మహిళా రిజర్వేషన్స్​

మహిళా రిజర్వేషన్స్​

చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్​ కల్పించేందుకు ఉదేశించేది మహిళా బిల్లు ’నారీ శక్తి వందన్​ అధినియమ్​(128వ రాజ్యాంగ సవరణ బిల్లు). ఈ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్​రామ్​ మేఘ్​వాల్​ 2023, సెప్టెంబర్ 13న లోక్​సభలో ప్రవేశపెట్టారు. సెప్టెంబర్​ 20న ఆమోదం పొందింది. సెప్టెంబర్ 21న రాజ్యసభలో ప్రవేశపెట్టి ఆమోదం పొందారు. సెస్టెంబర్​ 29న రాష్ట్రపతి ఆమోదం తెలపడంతో  నారీ శక్తి వందన్​ అధినియమ్​ చట్ట రూపం దాల్చింది. మహిళా రిజర్వేషన్ బిల్లుకు లోక్​సభలో 454 మంది సభ్యులు మద్దతు తెలుపగా, ఇద్దరు వ్యతిరేకించారు. రాజ్యసభలో 214 మంది సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. 

లోక్​సభ, రాష్ట్ర శాసనసభలు, ఢిల్లీ జాతీయ రాజధాని భూభాగంలోని శాసనసభలో మూడింట ఒక వంతు సీట్లను మహిళలకు కేటాయించింది. లోక్​సభ, రాష్ట్రాల శాసనసభల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వు చేసిన స్థానాలకూ ఇది వర్తిస్తుంది. ఈ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత నిర్వహించే జనాభా గణన తర్వాత రిజర్వేషన్​ అమలులోకి వస్తుంది. జనాభా లెక్కల ఆధారంగా మహిళలకు సీట్లు కేటాయించేందుకు డీలిమిటేషన్​ చేపట్టనున్నారు. అందువల్ల మహిళా రిజర్వేషన్లు 2029 తర్వాత అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. పార్లమెంట్​ చేసిన చట్టం ద్వారా ఇవి నిర్ణయించబడతాయి. 15 ఏండ్లపాటు రిజర్వేషన్​ కల్పిస్తారు. అయితే, ఇది పార్లమెంట్​ చేసిన చట్టం ద్వారా నిర్ణయించిన తేదీ వరకు కొనసాగుతాయి. రొటేషన్​ పద్ధతిలో సీట్లు కేటాయిస్తారు. మహిళలకు హారిజంటల్​, వర్టికల్​ రిజర్వేషన్లు ఉన్నాయి. 

ప్రభావితమయ్యే ఆర్టికల్స్​

ఆర్టికల్​ 332ఏ: ఈ బిల్లు ప్రతి రాష్ట్ర శాసనసభలో మహిళలకు సీట్ల రిజర్వేషన్​ను తప్పనిసరి చేసే ఆర్టికల్ 332ఏను ప్రవేశపెడుతుంది. అదనంగా ఎస్సీ, ఎస్టీలకు రిజర్వు చేసిన సీట్లలో మూడింట ఒక వంతు మహిళలకు కేటాయించాలి. శాసనసభలకు ప్రత్యక్ష ఎన్నికల ద్వారా భర్తీ చేసే మొత్తం సీట్లలో మూడింట ఒక వంతు మహిళలకూ రిజర్వు చేయాలి. 

ఆర్టికల్​​ 239ఏఏ(2)(బి): ఆర్టికల్​ 239ఏఏ ప్రకారం కేంద్ర పాలిత ప్రాంతమైన ఢిల్లీకి పరిపాలన, శాసన పనితీరుకు జాతీయ రాజధానిగా ప్రత్యేక హోదాను మంజూరు చేస్తుంది. ఆర్టికల్​ 239ఏఏ(2)(బి) బిల్లు ద్వారా పార్లమెంట్​ రూపొందించిన చట్టాలు జాతీయ రాజధాని ఢిల్లీ భూభాగానికి వర్తిస్తాయి. 

ఆర్టికల్​ 330ఏ: లోక్​సభలో ఎస్సీ/ ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించే ఆర్టికల్​ 330లోని నిబంధనల నుంచి తెచ్చుకున్న ఆర్టికల్​ 330ఏని సవరిస్తారు. 

ఆర్టికల్ 334: చట్టాలు ఉనికిలోకి వచ్చిన 20 సంవత్సరాల తర్వాత రిజర్వేషన్ల నిబంధనలను సమీక్షించాలని పార్లమెంట్​ను ఆదేశించిన రాజ్యాంగంలోని ఆర్టికల్​ 334 నిబంధనల నుంచి బిల్లు తీసుకున్నారు. 
ఆర్టికల్ 334ఏ: ఈ సవరణ అమలులోకి వచ్చిన తర్వాత నిర్వహించే జనాభా గణన తర్వాత రిజర్వేషన్​ అమలులోకి వస్తుంది. 

