నడుస్తున్న రైళ్ల హాల్టింగ్​  ఎత్తేసిన ఆఫీసర్లు

నడుస్తున్న రైళ్ల హాల్టింగ్​  ఎత్తేసిన ఆఫీసర్లు

మందమర్రి,వెలుగు: ఉత్తర, దక్షిణ భారతదేశాన్ని కలిపే రైల్వే లైన్​మంచిర్యాల జిల్లా గోదావరి తీరం నుంచి ఆసిఫాబాద్ జిల్లా వేంపల్లి వరకు సుమారు 70 కిలోమీటర్ల వరకు ఉంది. ఈ మార్గానికి ఇరువైపులా మంచిర్యాల, ఆసిఫాబాద్​, పెద్దపల్లి  వరంగల్, పెద్దపల్లి, కరీంనగర్,  జనగామ, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు చెందిన వేలాది మంది సింగరేణి కార్మికులు, కార్మికేతర కుటుంబాలు  నివసిస్తున్నారు. వీరంతా కాజిపేట–బల్లార్షా రూట్​లో వరంగల్, హైదరాబాద్, విజయవాడ, కాజిపేటకు రాకపోకలు సాగిస్తున్నారు.  సింగరేణి ఎంప్లాయీస్ కొత్తగూడెంలోని కార్పొరేట్​ఆఫీస్, మొయిన్  ఏరియా హాస్పిటల్​కు వెళ్తుంటారు. సింగరేణి, రామగిరి, అజ్నీ(నాగ్​పూర్​ ప్యాసింజర్​), పుష్​పుల్, భాగ్యనగర్ ఎక్స్​ప్రెస్​, ఇంటర్​సిటీ, కాగజ్​నగర్ ఎక్స్​ప్రెస్  రైళ్ల ద్వారా రాకపోకలు సాగించారు. ప్రతీ రోజు మంచిర్యాల నుంచి 3,500 మంది, కాగజ్​నగర్ లో 2,500, బెల్లంపల్లి, రవీంద్రఖని రైల్వే స్టేషన్ల నుంచి 1,500 నుంచి 2 వేలకు పైగా,  మందమర్రి, ఆసిఫాబాద్​లో 500 మంది ప్రయాణిస్తుంటారు. టికెట్ల ద్వారా రైల్వేశాఖకు రోజుకు  రూ.15 లక్షలకుపైగా ఆదాయం సమకూరుతుంది. ఆర్కేపీ సీహెచ్​పీ, శ్రీరాంపూర్​ సీహెచ్​పీ, ఆసిఫాబాద్​రోడ్డు  సైడింగ్​ నుంచి బొగ్గు రవాణా ద్వారా రూ.2  కోట్ల ఆదాయం, సిమెంట్, ఇతర సామగ్రి రవాణా ద్వారా మరో కోటి వస్తోంది. అయితే రైల్వేశాఖ  కొవిడ్  తర్వాత పలు రైళ్ల స్పీడ్  కెపాసిటీ పెంచింది. ఎక్స్​ప్రెస్​లుగా  మార్చి కొన్ని రైల్వే స్టేషన్లలో మాత్రమే ఆఫీసర్లు హాల్టింగ్ కల్పించారు.  మంచిర్యాల తర్వాత ఎక్కువ మంది రాకపోకలు సాగించే రవీంద్రఖని(రామకృష్ణాపూర్​)లో నాగ్​పూర్​- కాజిపేట(అజ్నీ) రైలుకు, మందమర్రి, రేచిని​రోడ్డు, ఆసిఫాబాద్ స్టేషన్లలో సింగరేణి, రామగిరి, నాగ్​పూర్​- కాజిపేట(అజ్నీ) రైళ్లకు హాల్టింగ్​తొలగించారు. దీంతో కార్మికులు, ఉద్యోగులు, వ్యాపారస్తులు, స్టూడెంట్స్  ఇబ్బంది పడుతున్నారు.

ఎక్స్​ప్రెస్​ రైళ్లు ఆగుతలే... కొత్తవి రాలే...

