
భారత మహిళలకు ఉద్యోగాల లభ్యతతో పాటు వారు పనిచేయటానికి ఇష్టపడుతున్న ప్రదేశాల ప్రాధాన్యతల్లో కొత్త ధోరణులను ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2025 వెల్లడించింది. ప్రపంచ విద్య, ట్యాలెంట్ సొల్యూషన్స్ సంస్థ వీవ్‌బాక్స్ ఈ నివేదికను విడుదల చేసింది. లింగ వైవిధ్యానికి ప్రాధాన్యత పెరుగుతున్న నేపథ్యంలో.. మహిళలు ఏ ప్రాంతాల్లో ఎక్కువగా కెరీర్ అవకాశాలను కోరుకుంటున్నారన్న విషయాలు నివేదికలో స్పష్టంగా ప్రచురితమయ్యాయి.
గత 7 ఏళ్లలో మహిళల ఎంప్లాయబులిటీ భారీ హెచ్చుతగ్గులను చూసింది. 2019లో 45.6 శాతం మహిళలు ఉద్యోగానికి తగినవారుగా గుర్తించబడ్డారు. ఆ తర్వాత 2020లో ఈ సంఖ్య 47 శాతానికి పెరగగా.. 2021లో అనూహ్యంగా తగ్గి 41.25 శాతానికి పడిపోయింది. తరువాత మళ్లీ పెరుగుదల నమోదై.. 2022లో 53.28%, 2023లో 52.8%, 2024లో 50.86%కి చేరుకున్నాయి. ప్రస్తుతం 2025లో స్వల్ప తగ్గుదలతో 47.53%గా ఉంది. ఈ అంకెలు పురోగతిని సూచిస్తున్నప్పటికీ మహిళల ఉపాధి అవకాశాలు పొందటంలో ఇంకా సవాళ్లు మిగిలే ఉన్నాయని సూచిస్తోంది.
దేశంలోని మహిళలు ఉద్యోగాల కోసం ఎక్కువగా ప్రాధాన్యతనిస్తున్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్, కేరళ, గుజరాత్, తమిళనాడు, మహారాష్ట్ర, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, హర్యానా ఉన్నాయని వీవ్‌బాక్స్ నివేదిక తెలిపింది. ఈ రాష్ట్రాల్లో సురక్షిత వాతావరణం, మెరుగైన మౌలిక సదుపాయాలు, వ్యాపార అవకాశాలు, కెరీర్ అభివృద్ధి వంటి అంశాలు ఉండటం మహిళలను ఆకర్షిస్తున్నట్లు వెల్లడైంది. ఈ ప్రాంతీయ ధోరణులు సామాజిక, ఆర్థిక వాస్తవాలను ప్రతిబింబిస్తున్నాయి.
పైగా తమ ఉద్యోగుల్లో మహిళల పార్టిసిపేషన్ పెంచుకోవాలనుకునే సంస్థలు సురక్షితమైన, సహాయక వాతావరణాన్ని ఏర్పరచడం ద్వారా మంచి ప్రతిభను ఆకర్షించవచ్చు. మహిళల ఎంప్రాయబులిటీ కేవలం లెక్కలు మాత్రమే కాదు.. అది విద్య, అవకాశాలు, ఆర్థిక ప్రాప్యతల ప్రతిబింబంగా ఉంటుంది. భారతదేశంలో మహిళలు కొత్త వృత్తి మార్గాలను నిర్మించుకుంటూ, దేశ ఆర్థిక భవిష్యత్తుకు ఆకారం ఇస్తున్నారని తాజా నివేదిక చెప్పకనే చెబుతోంది. కంపెనీలు కూడా ఈ విషయాలను పరిగణలోకి తీసుకుని మహిళలకు అనుకూలమైన పని వాతావరణం కల్పించటం సంస్థల ప్రగతికి తోల్పడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.