వారెవ్వా నీరజ్..ప్రపంచాన్ని గెలిచావు

వారెవ్వా నీరజ్..ప్రపంచాన్ని  గెలిచావు
  • వరల్డ్‌‌ అథ్లెటిక్స్‌‌లో గోల్డ్‌‌ నెగ్గిన జావెలిన్‌‌ త్రోయర్‌‌ నీరజ్‌‌ చోప్రా
  • ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్‌‌గా రికార్డు

ఒలింపిక్స్​ ట్రాక్​ అండ్​ ఫీల్డ్​ ఈవెంట్‌‌లో  గోల్డ్‌‌  ఇండియాకు కల. వందేండ్లుగా ఎవ్వరూ కనీసం దానికి దగ్గరగా కూడా వెళ్లలేదు. కానీ, అతనొచ్చాడు..  గోల్డ్‌‌ గెలిచాడు. 
వరల్డ్‌‌ అథ్లెటిక్స్‌‌ చాంపియన్‌‌షిప్స్‌‌లో బంగారు పతకం మనదేశానికి మొదటి నుంచి అందని ద్రాక్షే.కానీ, అతనొచ్చాడు.. ఏడాది కిందటే  రజతంతో కొత్త  చరిత్ర లిఖించాడు.ఏడాది తిరగకుండానే అతను మళ్లీ వచ్చాడు.. ఈ సారి ప్రపంచాన్ని గెలిచాడు..!ఇన్నాళ్లూ ఊహలకే మాత్రమే అయిన వరల్డ్‌‌ అథ్లెటిక్స్‌‌ చాంపియన్‌‌షిప్‌‌ గోల్డ్‌‌ మెడల్‌‌ను తన మెడలో వేసుకొని.. మన తిరంగాను ప్రపంచ వేదికపై సగర్వంగా రెపరెపలాడించాడు..!చరిత్ర సృష్టించాలన్నా... కొత్త చరిత్రను లిఖించాలన్నా తనకు మాత్రమే సాధ్యమని స్టార్‌‌ జావెలిన్‌‌ త్రోయర్‌‌.. ఇండియన్‌‌ అథ్లెటిక్స్‌‌ గోల్డెన్‌‌ బాయ్‌‌ నీరజ్‌‌ చోప్రా మరోసారి చాటి చెప్పాడు. వరల్డ్‌‌ అథ్లెటిక్స్‌‌ చాంపియన్‌‌షిప్స్‌‌ జావెలిన్‌‌ త్రోలో తన భుజ బలం చూపెడతూ బల్లెంను  88.17 మీటర్ల దూరం  విసిరి గోల్డ్‌‌ మెడల్‌‌ సొంతం చేసుకున్నాడు. ఈ మెగా ఈవెంట్‌‌లో ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్‌‌గా రికార్డుకెక్కాడు..!

బడాపెస్ట్‌‌: 

రెండేండ్ల కిందట టోక్యో ఒలింపిక్స్‌‌లో స్వర్ణ కాంతులు విరజిమ్మిన నీరజ్‌‌ చోప్రా మరోసారి దేశం గర్వపడేలా చేశాడు. అథ్లెటిక్స్‌‌లో మేటి పోటీ అయిన వరల్డ్‌‌ చాంపియన్‌‌షిప్‌‌లో ఇండియాకు తొలి బంగారు పతకం అందించాడు. టైటిల్‌‌ ఫేవరెట్‌‌గా బరిలోకి దిగిన నీరజ్‌‌ ఆదివారం అర్ధరాత్రి జరిగిన మెన్స్‌‌ జావెలిన్‌‌ త్రో ఫైనల్లో తన రెండో  ప్రయత్నంలో అత్యధికంగా  88.17 మీటర్ల  దూరం విసిరి చాంపియన్‌‌గా నిలిచాడు.  వ్యక్తిగత క్రీడల్లో ఒలింపిక్‌‌, వరల్డ్‌‌ చాంపియన్‌‌షిప్స్‌‌ గోల్డ్‌‌ గెలిచిన ఆటగాడిగా లెజెండరీ షూటర్‌‌  అభినవ్‌‌ బింద్రా సరసన నిలిచాడు. పాకిస్తాన్‌‌కు చెందిన అర్షద్‌‌ నదీమ్‌‌ 87.82 మీటర్లతో సిల్వర్‌‌, చెక్‌‌ రిపబ్లిక్‌‌ త్రోయర్‌‌ జాకుబ్‌‌ వడ్వెచ్‌‌ 86.67 మీటర్లతో బ్రాంజ్‌‌ గెలిచారు. ఇండియాకు చెందిన కిశోర్‌‌ జెనా (84.77మీ) ఐదో స్థానం సాధించగా.. డీపీ మను (84.14 మీ) వరుసగా ఐదు, ఆరో స్థానాల్లో నిలిచారు. 

