పైసలు తీస్కొని పనిలోంచి తీసేసిండు : వర్కర్లు

పైసలు తీస్కొని పనిలోంచి తీసేసిండు : వర్కర్లు
  • కలెక్టరేట్​ ఔట్​సోర్సింగ్​ కాంట్రాక్టర్​పై వర్కర్ల ఫిర్యాదు 
  • రూ.50వేల చొప్పున ఇచ్చినం.. ఇంకా రూ.30వేలు అడుగుతుండు 
  • నాలుగు నెలలుగా జీతాలు ఇయ్యట్లేదని ఆవేదన 

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల కలెక్టరేట్​లో ఔట్​సోర్సింగ్​ కాంట్రాక్టర్​ గుర్రం శ్రీనివాస్​రావు తమ దగ్గర పైసలు తీసుకుని పనిలోంచి తొలగించాడని, నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వకుండా వేధిస్తున్నాడని వర్కర్లు ఆరోపించారు. గార్డెనింగ్​ వర్కర్లు మేరుగు స్వప్న, సురిమిల్ల వర్ణ, మగ్గిడి రజిత, కుంట సౌజన్య, ముక్కె లావణ్య, ఆరె రాజతిరుమల తమకు న్యాయం చేయాలని కోరుతూ సోమవారం జరిగిన గ్రీవెన్స్‌‌‌‌‌‌‌‌లో  కాంట్రాక్టర్​పై ఫిర్యాదు చేశారు.  తాము చాలా రోజుల నుంచి కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌లో  గార్డెనింగ్​ పనులు చేస్తున్నామని తెలిపారు.  

ఔట్​సోర్సింగ్​ టెండర్​​దక్కించుకున్న గుర్రం శ్రీనివాస్ రావు ఆరుగురి దగ్గర రూ.50 వేల చొప్పున తీసుకొని పనిలో  పెట్టుకున్నాడని అన్నారు.  నెలకు రూ.15 వేల జీతం ఇస్తానని,  పీఎఫ్​, ఈఎస్​ఐ ఉంటుందని చెప్పాడన్నారు.  నాలుగు నెలలు గడిచినా జీతాలు ఇవ్వలేదని, జీతాలు రావాలంటే మరో రూ.30వేల చొప్పున ఇవ్వాలని డిమాండ్​ చేశాడని ఆరోపించారు.

తాను టెండర్​ కోసం కలెక్టరేట్​లో ఆఫీసర్లకు పైసలు ఇచ్చానని, ఇక్కడ అందరూ తనవాళ్లేనని, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండని బెదిరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఈ నెల 6న కలెక్టర్​కు ఫిర్యాదు చేయడంతో రెండు రోజులు పనిలోకి తీసుకొని మళ్లీ తొలగించాడన్నారు. కలెక్టర్​ స్పందించి తమకు న్యాయం చేయాలని వారు కోరారు.