స్వర్ణమే కాదు, మనసులు గెలిచిన నీరజ్ చోప్రా.. పాక్ అభిమానుల ప్రశంసలు

స్వర్ణమే కాదు, మనసులు గెలిచిన నీరజ్ చోప్రా.. పాక్ అభిమానుల ప్రశంసలు

భారత స్టార్‌ అథ్లెట్‌(జావెలిన్ త్రో) నీరజ్‌ చోప్రా చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. బుడాపెస్ట్ వేదికగా జరుగుతున్న  ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌లో  నీరజ్..  తన అద్భుత ప్రదర్శనతో దేశానికి బంగారు పతకం అందించాడు. తద్వారా ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌లో పసిడి పతకం సాధించిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు.   

ఇక్కడ మరో విషయమేంటంటే  నీరజ్ చోప్రా.. స్వర్ణం మాత్రమే కాదు, తన ప్రవర్తనతతోనూ ఎంతో మంది మనసులు గెలుచుకున్నారు. ఫైనల్ ముగిసిన తర్వాత నీరజ్.. ఒక ఫోటో కోసం రెండో స్థానంలో నిలిచిన పాక్ త్రోయర్‌ అర్షద్‌ నదీమ్‌‌ను ఆహ్వానించారు. వెంటనే నదీమ్ పరుగున అక్కడకి రాగా.. ఇద్దరూ  చిరునవ్వులు చిందిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పక్క దేశం అందునూ తనతో పోటీ పడ్డ క్రీడాకారుడితో నీరజ్ అంత స్నేహంగా ప్రవర్తించిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. నీరజ్‌పై పాక్ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. 
 
ఈ ఈవెంట్‌లో 88.17 మీటర్లు దూరం విసిరి నీరజ్ చోప్రా స్వర్ణం చేజిక్కించుకోగా, పాకిస్తాన్ త్రోయర్‌ అర్షద్‌ నదీమ్‌ (87.82 మీటర్లు) రజతం.. చెక్‌కు చెందిన వద్లెచ్‌ (86.67 మీటర్లు) కాంస్యం దక్కించుకున్నారు.