ఫౌల్‌‌తో మొదలై..

ఫైనల్లో నాలుగో పొజిషన్‌‌లో బరిలోకి దిగిన నీరజ్‌‌ మొదటి ప్రయత్నంలో ఫౌల్‌‌ చేశాడు. ఫిన్లాండ్‌‌కు చెందిన ఒలీవర్‌‌ హెలాండర్‌‌ 83.38 మీటర్లతో టాప్‌‌లో నిలిచాడు. అయితే, తన రెండో ప్రయత్నంలో నీరజ్‌‌ పర్‌‌ఫెక్ట్‌‌ త్రో చేసి  ఏకంగా 88.17 మీటర్లు విసిరి టాప్‌‌ ప్లేస్‌‌ ఖాయం చేసుకున్నాడు.మూడో ప్రయత్నంలో నీరజ్‌‌ 86.32 మీటర్లు విసరగా.. పాకిస్తాన్‌‌ స్టార్‌‌ అర్హద్‌‌ నదీమ్‌‌ 87.82 మీటర్లతో తన సీజన్‌‌ బెస్ట్‌‌ త్రో చేశాడు. రెండో ప్లేస్‌‌తో ఒక్కసారిగా గోల్డ్‌‌ మెడల్‌‌ రేసులోకి వచ్చాడు. ఊహించినట్టే ఇండో-పాక్‌‌ త్రోయర్ల మధ్య రేసు మొదలైంది.  నాలుగో ప్రయత్నంలో చోప్రా 84.64 మీటర్లతో సరిపెట్టగా.. నదీమ్‌‌ 87.15 మీటర్లు కవర్‌‌ చేయడంతో  పోటీ ఉత్కంఠగా మారింది. కానీ, ఐదో ప్రయత్నంలో నదీమ్‌‌ ఫౌల్‌‌ చేశాడు. ఆఖరి ప్రయత్నంలో నదీమ్‌‌ 81.86తో సరిపెట్టడంతో నీరజ్‌‌కు గోల్డ్‌‌ ఖాయమైంది.  కాగా, మెన్స్​ 4x400 మీటర్ల రిలేలో ఇండియా టీమ్​ 2నిమిషాల 59.52 సెకండ్లతో ఐదో ప్లేస్​తో సరిపెట్టింది. 

ఆకాశమే హద్దు..

(వెలుగ స్పోర్ట్స్‌‌ డెస్క్‌‌): ఆసియా చాంపియన్​ అయ్యాడు. అతని ఆకలి తగ్గలే. ఆసియా గేమ్స్​, కామన్వెల్త్​ గేమ్స్​లోనూ గోల్డ్​ నెగ్గాడు. అయినా అతని విజయకాంక్ష తగ్గలే. ఏకంగా ఒలింపిక్స్​లో స్వర్ణాన్ని పట్టేసి చరిత్ర సృష్టించాడు. అయినా అతని కసి తీరలే. ఇంకా ఏదో వెలితి. మరేదో సాధించాలన్న తపన అతని మెదడును తొలిచేస్తూనే ఉంది. అదే వరల్డ్​ చాంపియన్​షిప్​ గోల్డ్​. గతేడాది తృటిలో చేజారిన బంగారు పతకాన్ని నీరజ్ చోప్రా ఈసారి వదల్లేదు. అవరోధాలను దాటుకుంటూ.. గాయాలను ఓర్చుకుంటూ అనుకున్నది సాధించాడు.  