గత ప్రయత్నాలు 

1996లో మొదటిసారి మహిళా రిజర్వేషన్​ బిల్లును ప్రవేశపెట్టారు. ఆ సమయంలో  ప్రధాని వాజ్​పేయి ప్రధాన మంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత 1998 నుంచి 2003 మధ్యకాలంలో నాలుగు సార్లు బిల్లు ప్రవేశపెట్టినా ఫలితం లేకుండాపోయింది. 2010లో కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలుపగా, రాజ్యసభలో ప్రవేశ పెట్టగా సభ్యులు ఆమోదించారు. 2014లో లోక్​సభలో ప్రవేశపెడతారని భావించినా జరగలేదు. 

భారత్​లో పరిస్థితి

లోక్​సభలో 82  మంది మహిళా పార్లమెంట్​ సభ్యులు (15.2 శాతం), రాజ్యసభలో 31 మంది మహిళలు (13 శాతం) మాత్రమే ఉన్నారు. 1వ లోక్​సభలో 5 శాతం ఉండగా, ప్రస్తుతం 15.2 శాతానికి చేరినా చాలా దేశాలతో పోల్చితే చాలా తక్కువగా ఉంది. రాష్ట్ర శాసనసభల్లో సగటున మొత్తం సభ్యుల్లో 9 శాతం మహిళలు ఉన్నారు.

ఐక్యరాజ్య సమితి గణాంకాల ప్రకారం చట్ట సభల్లో అత్యధికంగా మహిళల ప్రాతినిధ్యం ఉన్న దేశాల్లో తొలి మూడు స్థానాల్లో రువాండా (61 శాతం), క్యూబా (53 శాతం), నికరాగ్వా (52 శాతం) ఉన్నాయి. పొరుగు దేశాలైన బంగ్లాదేశ్​ (21 శాతం), పాకిస్తాన్ (20 శాతం) కంటే భారత్​లో మహిళల ప్రాతినిధ్యం తక్కువగా ఉంది. 

గ్లోబల్​ జెండర్​ గ్యాప్​ ఇండెక్స్​ రిపోర్ట్​ 2022 ప్రకారం రాజకీయ సాధికారితలో 146 దేశాల్లో భారత్​ 48వ స్థానంలో ఉంది. అయితే, స్కోర్ 0.267 చాలా తక్కువగా ఉంది. మొదటి స్థానంలో ఐస్​లాండ్​ (0.874), 9వ స్థానంలో బంగ్లాదేశ్​ (0.546) ఉన్నాయి.

బిల్లుపై విమర్శలు 

డీలిమిటేషన్ చేపట్టిన తర్వాత మాత్రమే రిజర్వేషన్ అమలులోకి వస్తుంది. తదుపరి జనాభా లెక్కలకు సంబంధిత గణాంకాలు ప్రచురించిన తర్వాత మాత్రమే డీలిమిటేషన్​ చేపడుతారు. తదుపరి జనాభా గణన తేదీని పూర్తిగా నిర్ణయించలేదు. 

లోక్​సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలు 33 శాతం సీట్లను రిజర్వు చేసిన మహిళా రిజర్వేషన్ బిల్లులో ఓబీసీల నుంచి మహిళలకు కోటా లేదు. గీతా ముఖర్జీ కమిటీ (1996) మహిళా రిజర్వేషన్లను ఓబీసీలకు పొడిగించాలని సిఫారసు చేసింది. 

జాతీయ గణన చేయకుండా ఫలితం పెద్దగా ఉండదు.
చట్టం సమర్థ అమలుకు వెంటనే కులగణన చేపట్టాలి. 

మంత్రివర్గాల్లో 33 శాతం కోటా కేటాయించకుండా మహిళా సాధికారితకు దారి తీయదు.
ఇది అగ్రవర్ణ మహిళలకే ప్రయోజనకరంగా ఉంటుంది. ఓబీసీ, ముస్లిం మహిళలకు ప్రాతినిధ్యం కల్పించలేదు.

రాజ్యసభ, విధాన పరిషత్​ల్లో మహిళా రిజర్వేషన్​ను ప్రస్తావించలేదు. 
    
ప్రతి ఎన్నికకు లేదా రెండు ఎన్నికలకొకసారి రొటేషన్​ పద్ధతిలో రిజర్వేషన్​ కల్పించడం వల్ల కీలుబొమ్మ మహిళా నాయకులు తయారవుతారు. తమ అధికారాన్ని కోల్పోవడాన్ని శాయశక్తులా వ్యతిరేకించే బలమైన పురుష నాయకులకు బదులుగా తమ కుటుంబంలోని మహిళా సభ్యులను నామినేట్​ చేసి నిజమైన అధికారాన్ని మాత్రం తామే చలాయిస్తారు. 

మహిళలకు సీట్లను రిజర్వు చేయడం రాజ్యాంగ సమానత్వ హామీని ఉల్లంఘించడమేనని విమర్శలు ఉన్నాయి. రిజర్వ్​ ఉంటే మహిళలు మెరిట్​పై పోటీ పడరని ఇది సమాజంలో వారి స్థాయిని తగ్గించవచ్చు.