
- రెండోసారి అదృష్టాన్ని పరీక్షించుకోనున్న ఎమ్మెల్యే ముఠాగోపాల్
- ఎంపీగా చేసిన అభివృద్ధే గెలిపిస్తుందనే ధీమాలో కాంగ్రెస్ అభ్యర్థి అంజన్ కుమార్
- బీజేపీ జాతీయ నేత, ఎంపీ లక్ష్మణ్ ఆశీస్సులతో బరిలో నిలిచిన పూస రాజు
హైదరాబాద్, వెలుగు : సిటీ నడిబొడ్డున అతి ముఖ్యమైన అసెంబ్లీ సెగ్మెంట్ ముషీరాబాద్. జంట నగరాలను కలిపే వారధి కూడా. మధ్యతరగతి ప్రజలు అధికంగా ఉండే ప్రాంతం. కార్మికులు, మైనార్టీలు ఎక్కువగా నివసిస్తుంటారు. ఎన్నికలేవైనా వీరే ఓట్లే కీలకంగా ఉంటాయి. ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిస్తే మంత్రి పదవి ఖాయం అనే సెంటిమెంట్ కూడా ఉంది. మాజీ సీఎం టి.అంజయ్య, శ్రీపతి రాజేశ్వర్, కోదండరెడ్డి, నాయిని నర్సింహారెడ్డి వంటి నేతలు ఇక్కడ నుంచి పోటీ చేసి గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టినవారే. ప్రధాన పార్టీలు ముషీరాబాద్ సెగ్మెంట్ ప్రతిష్టాత్మకంగా భావిస్తుంటాయి.
ప్రస్తుతం బీఆర్ఎస్సిట్టింగ్ అభ్యర్థి, ఎమ్మెల్యే ముఠాగోపాల్ రెండోసారి గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. కాగా 2004, 2009లో సికింద్రాబాద్ఎంపీగా రెండుసార్లు గెలిచిన అంజన్‌కుమార్‌యాదవ్ ఈసారి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఆయన ఎంపీగా చేసినప్పుడు ఈ నియోజకవర్గం సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోనే ఉండడంతో ఆయనకు పూర్తి అవగాహన ఉందంటున్నారు. బీజేపీ జాతీయ నేత, ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రాజ్యసభ సభ్యుడు కె. లక్ష్మణ్ఆశీస్సులతో ప్రస్తుతం పూస రాజు ఆ పార్టీ తరఫున తన అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో ఉన్నారు.
వీరి ఓటర్లే కీలకం
ముషీరాబాద్‌లో అధికంగా పేద, మధ్యతరగతి కుటుంబాల వారే నివసిస్తుంటారు. దాదాపు అన్ని బీసీ కులాల వారు ఉంటారు. ముస్లిం, క్రిస్టియన్, మైనార్టీలు కూడా ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో అధికంగానే ఉన్నారు. ఇక్కడి నుంచి 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ముఠాగోపాల్ 2018 ఎన్నికల్లో మళ్లీ బరిలో నిలిచి తొలిసారి గెలిచారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా అంజన్ కుమార్ కొడుకు అనిల్‌కుమార్‌యాదవ్, బీజేపీ నుంచి పోటీ చేసిన కె. లక్ష్మణ్ ఓటమిచెందారు. నియోజక వర్గంలోని భోలక్ పూర్, బంగ్లాదేశ్, రాంనగర్, దయారా మార్కెట్, అడిక్మెట్తదితర ప్రాంతాల్లో ముస్లిం ఓటర్లు అధికంగా ఉన్నారు. అశోక్‌నగర్, ముషీరాబాద్, గోల్కొండ చౌరస్తా తదితర ప్రాంతాల్లో క్రిస్టియన్ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. అభ్యర్థి గెలుపులో వీరి ఓట్లే కీలకంగా ఉంటాయి.
ఎంపీగా చేసిన అభివృద్ధిపైనే ధీమా
కాంగ్రెస్అభ్యర్థి అంజన్ కుమార్ యాదవ్ఎంపీగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి గెలిపిస్తుందనే ధీమాతో ఉన్నారు. అంతేకాకుండా ఎంపీగా ఉన్నప్పుడు నియోజకవర్గంపై తనకు పూర్తి అవగాహన ఉందని, ఇక్కడి ప్రజల సమస్యలను తెలిసిన వాడినని చెప్పుకుంటున్నారు. తనకు గెలుపునకు వస్తే ప్రభుత్వ వ్యతిరేకత కలిసి వస్తుందంటున్నారు. ఎమ్మెల్యే ముఠాగోపాల్‌పై ఉన్న వ్యతిరేకత కూడా తనకు అనుకూలంగా మారుతుందని భావిస్తున్నారు.
