
మేడ్చల్ కలెక్టరేట్, వెలుగు: మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తుండడం అభినందనీయమని అడిషనల్కలెక్టర్ రాధికా గుప్తా అన్నారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని, ఆర్థికంగా ఎదగాలని సూచించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వి–హబ్, డీఆర్డీఏ ఆధ్వర్యంలో జిల్లాలోని స్వయం సహాయక సంఘాల మహిళలు, మహిళా పారిశ్రామికవేత్తలకు ర్యాంప్ ప్రోగ్రాంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలన్న సంకల్పంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధిక మొత్తంలో రుణాలు ఇస్తున్నాయని తెలిపారు. మహిళలు అనేక వ్యాపారాలు చేయడం, లాభాలను ఆర్జించడం సంతోషంగా ఉందన్నారు. రుణాలు పొందడంలో, మార్కెటింగ్ లో ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని చెప్పారు.
ఎంపికైన మహిళా వ్యాపారులకు బిజినెస్ నైపుణ్యాలపై శిక్షణ, ప్రొడక్ట్ డెవలప్మెంట్, మార్కెటింగ్ పై అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు. డీఆర్డీవో సాంబశివరావు, పీడీ మెప్మా విజయలక్ష్మి, వి–హబ్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ సాయిరాం, స్వయం సహాయక సంఘాల జిల్లా అధ్యక్షురాలు జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.