ఇంకెప్పుడైతయ్?..హైదరాబాద్ సిటీలో అసంపూర్తిగా అభివృద్ధి పనులు

ఇంకెప్పుడైతయ్?..హైదరాబాద్ సిటీలో అసంపూర్తిగా అభివృద్ధి పనులు
  •     స్లోగా జంక్షన్లు, నాలాలు, రోడ్ల మరమ్మతులు 
  •      ఎస్‌‌‌‌ఆర్డీపీ పనులపై బల్దియా, జలమండలి నిర్లక్ష్యం 
  •      అసంపూర్తిగా ఉండగా స్థానికంగా ట్రాఫిక్  ప్రాబ్లమ్  
  •     వెంటనే చేస్తే ఇబ్బందులు తొలగుతయంటున్న సిటిజన్లు

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ సిటీలో బల్దియా, జలమండలి చేపట్టిన పనులు త్వరగా పూర్తి చేయడంలేదు.  అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రారంభించినవి కూడా స్లోగా నడుస్తున్నాయి. అసంపూర్తిగా నిలిపేసిన కొన్ని పనులు తిరిగి చేయడం లేదు. నాలాలు, రోడ్ల మరమ్మతులు, జంక్షన్ల అభివృద్ధి తదితర పనులు మధ్యలోనే ఆగిపోయాయి. గ్రేటర్‌‌‌‌‌‌‌‌లో అసంపూర్తిగా ఉన్న పనులతో జనానికి ఇబ్బందులు తప్పడం లేదు. నాలాలు, బాక్స్ డ్రెయిన్ల నిర్మాణాల్లో కొన్ని పూర్తయినప్పటికీ, ఇంకొన్ని నెమ్మదిగా కొనసాగిస్తున్నారు.

వీటితో  స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  రెండున్నరేళ్ల కిందట 37 ప్రాంతాల్లో బల్దియా నాలాల నిర్మాణాలు చేపట్టింది. వాటిలో 30  వరకు  పూర్తయినట్లుఅధికారులు చెబుతున్నారు. మిగతా చోట్ల ఇబ్బందులు తప్పడం లేదు.  కొన్ని నిర్మించినా కూడా ఇంకా సమస్యలు తొలగిపోలేదు.  అవసరమైన చోట బాక్స్ డ్రెయిన్ల నిర్మాణాలు చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నప్పటికీ కాంట్రాక్టర్లు పనులను మధ్యలోనే వదిలేశారు.  స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌‌‌‌మెంట్ ప్రోగ్రాం (ఎస్ఆర్డీపీ) కింద 42 పనులు చేపట్టగా ఇందులో 33 పూర్తి కాగా మిగతా పనులు కొనసాగుతున్నాయి. 

రోడ్ల పనులు జరగట్లే..

సిటీలో రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి. రోడ్లపై గుంతలు పడిన మరమ్మతులు చేయడం లేదు.  కొత్త రోడ్ల నిర్మాణాన్ని బల్దియా అసలు పట్టించుకోవడం లేదు.  గ్రేటర్‌‌‌‌‌‌‌‌లో మొత్తం  9,013  కిలోమీటర్ల మేర రోడ్లు ఉన్నాయి. ఇందులో 68.42 శాతం 6,167 కిలోమీటర్ల సీసీ రోడ్లు ఉండగా,  31.58 శాతం  2,846  కిలో మీటర్ల  బీటీ రోడ్లు ఉన్నాయి.  

అయితే ప్రతి ఏటా రోడ్ల పనుల కోసం నిధులు మంజూరు చేస్తున్న జీహెచ్ఎంసీ ఆ పనులను చేయడంలో నిర్లక్ష్యంగా ఉంటుంది. ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో రూ. 567 కోట్లతో 2,162 పనులు మంజూరు చేయగా అందులో ఇప్పటివరకు 40 శాతం పనులు కూడా పూర్తి చేయలేదు.  దీంతో సిటీలో ఎక్కడ చూసినా రోడ్లు పూర్తిగా పాడై పోయాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  

వాటర్ బోర్డు పనులు అంతంతే..

జల మండలి పనులు స్లోగా సాగుతుండగా, చిన్నవి కూడా నెలల తరబడి చేస్తున్నారు.  కొన్నిచోట్ల ఏదో ఒక కారణం చూపుతూ మధ్యలోనే నిలిపేస్తున్నారు. అవసరమైన చోట కూడా చేయడం లేదు. శివారులోని 66  డివిజన్లలో  బల్దియా సీవరేజీ బాధ్యతలను జలమండలికి అప్పగించినప్పటి నుంచి అక్కడ పనులు జరగడం లేదు.   పనులు  చేసేందుకు వాటర్ బోర్డు నెలల తరబడి టైమ్ తీసుకుంటుంది.  దీంతో పెండింగ్ పడుతుండగా.. ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతుంది.  కొన్ని రోడ్లు క్లోజ్ చేసి నెలలు అయినా పనులు చేయడం లేదు. 

నెలలుగా కొనసాగిస్తుండగా..

రాంనగర్ లోని బాకారం హరినగర్‌‌‌‌‌‌‌‌లో సీసీ రోడ్డు పనులు ఎన్నికలకు ముందు ప్రారంభించి మధ్యలో నిలిపేశారు. అసంపూర్తిగా ఉండటంతో స్థానికులకు ఇబ్బందులు తప్పడం లేదు. లంగర్ హౌస్‌‌‌‌లో నాలాల పనులు స్లోగా జరుగుతుండగా భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇవి ఎప్పుడో పూర్తి కావాల్సి ఉన్నా ఇంకా కంప్లీట్ చేయలేదు.  

లోటస్‌‌‌‌ పాండ్ వద్ద డ్రైనేజీ పనులు నేటికి పూర్తి చేయలేదు. నానల్ నగర్ లోని ఫ్లోర్ మిల్ నుంచి టోలిచౌకి వెళ్లే  షార్ట్ కట్ రోడ్డును 20 రోజులుగా మూసేసి డ్రైనేజీ పనులు చేస్తున్నారు.  ఇక్కడి నుంచి వెళ్లే వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు.  ఇలా చాలా ప్రాంతాల్లో పనులు స్లోగా జరుగుతుండగా ప్రజలకు ఇబ్బందులు తప్పడంలేదు.