కాంగ్రెస్ ఆరు గ్యారంటీ పథకాలు తనకు కలిసి వచ్చే అంశాలని కూడా ఆయన నమ్ముతున్నారు. సెగ్మెంట్లోని యాదవుల ఓట్లు తనకే పడతాయని, బీసీ కులాలు, మైనార్టీ ఓటర్లు కాంగ్రెస్ వైపు ఉండడం కూడా తనకు కలిసివస్తుందని నమ్ముతున్నారు. అయితే ఇక్కడ ఆయనపై పార్టీ స్థానిక నేతలు అసంతృప్తితో ఉన్నారు. కొందరు పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరారు. దీంతో స్థానిక నేతలు, కార్యకర్తల నుంచి ఆశించినంతగా మద్దతు లభించడం లేదు. ప్రభుత్వంపై ప్రజల్లో పెరిగిన తీవ్ర వ్యతిరేకతనే కాంగ్రెస్‌కు లాభిస్తుందని భావిస్తున్నారు.
లక్ష్మణ్ చరిష్మా పని చేస్తుందా?
గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా పని చేసిన రాజ్యసభ సభ్యుడు కె. లక్ష్మణ్ ప్రస్తుతం జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన
ఆశీస్సులతోనే పార్టీ నుంచి టికెట్దక్కించుకున్న పూస రాజు ఈసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. పూస రాజు తండ్రి పూస స్వామి గతంలో కాంగ్రెస్‌లో కీలక నేతగా కొనసాగారు. ఆయనకు ఇక్కడున్న పలుకుబడి రాజుకు అనుకూలంగా మారుతుందని భావిస్తున్నారు.
సెగ్మెంట్ లో బీజేపీకి బలమైన కేడర్ ఉండడంతో గెలుపుపై ధీమాతో ఉన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వ పథకాలు, రాష్ట్రంలోని బీఆర్ఎస్పై పెరుగుతున్న వ్యతిరేకత కలిసి వస్తుందని పూస రాజు చెబుతున్నారు. అయితే ఆయనకున్న మైనస్ పాయింట్ల చూస్తే.. నియోజక వర్గంలో గతంలో ఉన్నంతగా పార్టీకి బలం లేక పోవడం, కార్యకర్తలు పూర్తిగా సహకరించకపోతే గెలుపు పై ప్రభావం చూపించే అవకాశం ఉందని భావిస్తున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య భారీగా ఓట్లు చీలితే తనకు గెలిచే అవకాశం ఉంటుందని కూడా పూస రాజు ధీమాతో ఉన్నారు.
పథకాలపైనే బీఆర్ఎస్ ఆశలు
రెండోసారి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీలో నిలిచిన ముఠా గోపాల్.. సీఎం కేసీఆర్ ఇమేజ్, ప్రభుత్వ పథకాలే తనను గెలిపిస్తాయన్న ధీమాతో ఉన్నారు. 2 నెలలుగా ప్రచారం కొనసాగిస్తూ.. తను చేసిన అభివృద్ధి పనులతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ముఖ్యంగా పేదలకు డబుల్బెడ్రూమ్ఇండ్ల పంపిణీ, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి ప్రభుత్వ వంటి పథకాలు తన గెలుపును ఖాయం చేస్తాయని ముఠా గోపాల్ నమ్ముతున్నారు. సెగ్మెంట్లో అధికంగా ఉండే గంగపుత్రుల ఓట్లు తనకే పడతాయనే ఆశతో ఉన్నారు.
ఆయనకున్న మైనస్ చూస్తే.. పార్టీలో కార్యకర్తలు, నేతలు వ్యతిరేకంగా ఉన్నారు. పార్టీకి చెందిన పలువురు సీనియర్‌నేతలు ప్రచారంలో ఆయనకు సహకరించడం లేదు. ముఖ్య నేతలు కొందరు అసలే పాల్గొనడం లేదు. అంతేకాకుండా బీఆర్ఎస్ప్రభుత్వంపై ప్రజల్లో పెరిగిన వ్యతిరేకత కూడా ముఠా గోపాల్ గెలుపుపై ప్రభావం చూపించే అవకాశం ఉంది.