కాంగ్రెస్​కు మహిళల ‘గ్యారంటీ’!

కాంగ్రెస్​కు మహిళల ‘గ్యారంటీ’!
  • ఉచిత బస్సు, ఫ్రీ కరెంట్, 500కు సిలిండర్, డ్వాక్రా రుణాల వడ్డీ మాఫీ కలిసొస్తాయని పార్టీ ఆశలు
  • ఆయా స్కీంల కింద 1.50 కోట్ల మంది లబ్ధిదారులు 
  • మహిళల్లో ఎక్కువ మంది కాంగ్రెస్ వైపే ఉంటారని అంచనా
  • ప్రచారంలో పొలిటికల్ కామెంట్లతో పాటు గ్యారంటీలపైనా ఫోకస్​

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో వంద రోజుల పాలనలో అమలు చేసిన గ్యారంటీలు పొందిన లబ్ధిదారులు తమకు ఓటుబ్యాంకుగా మారుతారని కాంగ్రెస్ ధీమాతో ఉన్నది. ఇందులో ప్రధానంగా మహిళా ఓటు బ్యాంకు ఎక్కువ మొత్తంలో తమ​ వైపు మొగ్గుచూపే చాన్స్ ఉందని భావిస్తోంది. రాష్ట్రంలో కోటికి పైగా కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వంలో వివిధ రకాలుగా గ్యారంటీల రూపంలో లబ్ధి జరిగింది. ఇందులో గృహజ్యోతి కింద ఫ్రీ కరెంట్, మహాలక్ష్మి కింద ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్య శ్రీ, డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు, రూ.500కే గ్యాస్ సిలిండర్ వంటివి ఉన్నాయి. 

ఇందులో ఉచిత బస్సు ప్రయాణం మినహా మిగతావన్నీ కుటుంబం యూనిట్​గా లబ్ధి జరుగుతోంది. దీంతో ఆ కుటుంబాలన్నీ కాంగ్రెస్ అభ్యర్థులకు పట్టం కడతాయని ఆశిస్తున్నారు. ముఖ్యంగా మహిళలకు అందుతున్న గ్యారంటీ స్కీంలతో వారి ఓట్లు కాంగ్రెస్ పార్టీకి ఇంకింత అసెట్ అవుతాయని భావిస్తున్నారు. అందులో భాగంగానే ప్రచారంలో ప్రత్యర్థులపై పొలిటికల్ కామెంట్లతో పాటు గ్యారంటీలను ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. మూడున్నర నెలల పాలన రెఫరెండంగానే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి సిద్ధమైనట్లు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇదివరకే ప్రకటించారు.   

ఆ మూడు గ్యారంటీలు కుటుంబాలకే 

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత తీసుకువచ్చిన గ్యారంటీలలో మూడింటితో నేరుగా కుటుంబాలకే లబ్ధి జరుగుతోంది. ఇందులో గృహజ్యోతి స్కీం, రూ.500కే సిలిండర్, రాజీవ్ ఆరోగ్యశ్రీ ఉన్నాయి. గృహజ్యోతి కింద 200 యూనిట్లలోపు జీరో కరెంట్ బిల్లులు అందిస్తున్నారు. దీనికింద రాష్ట్రంలో దాదాపు 42 లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి. ఎన్నికల కోడ్ తరువాత మరిన్ని కుటుంబాలకు ఈ స్కీం వర్తించనుంది. దీనితో గ్రామాల్లో, పట్టణాల్లో పేద కుటుంబాలు మేలు జరుగుతోంది.

ప్రతినెలా కరెంట్ బిల్లులు చెల్లించాల్సిన భారం తప్పిందని అనుకుంటున్నారు. అదే సమయంలో రూ.500కు గ్యాస్​సిలిండర్ కూడా 40 లక్షల కుటుంబాలకు లబ్ధి జరుగుతోంది. ఈ లబ్ధిదారుల సంఖ్య కూడా మరింత పెరగనుంది. రాజీవ్ ఆరోగ్యశ్రీ 91 లక్షల కుటుంబాలకు వర్తింపజేశారు. ఈ మూడింటి నుంచి యావరేజ్ గా కోటి కుటుంబాలకు నేరుగా లబ్ధి జరుగుతోంది.  

మహిళా ఓటు బ్యాంకు కాంగ్రెస్ వైపే..  

ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే మహిళలకు ఉచి త బస్సు ప్రయాణం ప్రారంభించారు. ఈ గ్యారంటీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటివరకు ఆర్టీసీ దా దాపు 40 కోట్ల జీరో టికెట్లు ఇచ్చింది. అంటే రాష్ట్రంలోని మహిళలు అన్ని సార్లు ప్రయాణం చేశారు. కొం తమంది రెగ్యులర్ గా వెళ్లే ప్రయాణికులు ఉండగా.. అవసరాల మేరకు వివిధ ప్రాంతాలకు వెళ్లే మహిళలు కూడా ఉంటున్నారు. ఇక డ్వాక్రా సంఘాల విషయంలో నూ కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. 63 లక్షల మంది సభ్యులతో ఉన్న మహిళా సంఘాలకు ఒక్కో గ్రామ సమాఖ్య పరిధిలోని సంఘాలకు రూ.కోటి రుణం ఇవ్వాలని నిర్ణయించింది.

స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులెవరైనా సరే..  ప్రమాదవశాత్తూ లేదా సహజంగా మరణిస్తే గ్రూప్ నుంచి ఆమె తీసుకున్న రుణం మాఫీ చేసేందుకు ప్రత్యేక రుణ బీమా పథకం అమలు చేస్తున్నారు.  ఇప్పటికే ఆ పార్టీ చేయించిన ఇంటర్నల్ సర్వేల్లోనూ గ్యారంటీల అమలుతో మహిళలవైపు నుంచి పాజిటివ్ టాక్ వచ్చిందని తెలిసింది. 

ప్రచారంలోనూ గ్యారంటీల హోరు

లోక్​సభ ఎన్నికల ప్రచారంలోనూ గ్యారంటీల అమలుపై విస్తృతంగా క్యాంపెయినింగ్ చేస్తున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రాంతాల్లో హోర్డింగ్స్, మెట్రో పిల్లర్లపై ప్రకటనలు వేయించారు. ఇక ప్రచారంలో అభ్యర్థులతో పాటు సీఎం, మంత్రులు గ్యారంటీలను ప్రస్తావిస్తున్నారు. పొలిటికల్ కామెంట్లు ఊపు తెచ్చినా.. గ్యారంటీలతో ఆలోచింపజేస్తామని అంటున్నారు. గ్రామాల్లో గ్యారంటీలపై చర్చలు జరిగేలా చూడాలని రేవంత్ రెడ్డి క్యాడర్​కు ఇప్పటికే స్పష్టం చేశారు.