న్యూఢిల్లీ: ఇండియా స్టార్ బాక్సర్, డబుల్ వరల్డ్ చాంపియన్ నిఖత్ జరీన్ సొంతగడ్డపై జరిగే ప్రతిష్టాత్మక వరల్డ్ బాక్సింగ్ కప్ ఫైనల్స్ టోర్నమెంట్‌పై గురి పెట్టింది. లివర్‌పూల్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో మెడల్ కోల్పోయిన నిరాశను పక్కనపెట్టి నవంబర్ 14 నుంచి 21 వరకు గ్రేటర్ నోయిడాలో జరిగే ఈ టోర్నీలో గోల్డ్ కొట్టాలని భావిస్తోంది. తద్వారా ఎక్కువ ర్యాంకింగ్ పాయింట్లను అందుకోవడమే తన టార్గెట్ అంటోంది.
పారిస్ ఒలింపిక్స్ తర్వాత సుదీర్ఘ విరామం అనంతరం లివర్‌పూల్ టోర్నీలో పాల్గొన్న నిఖత్ క్వార్టర్ -ఫైనల్లో టర్కీకి చెందిన డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ బుసే నాజ్ చేతిలో ఓడింది. అయితే దాన్ని నిరాశగా భావించడం లేదని, ఒక పాఠంగా తీసుకున్నానని నిఖత్ పేర్కొంది.
రాబోయే వరల్డ్ కప్‌లో మంచి పెర్ఫామెన్స్ చేస్తానని ధీమా వ్యక్తం చేసింది. ఈ టోర్నమెంట్ రాబోయే ఆసియా గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్‌కు చాలా కీలకమని చెప్పింది. ‘వరల్డ్ కప్ ఫైనల్స్‌లో గోల్డ్ మెడల్‌కు 300, సిల్వర్‌కు 150, బ్రాంజ్‌కు 75 పాయింట్లు లభిస్తాయి. ఆసియా, కామన్వెల్త్ గేమ్స్‌లో మెరుగైన సీడింగ్ కోసం ఎక్కువ పాయింట్లు సేకరించడమే నా ప్రయత్నం’ అని 29 ఏండ్ల నిఖత్ తెలిపింది.
బరిలో 18 దేశాల నుంచి 140 బాక్సర్లు
ఇండియా ఆతిథ్యం ఇస్తున్న ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌లో 18 దేశాల నుంచి 140 మందికి పైగా టాప్ బాక్సర్లు పోటీ పడనున్నారు. వీరిలో ముగ్గురు పారిస్ ఒలింపిక్ మెడలిస్టులు ఉన్నారు. ఇండియా 20 మంది బాక్సర్లతో కూడిన బలమైన జట్టు బరిలోకి దిగుతోంది. నిఖత్ జరీన్ (51 కేజీ)తో పాటు, ప్రస్తుత వరల్డ్ చాంపియన్స్ జాస్మిన్ లంబోరియా (57 కేజీ), మీనాక్షి (48 కేజీ), మాజీ వరల్డ్ చాంప్ సవీటి బూరా (75 కేజీ) విమెన్స్ టీమ్‌లో ఉండగా.. మెన్స్ టీమ్‌కు హితేష్ (70 కేజీ), అభినాష్ జమ్వాల్ (65 కేజీ) నాయకత్వం వహిస్తున్నారు.
జాదుమణి సింగ్ (50 కేజీ), పవన్ బర్త్వాల్ (55 కేజీ), సచిన్ (60 కేజీ), సుమిత్ (75 కేజీ), లక్ష్య చహర్ (80 కేజీ), జుగ్నూ (85కేజీ), నవీన్ కుమార్ (90కేజీ), నరేందర్ (90+కేజీ) కూడా తమ సత్తా చాటడానికి సిద్ధంగా ఉన్నారు. అమ్మాయిల్లో ప్రీతి (54కేజీ), పర్వీన్ (60కేజీ), నీరజ్ ఫొగాట్ (65కేజీ), అరుంధతి చౌధరి (70కేజీ) కూడా ఈ టోర్నీకి క్వాలిఫై అయ్యారు.
ప్రపంచంలోని అత్యుత్తమ బాక్సర్లతో స్వదేశంలో పోటీ పడటం మన దేశ బాక్సర్లకు తమ సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశమని బీఎఫ్‌ఐ ప్రెసిడెంట్ అజయ్ సింగ్ పేర్కొన్నారు. ఈ టోర్నీకి ఆతిథ్యం ఇవ్వడం ద్వారా బాక్సింగ్ పవర్‌హౌస్‌గా ఇండియా స్థాయి పెరుగుతోందని చెప్పారు.
