ఇందూరులో నేతల మాటల యుద్ధం

ఇందూరులో నేతల మాటల యుద్ధం
  • మంత్రి వర్సెస్‌‌‌‌ ఎంపీ
  • ఇందూరులో నేతల మాటల యుద్ధం వేడెక్కుతున్న ‌‌‌‌రాజకీయం

నిజామాబాద్, వెలుగు:  ఉమ్మడి జిల్లాలో బీజేపీ, టీఆర్ఎస్‌‌‌‌ మధ్య పొలిటికల్ వార్ రోజురోజుకూ తారా స్థాయికి చేరుకుంటోంది. ఎంపీ అర్వింద్ ఆధిపత్యాన్ని అడ్డుకునేందుకు స్వయంగా రాష్ట్ర మంత్రి ప్రశాంత్‌‌‌‌రెడ్డి బరిలోకి దిగడంతో రాజకీయం రసవత్తరంగా మారింది. తాజాగా బాల్కొండ నియోజకవర్గం బీజేపీ, టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ రగడకు వేదికగా మారింది. 

జరిగింది ఇదీ..


ఈనెల 16న వేల్పూర్ క్రాస్ రోడ్‌‌‌‌లో బీజేపీ రైతు భరోసా ధర్నాకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఎంపీకి వ్యతిరేకంగా బాల్కొండ ప్రజల పేరిట ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మరో వైపు ఎన్నికల హామీలను విస్మరించిన ఎంపీ అర్వింద్‌‌‌‌కు భరోసా ధర్నా చేసే నైతిక అర్హత లేదని రాష్ట్ర మంత్రి ప్రశాంత్‌‌‌‌రెడ్డి ఓ వీడియో ప్రకటన చేయడంతో రగడ మొదలైంది. ఇక ధర్నాలో అర్వింద్‌‌‌‌ కూడా మంత్రిపై ఫైర్‌‌‌‌‌‌‌‌ అయ్యారు. నాబార్డు నిధులతో  నిర్మించిన చెక్‌‌‌‌డ్యామ్‌‌‌‌లను మంత్రి రాష్ట్ర ప్రభుత్వం క్రెడిట్‌‌‌‌గా ప్రకటించడం సిగ్గుచేటని ఘాటుగా విమర్శించారు. ఓ మరో పక్క ధర్నా అడ్డుకునేందుకు టీఆర్ఎస్ శ్రేణులు ప్రయత్నింయడంతో బీజేపీ శ్రేణులు పరస్పర ఆరోపణలకు దిగాయి.

ఆర్వోబీ నుంచే మొదలు..

ఎంపీ అర్వింద్ పర్యటనలకు ఆటంకాలు టీ ఆర్  ఎస్ స్కెచ్‌‌‌‌గా కనిపిస్తోంది.  2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అర్వింద్ ఎంపీగా గెలుపొందారు. 30 ఏళ్ల జిల్లా వాసుల కల మాధవనగర్ నేషనల్ హైవేపై ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి 2020 అక్టోబర్‌‌‌‌‌‌‌‌లో గ్రీన్‌‌‌‌సిగ్నల్ వచ్చింది. ఫైనాన్స్ క్లియరెన్స్‌‌‌‌తో పాటు పాలన అనుమతులను కేంద్ర రైల్వే శాఖ మంజూరు చేసింది. ఆర్వోబీ మొత్తం ప్రాజెక్ట్ రూ.93.12 కోట్ల వ్యయంలో  కేంద్ర రైల్వే శాఖ  వాటా నిధులుగా రూ.30.05 కోట్లు రిలీజ్ చేసింది. రాష్ట్ర సర్కార్ వాటాగా రూ.63.07 కోట్ల నిధులను వెచ్చించాల్సి ఉంది. టీఆర్ఎస్ సర్కార్ తన వాటా కేటాయింపుల్లో జాప్యం చేయడంతో ఎంపీ అర్వింద్ వారి వైఖరిని ఎండగట్టారు. కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి పనులను టీఆర్ఎస్ సర్కారు ఆటంకాలు కలిగిస్తోందని ప్రజల్లోకి తీసుకవెళ్లారు. ఎట్టకేలకు 2021 అక్టోబర్‌‌‌‌‌‌‌‌లో ఫండ్స్‌‌‌‌ రిలీజ్‌‌‌‌ చేసిన టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ సర్కారు టెండర్ల ప్రక్రియకు మరో 9 నెలలు డీలే చేసింది. ఈ విషయంలో రాష్ట్ర మంత్రి ప్రశాంత్‌‌‌‌రెడ్డి కావాలానే ఆర్వోబీని ఆలస్యం చేస్తున్నాడని ఎంపీ ఆరోపించారు. దీంతో అప్పటి నుంచే వీరి మధ్య వార్‌‌‌‌‌‌‌‌ మొదలైంది.  

బెడిసి కొట్టిన వ్యూహాలు..

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీ అర్వింద్ జిల్లాలో ఏదైనా స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్​ ఆయనను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎంపీ నిలదీస్తుండడంతో.. ఆయనకు ఎమ్మెల్యేలు కౌంటర్ ఎటాక్ ఇస్తున్నారు. రైతుల పేరుతో నిరసనలకు దిగితే వ్యతిరేకత ఉండదని భావించిన టీఆర్ఎస్ ఇటీవల ఆర్మూర్‌‌‌‌‌‌‌‌లో ఎంపీ ఇంటి ముందు వడ్లు పోసి రైతుల నిరసనగా చిత్రీకరించేందుకు యత్నించారు. అయితే టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, సింగిల్ విండో డైరెక్టర్ ఆధ్వర్యంలో వడ్లు పోసారని బీజేపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అధికార పార్టీ నేతల వ్యూహం బెడిసి కొట్టింది. జనవరి 25న ఎంపీ కాన్వాయ్‌‌‌‌పై దాడి ఘటనతో పసుపు రైతులకు సంబంధంలేదని రైతు ఐక్యవేదిక ప్రకటించడం కూడా టీఆర్ఎస్‌‌కు పరువుపోయినంత పనైంది.