మంచిర్యాల రైల్వే స్టేషన్​ నుంచి జిల్లా వాసులు వ్యాపార, ఉద్యోగ, విద్య అవసరాల కోసం వేల సంఖ్యలో ఇతర రాష్ట్రాలకు రాకపోకలు సాగించడంతో రైల్వే శాఖకు రోజుకు రూ.కోట్లలో ఆదాయం వస్తోంది. మంచిర్యాలలో కేరళ, ఏపీ ఎక్స్​ప్రెస్, హంసఫర్, పూరి- కాజిపేట, బికనేర్, సంఘమిత్ర సూపర్​ఫాస్ట్​ రైళ్లకు,  బెల్లంపల్లి, రవీంద్రఖని, మందమర్రి, ఆసిఫాబాద్​ రైల్వే స్టేషన్లలో జనత, నవజీవన్, నాగ్​పూర్​ ఎక్స్​ప్రెస్​రైళ్లకు, కాజిపేట- నాగ్​పూర్​ అజ్నీ  రైలుకు హాల్టింగ్​ కల్పించాలని ఏళ్లుగా స్థానికులు, వ్యాపారులు కోరుతున్నారు.  మంచిర్యాల, ఆసిఫాబాద్​ జిల్లా పరిధిలోని  దక్షిణ మధ్య రైల్వే మార్గంలో 2011లో ఇంటర్ ​సిటీ ప్రారంభం కాగా, ఆ తర్వాత మళ్లీ ఒక్క కొత్త రైలు కూడా అందుబాటులోకి  రాలేదు. కాగజ్​నగర్​, బెల్లంపల్లి మీదుగా సింగరేణి సంస్థ ప్రధాన కేంద్రమైన  కొత్తగూడెం వరకు ప్రత్యేక ఎక్స్​ప్రెస్​ రైలు నడిపాలని, కాగజ్​నగర్​ -సికింద్రాబాద్, కాగజ్​నగర్​ వయా పెద్దపల్లి  మీదుగా బాసర వరకు, కాజిపేట నుంచి ఆదిలాబాద్​ వరకు వయా పెద్దపల్లి, మంచిర్యాల, కాగజ్​నగర్​, బల్లార్షా, మజ్రికాదన్ మీదుగా కొత్త రైళ్లు వేయాలని డిమాండ్ ఉంది. ఈ మార్గంలో ఉదయం 4 గంటలకు భాగ్యనగర్ ఎక్స్​ప్రెస్​ తర్వాత , పది గంటల వరకు హైదరాబాద్​ వెళ్లేందుకు  కొత్త ట్రైన్​ను ఏర్పాటు చేయాలని, సాయంత్రం 4 గంటల తర్వాత సికింద్రాబాద్​  నుంచి మంచిర్యాల, బెల్లంపల్లి, కాగజ్​నగర్​వరకు మరో రైలు వేయాలని ప్రయాణికులు డిమాండ్​ చేస్తున్నారు. కరీంనగర్​ నుంచి తిరుపతి వెళ్తున్న తిరుపతి– -షిర్డీ  రైలును వయా మంచిర్యాల మీదుగా  కాగజ్​నగర్​ వరకు పొడిగించాలని కోరుతున్నారు. బెల్లంపల్లిలో  ఫ్లాట్ ఫాంలో లిఫ్ట్​ల ఏర్పాటు, బెల్లంపల్లిలోని రైల్వే డిస్పెన్సరీలో మెరుగైన వైద్య సౌలత్​లు కల్పించాలని, రైల్వే క్వార్టర్ల నిర్మాణం, కాలనీ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్​ చేస్తున్నారు. 

తీరని సమస్యల...

మంచిర్యాలలో నిర్మించిన రైల్వే అండర్​ బ్రిడ్జి చిన్నపాటి వర్షానికే చెరువును తలపిస్తోంది. ఫ్లైఓవర్​ను కలుపుతూ మరో ఫ్లైఓవర్​ నిర్మిస్తే ట్రాఫిక్​ సమస్య తీరనుంది. రవీంద్రఖని రైల్వే స్టేషన్​లో రెస్ట్​హాల్, మందమర్రిలో  రెండోవైపు ఫ్లాట్ ఫాం నిర్మాణం, టికెట్​ రిజర్వేషన్​ సౌలత్,  బెల్లంపల్లిలో రెండో ఫ్లాంట్​ఫాం  పొడిగించాలనే డిమాండ్​ నెరవేరడంలేదు. రేచిని స్టేషన్​లో ఫుట్​ఓవర్​ బ్రిడ్జి, తాండూరు గేట్​ వద్ద అండర్ ​బ్రిడ్జి నిర్మాణం, ఐబీ వద్ద నిర్మించిన అండర్ బ్రిడ్జి అసంపూర్తిగా మారింది. క్యాతన్​పల్లి రైల్వే గేటు వద్ద ఫ్లైఓవర్​పనులు పూర్తికాలేదు. స్టేషన్లలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా టాయిలెట్స్, తాగునీటి వసతి,  దివ్యాంగులు, గర్భిణులు, చిన్న పిల్లలకు ప్రత్యేక సౌకర్యాలు లేవు. శుక్రవారం దక్షిణ మధ్య రైల్వే జనరల్​ మేనేజర్ అరుణ్​కుమార్ జైన్​కాజిపేట మార్గంలోని బల్లర్షా వరకు రైల్వే స్టేషన్లను పరిశీలించనున్నారు. సమస్యలపై స్పందించి చర్యలు తీసుకోవాలని.. ప్రజాప్రతినిధులు పట్టించుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.