
- చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం చాలా తక్కువ
బెంగళూరు: కర్నాటక చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పరిమితంగానే ఉంది. 1978 నుంచి 2018 వరకు 40 ఏండ్లలో కేవలం 62 మంది మహిళలు మాత్రమే ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఇన్నేండ్లలో ఎన్నికల బరిలో నిలిచిన మొత్తం మహిళా అభ్యర్థులలో కేవలం ఆరు శాతం మాత్రమే చట్టసభకు వెళ్లారు. 1989లో అత్యధికంగా 10 మంది మహిళలు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. 1983లో అతి తక్కువగా ఒక్కరే గెలిచారు. 1978లో కర్నాటకలో మొత్తం ఓటర్లు 1.79 కోట్లు కాగా.. అందులో 88.08 లక్షల మంది (49.17%) మహిళలు. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో మహిళల పోలింగ్ శాతం 68 గా నమోదైంది. పురుషుల ఓటింగ్ 76 శాతం నమోదైంది. 2018లో మొత్తం 5.05 కోట్ల మంది ఓటర్లలో మహిళల సంఖ్య 2.49 కోట్లు (49.31%). అయితే గత ఎన్నికల్లో మహిళల పోలింగ్ 72 శాతానికి పెరిగింది.
ఈసారి ప్రధాన పార్టీలలో మహిళా అభ్యర్థులు తక్కువే!
మొత్తం 224 శాసనసభ స్థానాలకు 2,429 మంది పురుష అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. మహిళలు కేవలం 185 మంది బరిలో ఉన్నా రు. కనీసం ఒక్కో స్థానానికి ఒక్క మహిళ కూడా పోటీలో లేరు. ప్రధాన రాజకీయ పార్టీలైన -బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ టికెట్ల కేటాయింపులో మహిళలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. జేడీఎస్ 13 మంది మహిళలకు టికెట్లు ఇవ్వగా.. బీజేపీ 12 మందిని బరిలోకి దించింది. కాంగ్రెస్11 మంది మహిళా అభ్యర్థులకు అవకాశం ఇచ్చింది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మొత్తం 208 మంది అభ్యర్థులను ప్రకటించగా అందులో 17 మంది మహిళలు ఉన్నారు. 64 మంది మహిళా అభ్యర్థులు స్వతంత్రంగా పోటీ చేస్తున్నారు.