ట్రాన్స్ జెండర్ల పోటీపై వరల్డ్ అథ్లెటిక్స్ కీలక నిర్ణయం

ట్రాన్స్ జెండర్ల పోటీపై వరల్డ్ అథ్లెటిక్స్ కీలక నిర్ణయం

ట్రాన్స్ జెండర్ల పోటీపై వరల్డ్ అథ్లెటిక్స్ కీలక నిర్ణయం తీసుకుంది. మహిళల ఎలైట్ పోటీల్లో ట్రాన్స్‌జెండర్లు పాల్గొనకుండా నిషేధం విధించింది. దీనిపై జరిగిన ఓటింగ్ లో డిఫరెన్సెస్ ఇన్ సెక్స్ డెవలప్ మెంట్ ఉన్న క్రీడాకారులపై కఠిన ఆంక్షలు విధించాలని వరల్డ్ అథ్లెటిక్స్ నిర్ణయించింది. మహిళా విభాగంలో పోటీ పడే క్రీడాకారుల ప్లాస్మా టెస్టోస్టెరాన్..లీటరకు 2.5 నానోమోల్స్ ఉండాలని స్పష్టం చేసింది. గతంలో ప్లాస్మా టెస్టోస్టెరాన్ లీటర్ కు 5 నానోమోల్స్గా ఉండేది. దీనిపై ఓటింగ్ నిర్వహించగా..71 శాతం మంది నిబంధనలను మార్చడానికి అనుకూలంగా ఓటేశారు. ట్రాన్స్ జెండర్లపై వరల్డ్ అథ్లెటిక్స్ నిషేధం విధించడంపై మహిళా అథ్లెట్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

అనేక క్రీడల్లో ట్రాన్స్‌జెండర్లను కూడా మహిళల విభాగంలో ఆడించడం సమంజసం కాదని.. ఈ క్రీడల్లో తమ శరీర ధారుడ్యం వల్ల ట్రాన్స్‌జెండర్లు తమపై  సులభంగా పైచేయి సాధిస్తున్నారని మహిళల ఫిర్యాదు మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు  అధ్యక్షుడు సెబాస్టియన్ కో వెల్లడించారు. స్పోర్ట్స్లో ఉమెన్స్ విభాగాన్ని కాపాడాలనే ఉద్దేశంతోనే నిషేధించినట్లు చెప్పుకొచ్చారు. అలాగే ఈ విభాగంలో ట్రాన్స్‌జెండర్లు పాల్గొనడం వల్ల వచ్చే సమస్యలపై ట్రాన్స్‌జెండర్ అథ్లెట్ నేతృత్వంలో ఒక టాస్క్ ఫోర్స్ ను కూడా ఏర్పాటు చేస్తామని అతడు తెలిపారు. 

అమెరికాతో పాటు అనేక దేశాల్లో ట్రాన్స్ జెండర్లతో పోటీ పడాల్సి రావడంపై మహిళా అథ్లెట్లు..బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎంతో కష్టపడి పోటీలకు సిద్ధమవుతామని..కానీ శారీరక ధారుడ్యం కలిగిన ట్రాన్స్ జెండర్ల చేతిలో ఓడిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది సరైన విధానం కాదని చెప్పుకొచ్చారు. 

వరల్డ్ అథ్లెటిక్స్ నిర్ణయంతో రెండుసార్లు ఒలింపిక్స్ పతకాలు సాధించిన క్యాస్టర్ సెమెన్యా, 2020 ఒలింపిక్స్ సిల్వర్ పతక విజేత క్రిస్టీన్ ఎంబోమా.., 2016 ఒలింపిక్స్‌లో రన్నరప్‌గా నిలిచిన ఫ్రాన్సైన్ నియోన్‌సాబా వంటి డీఎస్డీ అథ్లెట్స్‌పై తీవ్ర ప్రభావం చూపనుంది. అయితే వరల్డ్ అథ్లెటిక్స్ భవిష్యత్లో  ట్రాన్స్‌జెండర్ల కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది.