
వెలుగు, నెట్వర్క్ : రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పనుల జాతర కార్యక్రమం శుక్రవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పండుగ వాతావరణంలో ప్రారంభమైంది. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ, గంగారం మండలాల్లో పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. గంగారంలో 814 మందికి కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేశారు. వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు.
ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లిలో కలెక్టర్ దివాకర అడిషనల్ కలెక్టర్ సంపత్‌రావు, జయశంకర్భూపాలపల్లి జిల్లా చిట్యాల, టేకుమట్ల మండలాల్లో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ కలెక్టర్ రాహుల్‌శర్మతో కలిసి అభివృద్ధి పనులను ప్రారంభించారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం దివిటిపల్లి, కడారిగూడెం గ్రామాల్లో ఎమ్మెల్యే నాగరాజు, కలెక్టర్ సత్యశారద, గీసుగొండ మండలం గట్టకిందిపల్లి, రాంపురం, మరియపురం, సంగెం మండలం ఎల్లూరి రంగంపేట, ముమ్మడివరం, కాట్రపల్లి తదితర గ్రామాల్లో ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కలెక్టర్ సత్యశారద అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. జనగామ జిల్లా శామీర్‌పేటలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్‌యాదవ్, ఎంపీడీవో సంపత్‌కుమార్, తో కలిసి అభివృద్ధి పనులు ప్రారంభించారు.
అదేవిధంగా శివరాజ్‌యాదవ్ బొమ్మకూరు రిజర్వాయర్ ద్వారా జనగామ మండలంలోని చెరువులన్నింటికీ కాల్వల ద్వారా నీటిని విడుదల చేశారు. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలో ఎంపీడీవో రాజు, ఏపీవో రాజు పనుల జాతర కార్యక్రమాన్ని మొదలు పెట్టారు.