చిన్నప్పటినుంచే జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొంది. పట్టుదలతో కష్టపడి ఎదిగింది. తనలా ఎవరూ ఇబ్బందులు పడకూడదని తనవంతు సాయం అందిస్తోంది పావని. ప్రతినెలా తన జీతంలో సగం డబ్బుని సేవా కార్యక్రమాలకు ఖర్చు చేస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది.
పావని చదువుకునే రోజుల్లోనే కుటుంబ సమస్యలు, తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఆమె జీవితాన్ని చుట్టుముట్టాయి. ఎన్నోసార్లు పస్తులతో ఉండాల్సి వచ్చింది. అయినప్పటికీ ఆ పరిస్థితులను ఎదుర్కొని, ధైర్యంగా నిలబడి తన చదువు కొనసాగించింది. ఓ వైపు తాను చదువుకుంటూనే మరో వైపు చిన్న పిల్లలకు ట్యూషన్లు చెప్తూ కొంత డబ్బు సంపాదించేది. ఆ తర్వాత పార్ట్‌టైమ్ ప్రైవేట్ జాబ్ చేస్తూ ఎం. ఫార్మసీ పూర్తిచేసింది.
ఉద్యోగం వచ్చిన తర్వాత కొంతమంది ఆకలినైనా తీర్చాలని భావించింది. అందుకే సమాజసేవ చేయడం మొదలుపెట్టింది. ప్రస్తుతం ప్రైవేట్ ఉద్యోగం చేస్తూనే తనకు వచ్చే జీతంలో సగభాగాన్ని సేవా కార్యక్రమాల కోసం ఉపయోగిస్తోంది. దాంతో పేదలకు అవసరమైన తిండి, బట్టలు, మెడిసిన్స్ అందిస్తోంది. “ప్రతి అమ్మాయి ధైర్యంగా ఉండాలి. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా భయపడకుండా ధైర్యంగా ఎదుర్కొని పోరాడాలి. కుటుంబంతో కలసి ముందుకు సాగాలి” అంటోంది పావని.
-అంతర్జాతీయ మహిళా దినోత్సవం, ప్రత్యేక కథనం–
