నేతన్నలు ఓనర్లు కాలే.. వర్కర్​ టూ ఓనర్​ పథకం పనులు ఎక్కడివక్కడే 

నేతన్నలు ఓనర్లు కాలే.. వర్కర్​ టూ ఓనర్​ పథకం పనులు ఎక్కడివక్కడే 
  •      2017లో 88 ఎకరాల్లో వీవింగ్ పార్క్ నిర్మాణానికి శంకుస్థాపన 
  •      ఏడేండ్లుగా షెడ్ల నిర్మాణం వద్దే పనులు 
  •      కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై నేతన్నల ఆశలు 

రాజన్నసిరిసిల్ల , వెలుగు: సిరిసిల్ల నేత కార్మికులను ఓనర్లుగా మార్చేందుకు బీఆర్ఎస్​ సర్కార్‌‌‌‌ తీసుకొచ్చిన వర్కర్‌‌‌‌ టూ ఓనర్​పథకం బాలారిష్టాలు దాటడం లేదు.  ఈ పథకం కోసం నాటి సర్కార్​ జిల్లా కేంద్రం సిరిసిల్లలో 88 ఎకరాల్లో వీవింగ్​పార్క్​ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఏడేండ్లుగా పనులు షెడ్లను దాటలేదు. నేతన్నలను ఓనర్లను చేసి వారి రుణం తీర్చుకుంటానని మాటిచ్చిన నాటి మంత్రి కేటీఆర్​ఇప్పటిదాకా పనులు పూర్తిచేయలేదు. దీంతో నేతన్నలు కాంగ్రెస్​ సర్కార్‌‌‌‌పై ఆశలు పెట్టుకున్నారు. 

రూ.220కోట్లతో పనులు

సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూర్ శివారులో రూ.220 కోట్లతో 88 ఎకరాల్లో వీవింగ్ పార్క్ నిర్మాణానికి 2017 అక్టోబర్ 11న  మాజీ సీఎం కేసీఆర్​శంకుస్థాపన చేశారు. రాష్ట్ర పరిశ్రమలు, మౌలిక వసతుల కల్పన సంస్థ(టీఎస్ఐఐసీ) పార్క్​ నిర్మాణం చేపట్టింది. అప్పటినుంచి పనులు నత్తను తలపిస్తున్నాయి. వీవింగ్ పార్క్‌‌లో ఇప్పటివరకు షెడ్ల నిర్మాణం పూర్తి చేశారు.

ఇంకా ఇంటీరియల్ వర్క్  ప్రారంభించలేదు. ఆటోమెటిక్ మగ్గాలను బిగించేందుకు ఆర్డర్లు ఇవ్వలేదు. ఏడేండ్లగా పనులు స్లోగా జరుగుతున్నా ఎమ్మెల్యే కేటీఆర్ ఏనాడూ కాంట్రాక్టర్లను పిలిచి మాట్లాడింది లేదు.. రివ్యూ చేసింది లేదు. దీంతో  వీవింగ్ పార్క్​ పనులు షెడ్ల నిర్మాణం  పనులు వద్దే ఆగిపోయాయి.

10శాతం  చెల్లిస్తే వర్కర్‌‌‌‌ ఓనర్​ అయ్యేవాడు

వర్కర్ టూ ఓనర్ పథకంలో భాగంగా ఒక్క యూనిట్​కింద రూ.8లక్షలు విలువ చేసే నాలుగు ​లూమ్స్ అప్పగిస్తారు. ఈ మొత్తంలో 50శాతం సర్కార్​ సబ్సిడీ ఇస్తుంది. 40శాతం బ్యాంకులు లోన్లు ఇస్తాయి. నేతన్నలు 10 శాతం చెల్లిస్తే  ఓనర్ అయ్యేలా ప్రణాళికలు రెడీ చేశారు. ఒక షెడ్డులో ఏర్పాటు చేసే యూనిట్‌‌లో 8 మంది కార్మికులు పనిచేసే అవకాశముంటుంది. ప్రస్తుతం సిరిసిల్లలో 30వేల మగ్గాలుండగా వీటిపై 6 వేల మంది కార్మికులు పని చేస్తున్నారు. వీరికి అనుబంధంగా డైయింగ్, కండెలు చుట్టడం.. ఇతరత్రా కలిపి సుమారు 10 వేల మంది వరకు ఉంటారు. వర్కర్ టూ ఓనర్ పథకం పూర్తయితే వీరంతా ఓనర్లుగా మారే అవకాశం ఉండేది. 

కొత్త సర్కార్‌‌‌‌పైనే ఆశలు

గత బీఆర్ఎస్​సర్కార్​ నిర్లక్ష్యంతో వీవింగ్​ పార్క్​ పనులు స్లోగా సాగుతున్నాయి. ఇప్పటికే సిరిసిల్లలో ఉత్పత్తయిన బతుకమ్మ చీరల బకాయిలు చెల్లించలేదు. బకాయిలు ఇప్పించి, కొత్త ఆర్డర్లు ఇస్తామని ఇటీవల జిల్లా ఇన్‌‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. త్వరలోనే వర్కర్ టూ ఓనర్ పథకం పై సమీక్ష చేయనున్నట్లు చేనేత జౌళిశాఖ అధికారులు చెబుతున్నారు. కొత్త సర్కారైనా పార్క్​నిర్మాణ పనులు కంప్లీట్​చేసి తమను ఓనర్లను చేస్తుందన్న ఆశలో నేత కార్మికులు ఉన్నారు. 

ALSO READ : నాలుగు నెలలుగా జీతాల్లేవ్.. ఇబ్బంది పడుతున్న 104  సిబ్బంది

ఏడేండ్లుగా ఎదురుచూస్తున్నా

సిరిసిల్ల నేత కార్మికులం చాలా ఏండ్లుగా వస్త్ర పరిశ్రమలో పనిచేస్తున్నాం. బతుకమ్మ చీరలతో యజమానులే బాగుపడ్డారు. కార్మికులుగా మేం కూలీ మాత్రమే పొందాం. కానీ కార్మికులకు లాభమయ్యేలా వర్కర్ టూ ఓనర్ పథకం గత సర్కార్ తీసుకొస్తోందని తెలిసి సంతోషపడ్డాం. ఓనర్లుగా మారితే మా జీవితాలు మారుతాయని ఆశపడ్డాం. కానీ ఏడేండ్లుగా ఈ పథకం పూర్తికి ఏడేండ్లుగా ఎదురుచూస్తున్నాం. కొత్త సర్కార్ ఈ పథకాన్ని కంప్లీట్ చేస్తే కార్మికులకు లాభం జరుగుతది.
- చింతకింది మధు, నేత కార్మికుడు