గనుల్లో వేడికి కార్మికులు విలవిల

గనుల్లో వేడికి కార్మికులు విలవిల

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: ఎండలు మండిపోతుండడంతో గనుల్లో పని చేస్తున్న కార్మికులు, ఆఫీసర్లు, ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. చాలామంది కార్మికులు 50 ఏండ్లు పైబడినవారే కావడంతో వేసవి తాపాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఎండాకాలంలో గనుల్లో వేడిమిని తగ్గించడానికి, కార్మికులు పని చేసుకునేలా వాతావరణాన్ని కల్పించేందుకు యాజమాన్యం తీసుకోవాల్సిన చర్యలను పూర్తిగా వదిలేసింది.  బొగ్గు ఉత్పత్తి మీద ఫోకస్​ పెడుతున్న   యాజమాన్యం సంక్షేమాన్ని పట్టించుకోవడంలేదు.  

సౌకర్యాలు అసల్లేవు 

కోల్​బెల్ట్​లో ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతున్నాయి. వారం రోజులుగా 41 డిగ్రీల నుంచి 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది.  సర్ఫేస్​లో సెల్​ఫోన్​ద్వారా టెంపరేచర్​చూసి దాన్నే నమోదు చేస్తున్నారు.  ఓపెన్​కాస్టుల్లో, పనిప్రదేశాల్లో అంతకన్నా చాలా ఎక్కువ  ఉష్ణోగ్రతలుంటున్నాయి. అయినా మేనేజిమెంట్​ ఉపశమన చర్యలపై దృష్టి పెట్టడంలేదు. ఓపెన్​కాస్ట్​ల్లోనూ, పని చేసే చోట్ల ఏసీ సౌకర్యంతో  రెస్ట్​షెల్టర్స్​ ఏర్పాటు చేయాలని మైన్స్​సేఫ్టీ  డైరెక్టర్ జనరల్ ఆదేశాలున్నా దాన్ని పట్టించుకోవడం లేదు. ఆర్జీ2 ఏరియాలో రెండు చోట్ల మాత్రమే ఏసీ  షెల్టర్లు ఉన్నాయి. మిగతా ఓసీల్లో తడకల పందిళ్లు వేశారు. మరి కొన్నిచోట్ల  వట్టివేర్లు, గడ్డి తో షెల్టర్లను ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో  ముగ్గురు, నలుగురికంటే ఎక్కువ కూర్చునే వీలులేదు. డంపర్స్​, షవల్స్​, డోజర్స్​ వంటి భారీ వెహికల్స్​లో ఏసీ ఉన్నా ఆ కార్మికులు బయటకు వచ్చినప్పుడు రెస్ట్​ తీసుకునేందుకు ఏర్పాట్లు లేవు.  పెద్ద ఆఫీసర్లకు ఇచ్చిన వాహనాల్లో కూడా ఏసీ సౌకర్యం లేక.. ఫీల్డ్​లో తిరగడానికి ఇబ్బంది పడుతున్నారు. సర్ఫేస్​లో పని చేసే ఎలక్ట్రిషీయన్లు, సర్వే స్టాఫ్​, సెక్యూరిటీ సిబ్బంది కూడా ఎండల్లో మాడిపోతున్నారు.  ఏప్రిల్, మే నెలల్లో ఓపెన్​కాస్టు కార్మికులకు ఒక్కో మజ్జిగ ప్యాకెట్​ ఇస్తుంది. ఓఆర్​ఎస్​ ప్యాకెట్లను అందుబాటులో ఉంచుతోంది. కొత్తగూడెం ఏరియా జీకే ఓసీలో ఇస్తున్న మజ్జిగ ప్యాకెట్లు చల్లగా ఉండడంలేదని అంటున్నారు. 

ప్రతిసారి ఎండాకాలంలో వడదెబ్బ నుంచి కాపాడుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై డాక్టర్లతో కార్మికులకు అవగాహన శిబిరాలు పెట్టేది. ఈ వేసవిలో అలాంటి కార్యక్రమాల జాడలేదని అంటున్నారు. గతంలో ఉన్నట్టే ట్రిప్​ కౌంటర్ల వద్ద కూలర్లు ఏర్పాటు చేయాలంటున్నారు.  ఎండలు ఎక్కువగా ఉన్నందున షిఫ్ట్​ టైమింగ్స్​ మార్చాలని కార్మికులు, ఆఫీసర్లు కోరుతున్నారు.ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు  ఫస్ట్​ షిఫ్ట్​ ఉండాలని, మధ్యాహ్నం షిఫ్ట్​టైమింగ్​ను 3  నుంచి  4 గంటలకు మార్చాలని కార్మికులు డిమాండ్​ చేస్తున్నారు. ఓపెన్​కాస్టుల్లో మధ్యాహ్నం 12  నుంచి 3 గంటల వరకు పనులు నిలిపివేయాలని మైన్స్​ సేఫ్టీ డీజీ, కోల్​ ఇండియా ఆదేశించింది. వీటిని ఏవీ సింగరేణి యాజమాన్యం పట్టించుకోవడంలేదు. గుర్తింపు సంఘం  టీబీజీకేఎస్​తో పాటు అన్ని ట్రేడ్​ యూనియన్లు షిఫ్ట్​ టైమింగ్స్​మార్చాలని కోరినా.. బొగ్గు డిమాండ్​ నేపథ్యంలో  టైమింగ్స్​ మార్చడం కుదరదని 
యాజమాన్యం తేల్చిచెప్పింది.