పరిహారం ఇచ్చేవరకు పనులు జరగనీయం : బస్వాపురం నిర్వాసితులు

పరిహారం ఇచ్చేవరకు పనులు జరగనీయం : బస్వాపురం నిర్వాసితులు

ఆఫీసర్లకు స్పష్టం చేసిన బస్వాపురం నిర్వాసితులు

యాదాద్రి, వెలుగు: పరిహారం ఇచ్చేవరకూ రిజర్వాయర్​ కట్ట మీద నుంచి కదలబోమని, పనులు జరగనీయబోమని జిల్లా ఆఫీసర్లకు బస్వాపురం నిర్వాసితులు స్పష్టం చేశారు. అవార్డు సవరించి మళ్లీ ప్రకటించాలని డిమాండ్​ చేశారు. యాదాద్రి జిల్లాలో నిర్మిస్తున్న బస్వాపురం రిజర్వాయర్​ కోసం సేకరించిన భూములకు పరిహారం ఇవ్వాలని కోరుతూ వారం రోజులుగా బీఎన్​ తిమ్మాపురం గ్రామస్థులు రిజర్వాయర్​ పనులను అడ్డుకుని కట్టపై ఆందోళన చేస్తున్నారు. మంగళవారం సీఎం కేసీఆర్​ దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. దీంతో అడిషనల్​ కలెక్టర్​శ్రీనివాసరెడ్డి, భువనగిరి ఆర్డీవో భూపాల్​రెడ్డి, ఇరిగేషన్​ ఆఫీసర్లు బుధవారం రిజర్వాయర్​వద్దకు చేరుకొని నిర్వాసితులతో చర్చలు జరిపారు. సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని, ఆందోళన ఆపేయాలని కోరారు. అవార్డు ప్రకటించి మూడేండ్లు గడిచినా పరిహారం ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టారని, ఈ కారణంగా తాము ఎంతో నష్టపోయామని నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడేండ్ల కింద ఎకరానికి రూ. 15 లక్షలు ఇస్తామన్నారని, ఇప్పుడూ  అంతే అంటే ఎలాగని ప్రశ్నించారు. అవార్డును సవరించడంతో పాటు వెంటనే పరిహారం ఇస్తేనే ఆందోళన విరమిస్తామని నిర్వాసితులు స్పష్టం చేశారు. దీంతో చేసేదేం లేక ఆఫీసర్లు వెనుదిరిగారు. 

ఎమ్మెల్యే శేఖర్​రెడ్డికి హైకమాండ్​ క్లాస్

భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్​రెడ్డికి హైకమాండ్​క్లాస్​ పీకినట్టు తెలిసింది. సీఎం కేసీఆర్​ దిష్టిబొమ్మ దహనం చేయడం, ఆ ఘటనలో టీఆర్ఎస్​లీడర్లు సైతం పాల్గొన్నారని తెలియడంతో హైకమాండ్ ​సీరియస్​గా స్పందించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో ఎమ్మెల్యే కలెక్టరేట్​కు వెళ్లి కలెక్టర్​ పమేలా సత్పతిని కలిసి సమస్య పరిష్కరించాలని, ఆందోళన విరమించేలా చూడాలని కోరారు. నిర్వాసితులతో చర్చలు జరపాలని కలెక్టర్​ఆదేశించడంతో అడిషనల్​కలెక్టర్, ఆర్డీవో, ఇరిగేషన్​ డిపార్ట్​మెంట్​ఆఫీసర్లు రిజర్వాయర్​ వద్దకు వెళ్లారు.  

గుడాటిపల్లి నిర్వాసితుల నిరసన

కోహెడ/హుస్నాబాద్: నిర్వాసితులకు పరిహారం చెల్లించాకే పనులు చేయాలని నిర్వాసితులు డిమాండ్​ చేశారు. బుధవారం సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గుడాటిపల్లి ప్రాజెక్టు వద్ద నిర్వాసితులు నిరసన తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన యువతకు రూ. 8 లక్షల ప్రత్యేక ప్యాకేజీ తక్షణం చెల్లించాలన్నారు. డబుల్ బెడ్ రూం ఇండ్ల పథకం కింద ఒక్కో కుటుంబానికి రూ. 5.4 లక్షలు ఇవ్వాలన్నారు. పరిహారం ఇచ్చేంతవరకు పనులు జరగనివ్వబోమని తేల్చి చెప్పారు. పరిహారం వన్​ టైం సెటిల్మెంట్ లో పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.