ఫెయిల్ అయింది. ఆ తర్వాత ల్యాప్స్ అయిపోయింది. అనంతరం వాజ్ పేయి హయాంలోనే1999, 2002, 2003లోనూ బిల్లును ప్రవేశపెట్టారు. కానీ పాస్ కాలేకపోయింది.

మన్మోహన్ హయాంలో రాజ్యసభలో పాస్  

ఐదేండ్ల తర్వాత 2008లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ హయాంలో మళ్లీ ఈ బిల్లు తెరపైకి వచ్చింది. 2008, మే6న దీనిని రాజ్యసభలో ప్రవేశపెట్టారు. లోక్ సభలో బిల్లు తరచూ ల్యాప్స్ అవుతున్నందున దీనిని ఈసారి రాజ్యసభలో ప్రవేశపెట్టారు. రాజ్యసభలో పాస్ అయిన లేదా, పెండింగ్ లో ఉన్న బిల్లులు ల్యాప్స్ కాకపోవడమే దీనికి కారణం. ఈ వెర్షన్ బిల్లులో గీతా ముఖర్జీ కమిటీ చేసిన 7 సిఫార్సులలో 5 సిఫార్సులను చేర్చారు. అయితే, ముఖర్జీ రిపోర్ట్ లో పార్లమెంటులో ఓబీసీ కోటాను కల్పించినప్పుడు మహిళా కోటాలోనూ ఇవ్వాలని సిఫార్సు ఉంది. అట్లాగే రాజ్యసభ, రాష్ట్రాల శాసన మండళ్లలోనూ మహిళా కోటా ఇవ్వాలని ఉంది. ఈ రెండు పాయింట్లను 2008 నాటి బిల్లులో చేర్చలేదు. దీనిని 2008, మే 9న స్టాండింగ్ కమిటీకి పంపారు. స్టాండింగ్ కమిటీ మరుసటి ఏడాది డిసెంబర్ 17న రిపోర్ట్ అందజేసింది. అనంతరం 2010, ఫిబ్రవరిలో దీనికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. తర్వాత 2010, మార్చి 9న రాజ్యసభలో ఈ బిల్లును వ్యతిరేకించిన పలు పార్టీల ఎంపీలను మార్షల్స్ ద్వారా బయటకు పంపేసి మరీ బిల్లును186/1 ఓట్ల తేడాతో ఆమోదించారు. లోక్ సభలో ప్రవేశపెట్టిన బిల్లును మాత్రం సభ కన్సిడర్ చేయలేదు. 2014లో లోక్ సభ రద్దు కావడంతోనే ఈ బిల్లు ల్యాప్స్ అయింది. రాజ్యసభలో పాస్ అయిన బిల్లు మాత్రం ఇప్పటికీ యాక్టివ్​గానే కొనసాగుతోంది.

నవ భారతానికి పునాది: స్మృతి

న్యూఢిల్లీ : మహిళా రిజర్వేషన్‌ బిల్లు ద్వారా నవ భారతానికి పునాది పడిందని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అన్నారు.  ఏళ్ల తరబడి సాగిన పోరాటానికి పరిష్కారం చూపినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి థ్యాంక్స్ చెబుతున్నట్లు వెల్లడించారు. మంగళవారం ఆమె పార్లమెంటు బయట మీడియాతో మాట్లాడారు. మహిళా బిల్లు చారిత్రాత్మకమని..ఇది మహిళా సాధికారతకు దారి తీస్తుందని మంత్రి  స్మృతి ఇరానీ వివరించారు. గణేశ్ పండుగ సందర్భంగా  ఏ తీర్మానం చేసినా మంచి ఫలితం వస్తుందని తెలిపారు. పార్టీల మధ్య ఏకాభిప్రాయం కోసం 27 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న మహిళా  బిల్లు.. కొత్త పార్లమెంట్ భవనంలో మొదటి బిల్లుగా నిలవనుంది. ఇది రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో  విధానాల రూపకల్పనలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచుతుందని కేంద్రం తెలిపింది. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చే లక్ష్యాన్ని చేరుకోవడంలోనూ  దోహదపడుతుందని పేర్కొంది.

