హనుమకొండ జిల్లాలో గోల చేయొద్దన్నందుకు యువకుల దాడి

హనుమకొండ జిల్లాలో గోల చేయొద్దన్నందుకు యువకుల దాడి
  • హనుమకొండ జిల్లాలో జాతీయ రహదారిపై బైఠాయించి మహిళల ధర్నా 

శాయంపేట, వెలుగు: రౌడీయిజం చేస్తున్న యువకుల నుంచి రక్షణ కల్పించాలంటూ గ్రామస్తులు, మహిళలు ధర్నాకు దిగారు. ఈ ఘటన హనుమకొండ జిల్లా శాయంపేట మండలం మాందారి పేట వద్ద జాతీయ రహదారిపై జరిగింది. బాధితులు తెలిపిన ప్రకారం.. గ్రామంలో ఆదివారం రాత్రి బర్త్​డే పార్టీ పేరుతో గోల చేస్తున్న యువకులను గ్రామస్తులు ప్రశ్నించారు. దీంతో ఓ ఇంటిపై దాడి చేయడమే కాకుండా నలుగురిపై ఇటుకలు, రాళ్లతో దాడికి దిగారు. 

 ఆపై పక్కనే పార్కింగ్ చేసిన వాహనాలపై కూడా ధ్వంసం చేశారని, గ్రామానికి చెందిన మౌనిక, భాస్కర్, సాంబయ్య, రాజ్ కుమార్, మత్స్య కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షుడు నిమ్మల విజేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. మౌనిక.. ఏడునెలల గర్భిణి అని కూడా చూడకుండా ఆమెపై దాడికి యత్నించడమే కాకుండా, అక్కడ ఉన్న వారందరిని తిడుతూ ఇటుకలతో దాడి చేసినట్టు వాపోయారు. పోలీసులకు వచ్చేలోపే యువకులు పరారైనట్లు చెప్పారు.  సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ పరమేశ్వర్  ఫోన్ లో మాట్లాడి నిందితులను పట్టుకుంటామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. 

దాడి చేసిన వారిపై కేసు 

మాందారిపేటలో దాడి చేసిన అదే గ్రామానికి చెందిన కొమ్ముల విష్ణు, కొమ్ముల మల్లికార్జున్‌‌, కొమ్ముల సుమంత్‌‌,  కొమ్ముల దిలీప్‌‌,  కొమ్ముల సందీప్‌‌,  కొమ్ముల నిఖిల్‌పై  సోమవారం రాత్రి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ పరమేశ్వర్‌‌ తెలిపారు.‌