ఒలింపిక్‌‌ ట్రాక్​ అండ్​ ఫీల్డ్​ ఈవెంట్​లో బంగారు పతకం గెలిచిన దేశ తొలి క్రీడాకారుడిగా శిఖరమంత ఎత్తుకు ఎదిగాడు నీరజ్​. ఒక్కసారిగా ఇండియా హీరో అయిపోయాడు. ప్రైజ్​మనీ, వ్యాపార ఒప్పందాలతో అతనిపై కోట్ల వర్షం కురిసింది. ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్‌‌ ఫాలోయింగ్‌‌ పెరిగింది. చిన్న వయసులోనే ఊహించనటి ఇలాంటి స్టార్‌‌డమ్‌‌ వచ్చిన తర్వాత కూడా ఆటపై దృష్టిని కేంద్రీకరించడం కత్తిమీద సామే. అయితే, ఆటపైనే పూర్తి ఫోకస్ పెట్టిన చోప్రా మరోవైపు గాయాలతోనూ పోరాడాడు.  ఒలింపిక్స్‌‌ తర్వాత గతేడాది వరల్డ్‌‌ చాంపియన్‌‌షిప్‌‌ సిల్వర్‌‌ గెలిచిన నీరజ్‌‌ భుజానికి గాయమైంది. ఆ టోర్నీ ఫైనల్లో నాలుగో త్రో టైమ్‌‌లో కండరాల్లో చీలిక రావడంతో ఆ తర్వాత జరిగిన కామన్వెల్త్‌‌ గేమ్స్‌‌కు అతను దూరం అవ్వాల్సి వచ్చింది. ఈ గాయం నుంచి కోలుకొని డైమండ్​ లీగ్​లో దుమ్మురేపి టైటిల్​ నెగ్గిన చోప్రా ఈ ఏడాది ఆరంభంలో మరోసారి గాయపడ్డాడు. దాదాపు నెల రోజు పాటు గ్రౌండ్‌‌కు దూరం అయ్యాడు. 

ఈ సీజన్​లో వరల్డ్ చాంపియన్​షిప్స్​తో పాటు ఆసియా గేమ్స్​ కూడా ఉండటంతో ఫిట్​నెస్​పై దృష్టి పెట్టాడు. ఇంటికి, దేశానికి దూరంగా ఉండి ఫారిన్‌‌లో ట్రెయినింగ్‌‌ తీసుకుంటున్న చోప్రా ఆటపైనే పూర్తి ఏకాగ్రత నిలిపాడు. పక్కా ప్లానింగ్​తో ప్రిపేర్​ అవ్వడమే కాకుండా.. పరిమితంగా పోటీ పడ్డాడు.  వరల్డ్​చాంపియన్‌‌షిప్స్‌‌కు ముందు నీరజ్​ కేవలం రెండు ఈవెంట్లలోనే  బరిలోకి దిగాడు. గాయం నుంచి కోలుకున్న తర్వాత  మేలో జరిగిన  దోహా డైమండ్‌‌ లీగ్‌‌లో 88.67 మీటర్లతో టాప్‌‌ ప్లేస్‌‌ సాధించి ఔరా అనిపించాడు. అదే నెలలో జావెలిన్‌‌ త్రో ర్యాంకింగ్స్‌‌ వరల్డ్‌‌ నంబర్‌‌ వన్‌‌గా నిలిచాడు. మేలో కూడా కండరాల సమస్యతో బాధ పడ్డ చోప్రా మళ్లీ జులై వరకు కాంపిటీషన్లకు దూరంగా ఉన్నాడు. 

గత నెల లుసానెలో జరిగిన డైమండ్ లీగ్‌‌లో బరిలోకి దిగిన 87.66 మీటర్లతో అగ్రస్థానం సాధించి వరల్డ్‌‌ చాంపియన్‌‌షిప్స్‌‌ ముంగిట అంచనాలు పెంచాడు. అందుకు తగ్గట్టుగానే క్వాలిఫికేషన్‌‌ రౌండ్‌‌లో ఒకే ఒక్క త్రో విసిరి 88.77 మీటర్లతో సీజన్‌‌ బెస్ట్‌‌తో పాటు  పారిస్​ ఒలింపిక్‌‌ బెర్తు కూడా సాధించాడు. ఫైనల్లోనూ అదే జోరు కొనసాగించి గోల్డ్‌‌ నెగ్గే వరకూ విశ్రమించని నీరజ్‌‌ అసలైన విజేత. అత్యద్భుత ప్రతిభకు అసాధారణ కృషి, పట్టుదల తోడైతే ఎలాంటి ఫలితాలు వస్తాయో చెప్పేందుకు నీరజ్​ చోప్రా గొప్ప ఉదాహరణ. ఏదేమైనా  ఓ అత్యుత్తమ అథ్లెట్‌‌ ఒలింపిక్‌‌ గోల్డ్‌‌, వరల్డ్‌‌ చాంపియన్‌‌షిప్‌‌ టైటిల్‌‌, వరల్డ్‌‌ నంబర్‌‌ వన్‌‌ ర్యాంక్‌‌లో ఒక్కటి సాధిస్తేనే గొప్ప. నీరజ్‌‌ ఈ మూడూ అందుకున్నాడు. అతనికి ఇక ఆకాశమే హద్దు..!