ఎన్నికలు ఉన్నందుకే మహిళా  బిల్లు తెచ్చారు: కపిల్ సిబల్

న్యూఢిల్లీ :  మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించడానికి 10 ఏండ్లు ఎందుకు పట్టిందని ప్రధాని నరేంద్ర మోదీని రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్  ప్రశ్నించారు. 2024లో సార్వత్రిక ఎన్నికలు ఉన్నందుకే మహిళా బిల్లును తెచ్చారని ఆరోపించారు.“మహిళా రిజర్వేషన్ బిల్లుకు గతంలోనే దాదాపు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. అయినా దాన్ని ఆమోదించడానికి మోదీకి పదేండ్లు పట్టింది. ఉన్నట్టుండి ఈ బిల్లు తెరమీదకు రావడానికి 2024 ఎన్నికలే కారణం అనుకుంటున్నా. అయితే ఓబీసీ మహిళలకు కోటా కల్పించకపోతే 2024 ఎన్నికల్లో  యూపీలో  బీజేపీ ఓడిపోవచ్చు! దాని గురించి ఆలోచించండి!" అని కపిల్ సిబల్ ట్వీట్ చేశారు. యూపీఏ 1, 2 హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన సిబల్.. కాంగ్రెస్‌ను వీడి సమాజ్‌వాదీ పార్టీ మద్దతుతో స్వతంత్ర సభ్యుడిగా రాజ్యసభకు ఎన్నికయ్యారు.

మహిళా రిజర్వేషన్ ​బిల్లు గొప్ప ముందడుగు

మహిళా రిజర్వేషన్​ బిల్లును కేంద్ర కేబినెట్​ ఆమోదించడాన్ని స్వాగతిస్తున్నం. పార్లమెంటులో బిల్లును చర్చకు ప్రవేశపెట్టడం ఓ గొప్ప ముందడుగు.  పురుషాధిక్య రాజకీయ రంగంలో ఎట్టకేలకు మహిళా రిజర్వేషన్​ బిల్లు వాస్తవ రూపం దాల్చడం సంతోషంగా ఉంది. జనాభాలో మహిళలు సగం ఉన్న ప్రజా ప్రాతినిధ్యంలో వెనుకపడి ఉన్నారు. మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యాన్ని పెంచే మహిళా బిల్లును పార్లమెంటులో చర్చకు పెట్టడం ఓ గ్రేట్​స్టెప్.​  - పీడీపీ చీఫ్ ​మెహబూబా ముఫ్తీ

మోదీ నిర్ణయాల వెనుక దేశ ప్రయోజనాలు: ఏక్‌నాథ్ షిండే

ముంబై :  మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్‌లో స్వాగతిస్తామని మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే అన్నారు. ముంబైలోని ఆయన అధికారిక నివాసంలో  గణేశ్ విగ్రహ ప్రతిష్టాపన అనంతరం షిండే విలేకరులతో మాట్లాడారు.  “ప్రధాన మంత్రి ఏ నిర్ణయం తీసుకున్నా అది దేశ ప్రయోజనాల కోసమే అని నమ్ముతాం. మహిళా రిజర్వేషన్ బిల్లుపై మోదీ నిర్ణయం అధికారికంగా వెలువడితే స్వాగతిస్తం. ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంటలు కోల్పోయిన రైతులకు  మహారాష్ట్ర ప్రభుత్వం  నిబంధనలలో  నిర్దేశించిన దానికంటే ఎక్కువ సహాయం అందించింది. రైతులకు సరిపడా ఆర్థిక సహాయం అందించడానికి కొన్ని సార్లు నిబంధనలను ఉల్లంఘించాల్సి వస్తుంది. అందులో భాగంగానే గతంలో రెండు హెక్టార్ల కంటే తక్కువ భూమి ఉన్న రైతులకు అందించే సాయన్ని ఇప్పుడు  మూడు హెక్టార్లకు పెంచాం’’ అని ఏక్‌నాథ్ షిండే పేర్కొన్నారు.